ETV Bharat / state

KRISHNA Board: నిర్వహణకు నిధులేవి కృష్ణా!

author img

By

Published : Jul 24, 2021, 8:20 AM IST

Krishna and Godavari boards
కృష్ణా, గోదావరి బోర్డు

కృష్ణా, గోదావరి బోర్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాలు అరకొరగా నిధులు విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఒకేసారి ఏకమొత్తంగా నిధులు విడుదల చేస్తాయా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున ఇస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

నాలుగైదేళ్లుగా అరకొర నిధులు విదిలిస్తున్న రాష్ట్రాలు ఇప్పుడు ఏకమొత్తంగా విడుదల చేస్తాయా? ఐదారేళ్లుగా బడ్జెట్‌ కేటాయింపునకు, విడుదలకు పొంతన లేక కృష్ణా, గోదావరి బోర్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాల నుంచీ నిధులు రాలేదు. ఒక్క కృష్ణా బోర్డుకే బడ్జెట్‌ కేటాయింపు ప్రకారం రూ. 70.98 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ. 21.77 కోట్లు మాత్రమే. అలాంటిది కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఒక్కో రాష్ట్రం రూ. 200 కోట్ల చొప్పున ఇస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

రూ. 200 కోట్ల చొప్పున జమ చేయాలంటూ ఇప్పటికే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు తెలిసింది. గోదావరి బోర్డుకు జీతభత్యాలు తప్ప ఇతరత్రా పెద్ద ఖర్చులేవీ లేవు. కృష్ణా బోర్డుకు మాత్రం టెలీమెట్రీతో సహా పలు అంశాలున్నాయి. 2014-15 నుంచి 2020-21 వరకు రూ. 70.98 కోట్ల బడ్జెట్‌కు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రూ. 35.49 కోట్లు, తెలంగాణ రూ. 35.49 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఏపీ ఇప్పటివరకు రూ. 12.56 కోట్లు ఇవ్వగా, తెలంగాణ రూ. 9.21 కోట్లు ఇచ్చినట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో కృష్ణాబోర్డు పేర్కొంది.

2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఏపీ నుంచి నిధులు రాలేదు. 2020-21లో తెలంగాణ నుంచీ విడుదల కాలేదు. 2014-15 నుంచి రెండు రాష్ట్రాలు కలిపి రూ. 21.77 కోట్లు విడుదల చేయగా, రూ. 18.16 కోట్లు ఖర్చు చేశారు. నిధులు లేక టెలీమెట్రీ ముందుకు సాగడంలేదు. బోర్డుల పరిధిని ఖరారు చేసిన నేపథ్యంలో కేవలం కృష్ణా బోర్డుకు మాత్రమే ఒకేసారి మూలధనంగా రెండు ప్రభుత్వాలు కలిపి రూ. 400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధుల కోసం బోర్డు లేఖలు రాసినా రెండు ప్రభుత్వాలు ఏమేరకు స్పందిస్తాయో చూడాలి!

ఇవీ చూడండి:

schools reopen: ఆగస్టు 16 నుంచి బడులు... అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.