ETV Bharat / state

పరిశ్రమలకు విద్యుత్‌ సుంకం బాదుడు.. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అధికం

author img

By

Published : Nov 10, 2022, 12:27 PM IST

Electricity Tariff
Electricity Tariff

Electricity Tariff : కొవిడ్‌తో సవాళ్లను ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగంపై.. ప్రభుత్వం విద్యుత్‌ సుంకం బాదుడు వేసింది. ఆదుకోవాల్సిన సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా సెస్‌ విధించి.. ఏటా 2వేల 600కోట్ల భారాన్ని మోపింది. గడిచిన నాలుగు నెలల్లోనే 867 కోట్లు రాబట్టింది.

SUNKAM : విద్యుత్‌ సుంకాన్ని పెంచడం ద్వారా పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులపై ఏటా సగటున 2,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపింది. యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న సుంకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రూపాయికి పెంచింది. ఈ లెక్కన గతంలో చెల్లించే మొత్తంతో పోలిస్తే ఒకేసారి 1,667 శాతం పెరిగింది. 2022లో మే నుంచి ఆగస్టు వరకు పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్ల ద్వారా 9,225.12 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. దీనిపై పెరిగిన సుంకం ప్రకారం 922.51 కోట్లను డిస్కంలు వసూలు చేశాయి. గతంలోలా యూనిట్‌కు 6 పైసలు చొప్పున పరిగణిస్తే... ఇదే విద్యుత్‌ వినియోగానికి 55.35 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్‌ సుంకం పెంపుతో నాలుగు నెలల్లోనే 867.16 కోట్ల భారం పడింది. ఈ రూపేణా సబ్సిడీల భారాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మన రాష్ట్రంలోనే అధికం : దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే విద్యుత్‌ సుంకం ఎక్కువగా ఉంది. తెలంగాణలో యూనిట్‌కు 6 పైసలు, కేరళలో 10 పైసల చొప్పున అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. తమిళనాడులో యూనిట్‌కు 36 పైసలు, కర్ణాటకలో యూనిట్‌కు 47 పైసలు వంతున విద్యుత్‌ సుంకాన్ని విధిస్తున్నాయి. అత్యధికంగా వసూలు చేస్తున్న కర్ణాటకతో పోల్చినా మన రాష్ట్రంలో 213శాతం అధికంగా వసూలు చేయడం గమనార్హం. విద్యుత్‌ టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలతో కలిపి యూనిట్‌కు సగటున 7రూపాయల 60పైసల వంతున డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీనికి ట్రూఅప్‌ ఛార్జీలు కలిపితే యూనిట్‌ ధర సుమారు 8 వరకు చేరింది. విద్యుత్‌ సుంకం పెంపుతో యూనిట్‌కు 9 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.

సవాళ్లను ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాలు : నోట్ల రద్దు, జీఎస్టీ పెంపు వంటి పరిణామాలతో కొన్నేళ్లుగా పారిశ్రామిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. కొవిడ్‌ తర్వాత ఆర్థిక సమస్యలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక రంగాన్ని ఆదుకోడానికి బదులుగా విద్యుత్‌ సుంకాన్ని పెంచడం ద్వారా వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం వేయడం ఏమిటని పరిశ్రమల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ భారాన్ని తట్టుకోవడం చిన్న పరిశ్రమలకు కష్టమని చెబుతున్నారు. మరోవైపు కొవిడ్‌ సమయంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలు 188 కోట్లు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ చెల్లించకపోవడాన్నీ పారిశ్రామికవేత్తలు తప్పుపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.