ETV Bharat / state

Employees Protest Against CPS: జగన్ మాటలు నమ్మి మోసపోయాం.. సెప్టెంబర్ 1 చీకటి దినం: సీపీఎస్ అసోసియేషన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 3:22 PM IST

Employees Protest Against CPS : సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1 ఉద్యోగుల పాలిట చీకటి దినమని.. పాత పెన్షన్​ను పునరుద్ధరించాలనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. సీపీఎస్​ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

Employees_protest_against_CPS
Employees_protest_against_CPS

Employees protest against CPS : సీపీఎస్​ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నల్లబ్యాడ్జీలతోనే హాజరై నిరసన తెలిపారు. సీపీఎస్ అమలైన సెప్టెంబరు 1 తేదీని ఉద్యోగుల పాలిట చీకటిదినంగా పాటిస్తున్నట్టు సీపీఎస్ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఓపీఎస్​ను పునరుద్ధరించాలంటూ సీపీఎస్ ఉద్యోగులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోనూ జీపీఎస్​ను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యోగులు చేపట్టారు. ఓపీఎస్​ను పునరుద్ధరించాలంటూ సంతకాలు సేకరించిన ఉద్యోగులు వినతిపత్రాన్ని సీఎస్ కార్యాలయానికి అందజేశారు. జీపీఎస్ ప్రతిపాదన (GPS proposal) కు వ్యతిరేకంగా సచివాలయంలో అన్ని బ్లాకుల నుంచి బయటకు వచ్చి సీపీఎస్ ఉద్యోగులు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Prathidwani: ప్రభుత్వ ఉద్యోగుల పింఛను పోరాటం మళ్లీ ఉద్ధృతం కాబోతుందా?

సెప్టెంబర్ 1 చీకటి దినం.. సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1 ఉద్యోగుల పాలిట చీకటిదినమని.. పాతపెన్షన్​ను పునరుద్ధరించాలనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. గతేడాది దీనిపై నిరనస తెలియచేసినందుకు ఉక్కుపాదంతో ప్రభుత్వం ఆందోళనను అణచివేసిందని తెలిపింది. సీపీఎస్ నుంచి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ అంటోదని.. ఇదెలా సాధ్యమని నేతలు ప్రశ్నించారు. 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల వాణిని మంత్రివర్గ ఉపసంఘానికి వివరించామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ (AP Secretariat CPS Association) నేతలు వ్యాఖ్యానించారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సొమ్మును ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పటం లేదని నేతలు ఆక్షేపించారు. ఠక్కర్ కమిటీ (Tucker Committee ) ప్రతిపాదనలు పక్కన పెట్టి జగన్ మాటలు నమ్మి ఓపీఎస్ ఇస్తారని భ్రమపడ్డామని ఆరోపించారు. ఉద్యోగుల డబ్బుతోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమేమిటని అసోసియేషన్ నేతలు ప్రశ్నించారు. ఆర్డినెన్సు తెచ్చేముందు శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ కంటే ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ దారుణంగా ఉందని.. దాన్ని అమలు చేసి లక్షలాది మంది ఉద్యోగులను ముంచొద్దని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Employees Protest Against CPS: జగన్ మాటలు నమ్మి మోసపోయాం.. సెప్టెంబర్ 1 చీకటి దినం: సీపీఎస్ అసోసియేషన్

Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?

పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సెప్టెంబర్ 1ని చీకటిరోజుగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చి పాత పింఛన్​కు సమానమైన పెన్షన్ ఇస్తున్నామని చెప్తోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఎన్నో అసంబద్ధ విధానాలు గమనించాం. ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలి. పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. - కోట్ల రాజేష్, అధ్యక్షుడు ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్

రిటైర్డ్ అయ్యే నాటికి మేం దాచుకున్న డబ్బు ఎంతైతే ఉంటుందో దాని ఆధారంగా పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. నాకు రిటైర్డ్ అయ్యేనాటికి మా ఖాతాలో ఉన్న నిల్వల ఆధారంగా పెన్షన్ ఇస్తామనడం సరికాదు. ఈ విషయంలో సరైన క్లారిటీ లేదు. - వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏపీ సచివాలయం సీపీఎస్ అసోసియేషన్

సీపీఎస్ ప్రతిరూపమే జీపీఎస్. ఈ నూతన ప్రతిపాదనలను మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదు. మా డబ్బులతో మాకే పెన్షన్ ఇవ్వడం సరికాదు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త విధానం అమలు చేసి కొంత పెంచి ఇస్తే బాగుంటుంది. మా పోరాటం ప్రభుత్వంపై కాదు.. ఉద్యోగ సంఘాల నాయకులపైనా పోరాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. - ఎన్.ప్రసాద్, నేత ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్

జీపీఎస్ లోపభూయిష్టంగా ఉంది. విధి విధానాలు బయటపెట్టకుండా ఆగమేఘాలపై ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదు. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి హడావుడి నిర్ణయాలు సరికాదు. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా..? - మాధవి, ఉపాధ్యక్షురాలు ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్

Prathidwani: సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.