ఇప్పుడు ఈ బాదుడేంటో?.. ఏపీలో విలేకర్లకు నోటీసులు

author img

By

Published : Jan 21, 2023, 10:55 AM IST

notices to reporters

NOTICES TO REPORTERS IN AP : వారంతా చిరుద్యోగులు. జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేసే స్థానిక విలేకర్లు. అయితే తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసులు చూసి అవాక్కవుతున్నారు.

NOTICES TO REPORTERS : వారంతా చిరుద్యోగులు. జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేసే స్థానిక విలేకర్లు. ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసు చూసి అవాక్కవుతున్నారు. ఐదేళ్ల కాలానికి పాత బకాయిలు సహా రూ.12,500 వృత్తిపన్ను కట్టాలన్నది ఆ నోటీసు సారాంశం. ఎన్నో ఏళ్లుగా విలేకర్లుగా పనిచేస్తున్నా... గతంలో ఎన్నడూ లేనిది, ఇప్పుడు ఈ బాదుడేంటో అర్థంకాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి రూ.12,500 ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వృత్తి పన్ను కట్టాలంటూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు ఈ నెల 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ సర్కిల్‌ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు ఏటా రూ.2,500 చొప్పున మొత్తం రూ.12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న విలేకర్లు శుక్రవారం వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలసి... దీనిపై ప్రశ్నించారు. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్‌ కార్డులు ఉన్న విలేకర్లందరి నుంచీ వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకే నోటీసులు జారీచేశామని ఆయన బదులిచ్చారు.

వృత్తిపన్ను భారాన్ని తొలగించాలి: పాత్రికేయులపై వృత్తిపన్ను భారం లేకుండా మినహాయించాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్లు డిమాండు చేశాయి. ‘వేతనాలు లేక ఉద్యోగ భద్రత కరవై పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో పన్ను కట్టాలంటూ నోటీసులివ్వడం సరికాదు. గతంలో రాజంపేటలో పాత్రికేయులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మళ్లీ ఇప్పుడు అమలాపురంలో తెరమీదకు తెచ్చింది’ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.