ETV Bharat / state

పంట విరామం ప్రకటించిన కౌలు రైతులు.. గోదావరి జిల్లాలో 80 శాతం సాగుదారులు వీరే

author img

By

Published : Jun 15, 2022, 4:47 AM IST

Updated : Jun 15, 2022, 10:23 AM IST

Crop Holiday in Konaseema: కోనసీమలో కౌలు రైతులు పంట విరామం ప్రకటించారు. తొలి పంట వేయలేమని ఇప్పటికే భూ యజమానులకు చెప్పేశారు. ఇంటిల్లిపాది కూలి చేసి సంపాదించుకున్న డబ్బులు కూడా కౌలు పేరిట మాగాణుల్లో పెట్టి నిండా మునిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ముంపుతో మూడేళ్లుగా నష్టాల పాలవుతున్నామని.. ఇక సేద్యం చేసి ఫలితమేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈసారి విరామం ప్రకటించినట్లు చెబుతున్నారు. పంట విరామం ప్రకటించిన గ్రామాల్లో ‘ఈటీవీ భారత్​ - ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన ఇలా ఉంది..

Lease farmers on crop holiday
Lease farmers on crop holiday

పంట విరామం ప్రకటించిన కౌలు రైతులు

Lease farmers declare crop holiday: కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలాల్లో ‘ఈటీవీ భారత్​ -ఈనాడు’బృందం పరిశీలించింది. రైతులు, కౌలుదారులు, కూలీలతో మాట్లాడింది. ఏటా నష్టాలతో విసిగిపోయామని, ఈసారి తొలి పంట వదిలేస్తున్నామని స్పష్టంచేశారు. వర్షాలు తగ్గాక రబీలో వరి వేస్తే కొంతైనా గట్టెక్కుతామని అంటున్నారు. సొంత భూమి ఉండి సాగు చేసుకుంటున్న వారితో పోల్చితే తామే ఎక్కువగా నష్టపోతున్నామంటూ కౌలుదారులు తమ అనుభవాలను ఏకరవు పెట్టారు. అందుకే జూన్‌ 1న డెల్టాలో కాల్వలకు నీళ్లొదిలినా ఇప్పటికీ ఆకు మడులు సిద్ధం చేయడం లేదు.

గోదావరి ప్రాంత రైతులు అధిక వర్షాలతో మూడేళ్లుగా నష్టపోతున్నారు. ఏటా రెండు, మూడుసార్లు పొలాలు ముంపునకు గురువుతున్నాయి. గతేడాది నారు మడి దశలోనే వర్షాలు ముంచేశాయి. కొందరు మళ్లీ నారు పోయగా, మరికొందరు దూరప్రాంతాల నుంచి కొనుక్కొచ్చి నాట్లు వేయడం వల్ల ఖర్చు పెరిగింది. నాట్లు పడ్డాక మూణ్నాలుగు వారాల్లో వర్షాలు కురవడంతో వారానికి పైగా నీరు నిలిచి పంట కుళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన పంటను కాపాడుకునేందుకు ఎరువులు, పురుగు మందుల పిచికారీకి 2 వేల నుంచి 3వేలు అదనంగా ఖర్చు చేశారు.

కోతల సమయంలోనూ వర్షాలతో పంట నేల వాలిపోవడం, మొలకలు రావడం, హార్వెస్టర్, ట్రాక్టర్లకు కిరాయిలు చెల్లించడం భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి ఆశిస్తుంటే.. 20 బస్తాలైనా రావడం లేదంటున్నారు. పండించిన ధాన్యంలో తేమ తగ్గించేందుకు కళ్లాల్లో ఆరబెట్టినప్పుడు వానలు కురిసి నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ 75 కిలోల బస్తాకు వ్యాపారులు 11వందల నుంచి 12 వందల మధ్యే చెల్లిస్తున్నారు.

ఎకరాకు 40 వేల పెట్టుబడి పెట్టినా కౌలుదారులకు ఎలాంటి గుర్తింపూ లేదు. పట్టాదారు పాసుపుస్తకం నకళ్లు ఇవ్వకపోవడంతో... సాగుదారు హక్కు కార్డులు పొందలేకపోతున్నారు. విత్తన రాయితీలు, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా అందడం లేదు. అన్నీ భూయజమాని బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి. పంట అమ్మగా వచ్చిన సొమ్ము కూడా యజమాని ఖాతాలోనే పడుతుంది. అందులోంచి తమకు రావాల్సిన డబ్బులు మినహాయించుకుని మిగిలింది కౌలుదారుకు ఇస్తున్నారు. మద్దతు ధర దక్కక బస్తాపై 250 వరకు నష్టపోతున్నా, చాలాచోట్ల యజమానులు ఆ మేరకు తగ్గించుకోవడం లేదు.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పంటలు సాగుచేస్తున్నది కౌలుదారులే. సొంతంగా చేసుకునే భూయజమానులు 15శాతం లోపే ఉంటారని అంచనా. ఈ-పంటలో మాత్రం 80శాతానికి పైగా యజమానులే సేద్యం చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూపిస్తున్నాయి. అర ఎకరం లేదా ఎకరం సొంత పొలమున్న చిన్న రైతులు మరో ఐదారు ఎకరాలు కౌలుకు తీసుకుంటున్నారు. వీరికి చాలావరకు భూయజమానులే పెట్టుబడి సమకూరుస్తున్నారు. లేదా కమీషన్‌ వ్యాపారి ద్వారా అప్పులు ఇప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది కౌలురైతులు ఉన్నట్లు 2015లో ప్రభుత్వం అంచనా వేయగా.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే 5.70 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 6 లక్షలకు మించినట్లు అంచనా. ఇటీవల యువత కూడా ఒకట్రెండు ఎకరాలు కౌలుకు తీసుకుంటూ వరి వేస్తున్నారు. సొంతంగా చేసుకోలేక, కౌలుకు ఇవ్వలేనివారు భూముల్ని ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.