ETV Bharat / city

గుంటూరు రోడ్లు.. గుంతలమయం..!

author img

By

Published : Jun 14, 2022, 10:18 PM IST

GMC Roads Damage:నగరాలంటే అభివృద్ధికి ఆనవాళ్లు.! అలాంటి చోట రోడ్లంటే.. అద్దంలా మెరవాలి. ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. కానీ ఈ రాష్ట్రంలోని పలు నగరాల్లో రోడ్ల సాఫీ సంగతేమేగానీ సేఫ్‌గా ఇంటి చేరితే చాలనే పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలోని 16 కార్పొరేషన్లలో అంతర్గత రోడ్లే కాదు.. చాలాచోట్ల ప్రధాన దారులూ.. దారుణంగా దెబ్బతిన్నాయి. రాళ్లు తేలి నరకానికి నకళ్లుగా మారాయి. ఇక శివారు కాలనీల్లో అయితే గజానికో గుంత. వర్షం పడితే అడుగుకో మడుగు.! ప్రయాణం అంటేనే కూసాలు కదిలిపోతున్నాయి. వాహనాలు మొండికేస్తున్నాయి. గుంటూరు నగర పరిధిలోని రోడ్ల దుస్థితిపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

GMC Roads Damage
GMC Roads Damage

నరకప్రాయంగా గుంటూరు రోడ్లు...అయితే గోతులు..లేదంటే రాళ్లు,కంకర...

GMC Roads Damage: నగరపాలికలంటేనే పన్నుల బాదుడే బాదుడు.! ముక్కుపిండి వసూలు చేయడంలో గుంటూరు నగరపాలికది రాష్ట్రంలోనే మూడే స్థానం! మరి అలాంటి చోట రోడ్లెలా ఉన్నాయి..? ఈ ప్రశ్న ఏ వాహనదారుడిని అడిగినా.. ఆ ఒక్కటీ అడగకండి.. అనే సమాధానమే వినిపిస్తోంది. రోడ్డెక్కితే బైక్‌ చక్కగా కాదు అష్టవంకర్లు తిప్పాల్సి వస్తోందని బెంబేలెత్తిపోతున్నారు. శివారు కాలనీల్లోనైతే కొలవడానికి కొలబద్దలే కాదు, టేపులూ.. చాలనంత గోతులు తేలాయి. గుంటూరు నగర రోడ్లపై ఈటీవీ, ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

చూశారుగా.. వాహనాలు ఎలా ఊగుతున్నాయో. కార్లు, ఆటోలేకాదు.. ద్విచక్రవాహనాలైనా ఈ రోడ్డెక్కితే అంతే. తెలియక ఈదారిలో వచ్చి మరోసారి ఈవైపు రాకూడదని చెంపలేసుకునేవారు కొందరైతే గోతుల గురించి తెలిసినా మరో దారిలేక అలాగే ఒడిదొడుకుల ప్రయాణం చేస‌్తున్నవారు చాలా మంది ఉన్నారు. గుంటూరు నగరంలో అంతర్గత రహదారుల దుస్థితికి ఇదే నిదర్శనం.

ఇది గుంటూరు ఎన్జీవో కాలనీలోని భవానిపురం రోడ్డు. నగరంలో 50శాతానికి పైగా కాలనీల్లో రోడ్లు ఇలాగే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజి కోసం తవ్వి సరిగా పూడ్చని ప్రాంతాలు కొన్నైతే.. అసలు రోడ్లే వేయని ప్రాంతాలు మరికొన్ని. భూగర్భ డ్రైనేజ్‌ పైపులైన్లు వేసినా.. రోడ్డు పూర్తిచేయలేదు. సిమెంట్‌గానీ, తారుగానీ వేయకుండా మట్టితో కప్పేసి సరిపెట్టారు. ఎంఎన్నార్ కల్యాణమండపం నుంచి నల్లపాడు ప్రధానరహదారి వరకు దాదాపు కిలోమీటరున్నర రహదారిని పరిశీలిస్తే, 43 గుంతలు కనిపించాయి. ఒక్కో గుంత కనిష్టంగా 5, గరిష్టంగా 20 సెంటీమీటర్ల లోతున్నాయి. 5 మీటర్లలోపు పొడవున్న గుంతలు 12 ఉండగా 5 నుంచి 10 మీటర్లలోపున్న గుంతలు 15, 10 నుంచి 15 మీటర్ల లోపు పొడవు కలిగిన గుంతలు 8 కనిపించయి. ఇక 15 నుంచి 20 మీటర్ల లోపున్న గుంతలు 5, 20 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న గుంతలు 3 ఉన్నాయి.

గుంటూరు నగరంలోని అనేక కాలనీల్లో రోడ్లపై ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల రాళ్లు, కంకర తేలి.. వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. ఇక వర్షం పడితే.. బైకుపై ప్రయాణం అంటే ఇంటికి క్షేమంగా వెళ్తే చాలనుకునే పరిస్థితి. వానా కాలంలో ఈ రోడ్లపై అనేక మంది జారిపడిన సందర్భాలున్నాయి.

గుంటూరు నగరపాలిక పరిధిలో మొత్తం వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారులున్నాయి. అందులో కచ్చా రోడ్లు 121.63 కిలో మీటర్లున్నాయి. రోడ్ల నిర్వహణ, అభివృద్ధి కోసం ఏటా అధికారులు కోట్లు ఖర్చుచేస్తున్నారు. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగే రోడ్లను కొంత మేర బాగు చేస్తున్న జీఎంసి సిబ్బంది..అంతర్గత రహదారులున్నాయనే విషయాన్నే మర్చిపోయినట్లున్నారు. ప్రధాన రహదారుల నిర్వహణ, మరమ్మతులకు గతేడాది జీఎంసి బడ్జెట్‌లో 10 కోట్ల రూపాయలు పెట్టగా.. 6 కోట్ల 22 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.