ETV Bharat / state

Building Up Lifting: మూడంతస్థుల భవనం.. నాలుగడుగులు పైకి.. ఎలా సాధ్యం..!

author img

By

Published : Mar 28, 2022, 1:26 PM IST

three four building lifted to four feet
మూడు అంతస్థుల భవనం.. నాలుగడుగులు పైకి..

Stairs Up Lifting: అది ఓ మూడు అంతస్థుల భవనం. అందులో ఆ భవన యజమాని లాడ్జి నిర్వహిస్తున్నాడు. కానీ రహదారి కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల దాని నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండేది. అయితే ఆ భవనాన్ని పునర్నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాడు. అదే "అప్‌ లిఫ్టింగ్". అసలు అప్‌ లిఫ్టింగ్ అంటే ఏమిటి? దాని పనితీరు ఏమిటో తెలుసుకుందామా?

మూడు అంతస్థుల భవనం.. నాలుగడుగులు పైకి..

Stairs Up Lifting: అది కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ప్రధాన కూడలిలో ఓ 3 అంతస్తుల భవనం. రహదారి కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల అందులోని లాడ్జి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండేది. వ్యాపారాభివృద్ధి మీద దృష్టిపెట్టిన యజమాని, భవనాన్ని పునర్నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాడు. అప్‌ లిఫ్టింగ్ ద్వారా భవనాన్ని నాలుగు అడుగులు పైకి లేపేందుకు చర్యలు చేపట్టారు.

కృష్ణా జిల్లా చల్లపల్లిలోని 3 అంతస్తుల మయూరి లాడ్జి భవనం అప్ లిఫ్టింగ్ పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రహదారి కంటే దిగువన ఉన్న లాడ్జి భవనానికి మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు యజమాని కాట్రగడ్డ రామ్మోహన్‌రావు లిఫ్టింగ్‌ విధానానికి మెుగ్గు చూపారు. విజయవాడ జేజే బిల్డింగ్ అప్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీసెస్ వాళ్లను సంప్రదించారు. భవనం దెబ్బతినకుండా సుమారు 12 లక్షల రూపాయల ఖర్చుతో అప్ లిఫ్టింగ్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది.. బిల్డింగ్ కింద కాంక్రీట్ భాగాన్ని తొలగించి జాకీలు ఏర్పాటు చేసి, భవనాన్ని కొద్ది కొద్దిగా పైకి లేపుతున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఇటుకలు, సిమెంట్‌, కెమికల్ ఉపయోగించి గోడల నిర్మాణం చేస్తున్నారు.

భవనాన్ని పైకి లేపే క్రమంలో ఎలాంటి పగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కావాల్సిన ఎత్తుకు బిల్డింగ్ లేపిన తరువాత గతంలోని పిల్లర్లకు ఐరన్‌ రాడ్లను వెల్డింగ్ చేయనున్నారు. సుమారు 40 రోజుల్లో బిల్డింగ్‌ పైకి లేపే పనులు పూర్తి చేస్తామంటున్న కంపెనీ ప్రతినిధులు, భవన రక్షణకు 70 ఏళ్ల వరకు బాధ్యత వహిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Psychiatric Patients: 'దీర్ఘకాలిక వ్యాధుల కంటే మానసిక రుగ్మతలే ప్రమాదకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.