ETV Bharat / state

chandrababu : 'పాదయాత్రలో ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు.. ఇదే జగన్ తీరు'

author img

By

Published : Apr 14, 2023, 4:08 PM IST

Chandrababu naiduu : రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరుగుతున్న నష్టం ఎక్కువ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో క్రైస్తవులకు, దళిత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ పథకం టీడీపీ పెడితే.. దానిని జగన్ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని తెలిపారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్​గా ఎన్టీఆర్ ఉన్నపుడే అంబేడ్కర్​కు భారతరత్న ప్రకటించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.

Etv Bharat
Etv Bharat

Chandrababu naiduu : పాము తన గుడ్లు తాను తిన్నట్టు.. తనకు ఓట్లేసిన వారి పైనే జగన్‌ ప్రభుత్వం దాడులు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు అందర్నీ పిడిగుద్దులు గుద్దినట్టే.. ఎస్సీలను గుద్దుతున్నాడని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు నేతృత్వంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాలు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. దళిత కుటుంబాల్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని ఆక్షేపించారు.

ఉచిత విద్యత్ పథకానికి మంగళం... అన్ని కులాలకంటే ఎక్కువ పేదరికం ఎస్సీల్లోనే ఉందన్నారు. ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని తాను పథకం పెడితే.. దాన్ని జగన్ నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు. విద్యుత్ ధరలు పెంచి ఎస్సీలపై భారం మోపాడని మండిపడ్డారు. చరిత్రలో దళితులపై ఎప్పుడూ జరగనన్ని దాడులు ఇప్పుడే జరుగుతున్నాయని అక్షేపించారు. అంబేద్కర్ ఆనాడే దళితులపై దాడులు ఈ స్థాయిలో జరుగుతాయని ఆలోచన చేస్తే.. దళితులపై దాడులు చేసిన వారిని ఉరేయాలని చట్టం చేసేవారన్నారు. దళిత డాక్టర్ మొదలుకుని.. దళిత డ్రైవర్ వరకు అందరూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. వేధింపులు భరించలేక ఎస్సీ అధికారి అచ్చెన్న చనిపోతే.. సీఎం జగన్ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ అంబేడ్కర్​కు నిజమైన వారసుడు... ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆరే.. అంబేడ్కర్​కు నిజమైన వారసుడని తెలిపారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడే నాటి కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్​కు భారత రత్న ప్రకటించిందని గుర్తు చేశారు. దళితుడైన కేఆర్ నారాయణన్ను రాష్ట్రపతిగా గెలిపించింది తెలుగుదేశమే అని చెప్పారు. బాలయోగిని లోక్ సభ స్పీకరుగా చేశాం.. కాకి మాధవరావుని సీఎస్ గా చేసిన ఘనత టీడీపీ దే అని తెలిపారు. దళితుల పట్ల అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసింది తామే అని గుర్తుచేశారు. జస్టిస్ పున్నయ్య ఇచ్చిన 42 రికమెండేషన్లను ఆమోదించామని... వివక్ష చూపితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదేశించామని చెప్పారు. అమరావతిలో భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించామని.. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ పాలనలో జరుగుతున్న నష్టమే ఎక్కువ.. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతగా రాష్ట్రం దెబ్బతిందో క్రైస్తవ సంఘాలు ఆలోచన చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. సేవా భావంతో క్రైస్తవ సంఘాలు పని చేస్తుంటే, బాధ్యత విస్మరించిన ముఖ్యమంత్రి.. దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదరిక నిర్మూలనకు క్రైస్తవ సంఘాలు తమ వంతు కృషి చేస్తున్నాయని అన్నారు. తెలుగుదేశంతో కలిసి పనిచేస్తే ఆర్థిక అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. గుడివాడలో టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘ కాపరులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చర్చిలను వేదికగా చేసుకుని ఫాస్టర్లు ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సేవా భావంతో మూర్తి విశాఖలో గీతం యూనివర్సిటీ నెలకొల్పితే దానిపైనా విధ్వంసానికి దిగారని విమర్శించారు. చేయూతనివ్వాల్సిన సేవా సంస్థల పట్ల ఈ ముఖ్యమంత్రి సాయం చేయక పోగా చేసే దాడులపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. క్రైస్తవుల మనోభావాలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్తామన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.