ETV Bharat / state

ఒకటో తేదీనే జీతాలు !: హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

author img

By

Published : Jan 31, 2023, 10:09 AM IST

APGEA SuryaNarayana Petition : జీతాల కోసం గవర్నర్ను ఎందుకు కలిశారంటూ.. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. మెమో(షోకాజ్)ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

APGEA SuryaNarayana Petition : ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ను కలిసిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వద్దకు ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర స్పందిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యం సర్వీసు వ్యవహారానికి సంబంధించినదని భావించి హైకోర్టు రిజిస్ట్రీ.. రోష్టర్‌కు భిన్నంగా ఈ బెంచ్ వద్దకు వ్యాజ్యాన్ని విచారణకు వేసిందన్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యం సర్వీసు సంబంధ విషయం కాదన్నారు.

ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చూడాలంటూ గవర్నర్ను కలిసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23న షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే పిటీషనర్ సంఘం గుర్తింపును రద్దు చేస్తామని పేర్కొన్నారన్నారు. అత్యవసరం ఉన్న నేపథ్యంలో మంగళవారం ఈ వ్యాజ్యం తగిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర ప్రయోజనాల చెల్లింపులో తరచూ జాప్యం జరుగుతోందని... అధికరణ 72, 1990 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు ఇలాంటి చర్యలు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 2021 జులై 8న, సంబంధిత అధికారులకు సైతం వినతులు ఇచ్చామన్నారు.. ఉద్యోగుల సంతృప్తి మేరకు సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తమ వినతులను పట్టించుకోవకపోవడంతో చివరికి గవర్నర్ను కలసి సమస్య పరిష్కారానికి విన్నవించాలని నిర్ణయించామన్నారు. ఈనెల 19న కలిసిన తర్వాత జీతం జాప్యం కావడంతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యపై మీడియాతో మాట్లాడామని తెలిపారు. గవర్నర్ను కలవడం, మీడియాతో మాట్లాడిన తర్వాత వివిధ ఆరోపణల్లో ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని... అవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. పత్రిక కథనాలను ఆధారం చేసుకుని నోటీసు ఇచ్చిందన్నారు.

పిటిషనర్ సంఘం గుర్తింపును ఉపసంహరించాలని ముందుగా నిర్ణయించుకొని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులో ఆరోపించినట్లు జనవరి 19న నిర్వహించిన పత్రిక సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సదుద్దేశంతో వినతి సమర్పించామన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈనెల 23న ఇచ్చిన మెమో(షోకాజ్)ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించండి. దాని అమలును నిలుపుదల చేయాలని కోరారు. సాధారణ పరిపానల శాఖ (సర్వీసు సంక్షేమం) కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.