ETV Bharat / state

హైదరాబాద్​: 'భారత్ బయోటెక్​'లో ప్రధాని.. కోవాగ్జిన్ సన్నద్ధతపై పరిశీలన

author img

By

Published : Nov 28, 2020, 2:22 PM IST

Updated : Nov 28, 2020, 3:00 PM IST

కరోనా వేక్సిన్ సన్నద్ధతలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. అహ్మదాబాద్​ నుంచి నేరుగా హైదరాబాద్​ వెళ్లిన ఆయన.. జీనోమ్​ వ్యాలీ చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమావేశమై కోవాగ్జిన్​కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

The Prime Minister visited Bharat Biotech in Hyderabad
హైదరాబాద్​లో భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని

హైదరాబాద్​లో భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని

కరోనా స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సన్నద్ధతను.. ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిన ప్రధానికి హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్, ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. హకీంపేట నుంచి నేరుగా జినోమ్‌ వ్యాలీలోని భారత్ బయోటెక్‌కు ప్రధాని చేరుకున్నారు. అక్కడ సంస్థ ప్రతినిధులు ప్రధానికి స్వాగతం పలికారు. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా దంపతులు సహా శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు.

ఐసీఎంఆర్ ​- భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా తయారు చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్.. కోవాగ్జిన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 2 దశల్లోనూ కొవాగ్జిన్ మంచి ఫలితాలు చూపింది. స్వదేశీ వ్యాక్సిన్.. కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాలను భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు.

త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ఇటీవలే ప్రధాని సమీక్షించారు. వ్యాక్సిన్‌ నిల్వచేసుకునే సదుపాయాలతోపాటు పంపిణీ ప్రాధాన్యాలను వివరించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉండగా స్వదేశీ వ్యాక్సిన్‌లలో భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్ ముందుంది. జైడస్‌ క్యాడిలా తయారు చేస్తున్న జైకోవ్‌ - డీ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉదయం అహ్మదాబాద్ వెళ్లిన ప్రధాని జైడస్‌ క్యాడిలాను సందర్శించారు. వ్యాక్సిన్ పనితీరు.. ప్రయోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీకి వచ్చిన ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు.

ఇదీ చూడండి:

టీకా టూర్​: కొవాగ్జిన్ పురోగతిపై ప్రధాని ఆరా

Last Updated :Nov 28, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.