ETV Bharat / state

దుశ్చర్య.. వైకాపా దాడిలో కన్ను కోల్పోయిన తెదేపా నేత

author img

By

Published : Sep 4, 2022, 7:42 AM IST

తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.

attack
attack

తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో ..బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.

తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడలో కార్పొరేటర్‌గా గాంధీ 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 9డివిజనుకు ఆయన భార్య కాంతిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 9వ డివిజన్‌లో పైపులైను లీకేజీపై ఫిర్యాదులు అందితే ...దగ్గరుండి కార్పొరేషన్‌ సిబ్బందితో ఆయన పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నేతలు అక్కడికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం హయాంలో నీ పెత్తనమేంటంటూ వాగ్వాదానికి దిగారు. ఆ డివిజన్‌కే చెందిన వైకాపా అధ్యక్షుడు గద్దె కళ్యాణ్, వైకాపా ఇంఛార్జ్‌ వల్లూరి ఈశ్వరప్రసాద్, కార్యకర్త సుబ్బుతో పాటు మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ముష్టి ఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో అతని కుడికన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుపడటంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. చెన్నుపాటి గాంధీని ద్విచక్రవాహనంపై తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు.


ప్రణాళికా ప్రకారమే చెన్నుపాటి గాంధీపై దాడి చేసినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవిత ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో అంతా కలిసి వేడుకలు చేసుకునేవారు. ఈ మధ్య పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో చవితి వేడుకలు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో రాజకీయ కక్షతో దాడి చేశారనే మండిపడుతున్నారు.

NTR పార్టీ స్థాపించినప్పటి నుంచి గాంధీ అంచెలంచెలుగా ఎదిగారు. NTR ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా, అర్బన్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా .. నాలుగు సార్లు తెదేపా కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీంతో రాజకీయంగా గాంధీని ఎదుర్కొలేక హత్యాయత్నానికి కుట్ర పన్నారనే మాట వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్‌ గెలుపొందారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ తూర్పు నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది గెలిచారు. 21 డివిజన్లలో 8మంది గెలుపొందారు. వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన బొప్పన భవకుమార్‌ ఓడిపోయారు. ఆయన వైకాపా నగర అధ్యక్షుడిగా ఉన్నారు. అదే నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా దేవినేని అవినాష్‌ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దాడి చేసిన వారంతా అవినాష్‌ అనుచరులేనని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో పట్టాభి నివాసంపై దాడి చేసిన ఘటనలోనూ తూర్పు నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతల ప్రమేయం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. తెదేపా తరపున గెలిచిన కార్పొరేటర్ల డివిజన్లలో వైకాపా ఇంఛార్‌లే పెత్తనం చెలాయిస్తున్నారు. కరెన్సీ నగర్‌లో ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా కార్పొరేటర్‌ , మాజీ మంత్రి అనుచరులు AP టూరిజం అధికారిని ఇటీవలే కొట్టారు. జనసేన నాయకులపైనా దాడి చేశారు. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడ్డారు. జి.కొండూరు మండలంలో తెదేపా నేతల పర్యటనను అడ్డుకున్నారు. నందిగామలోనూ తరచూ దాడులు చేస్తున్నారు. మచిలీపట్నంలో ఎన్నో సార్లు ఘర్షణలకు దిగారు. గుడివాడలో క్యాసినో సంఘటన సందర్భంగా తెదేపా నేతలు నిజనిర్థారణకు వెళితే ...వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఇటీవల గుడివాడలో ఇంఛార్జ్‌ రావి వెంకటేశ్వరరావుపై దాడి చేశారు. తిరువూరు, గన్నవరంలోనూ ఇదే పరిస్థితి. ప్రభల ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఇటీవలే ఘర్షణ జరిగాయి. చాలా చోట్ల తెదేపా నేతల ఫ్లెక్సీలు చించేశారు. గుడివాడలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూల్చివేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు జనసేన జెండా దిమ్మె కూల్చేశారు.

అటు చెన్నుపాటి గాంధీపై దాడికి పాల్పడింది వైకాపా ఫ్యాక్షన్ మూకలేనని చంద్రబాబు మండిపడ్డారు. వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గాంధీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు. దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుందో అధికారంలోకి వచ్చాక చూపిస్తామన్నారు. రెచ్చిపోతున్న వైకాపా రౌడీల‌ పేర్లు రాస్తున్నామని హెచ్చరించారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.