ETV Bharat / state

ప్లీజ్‌ డాక్టర్‌.. అమ్మానాన్నలకు చెప్పొద్దు.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి గాథ

author img

By

Published : Jan 6, 2023, 8:41 AM IST

Heart Touching Story of a Child: ‘డాక్టర్‌ సర్‌..నాకు మెదడు క్యాన్సర్‌. మరో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బతకను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పొద్దు.. వారు తట్టుకోలేరు..’ ఓ ఆరేళ్ల బాలుడు వైద్యుడితో అన్న మాటలివి. ఎంతటి మనోధైర్యం ఉన్నా.. క్యాన్సర్‌ అని తెలియగానే నిలువెల్లా వణికిపోతాం. కానీ ఆ చిన్నారి భయపడలేదు. అమ్మానాన్నల గురించి బాధపడ్డాడు. ఓ డాక్టర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న ఈ చిన్నారి కథ.. ప్రస్తుతం గుండెను మెలిపెడుతోంది.

story of a child
చిన్నారి గాథ

Heart Touching Story of a Child: ‘‘డాక్టర్‌.. నాకు క్యాన్సర్‌ వచ్చింది. చివరి దశలో ఉన్నా. ఎంతో కాలం బతకను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్. వారు తట్టుకోలేరు‌’’.. ఓ ఆరేళ్ల చిన్నారి వైద్యుడితో అన్న మాటలివి. క్యాన్సర్‌ సోకిందనగానే పెద్దవాళ్లే భయపడిపోతారు.. అలాంటిది ఓ పసి హృదయం తట్టుకోగలదా..? కానీ, ఆ చిన్నారి భయపడలేదు. ధైర్యంగా పోరాడాలనుకున్నాడు. కానీ, తనపైనే ఆశలు పెట్టుకున్న తన అమ్మానాన్నల గురించి బాధపడ్డాడు. అందుకే వారికి విషయం తెలియొద్దని ఇలా డాక్టర్‌ను బతిమాలాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డా.సుధీర్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ చిన్నారి కథ.. కన్నీళ్లు పెట్టిస్తోంది.

‘‘ఒక రోజు ఓపీ చూస్తుండగా.. ఓ యువ దంపతులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ల ఆరేళ్ల అబ్బాయి మను బయట ఉన్నాడు. అతడికి క్యాన్సర్‌ అని, కానీ ఆ విషయం అతడితో చెప్పొద్దని వారు నన్ను కోరారు. ‘తనను చూడండి. చికిత్స గురించి సూచనలు చేయండి. కానీ వ్యాధి గురించి మాత్రం చెప్పకండి’ అని అభ్యర్థించారు. నేను సరే అన్నాను. ఆ తర్వాత వీల్‌ ఛెయిర్‌లో మనును తీసుకొచ్చారు. అతడి పెదాలపై చిరునవ్వు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, తెలివైనవాడిలా కన్పించాడు. అతని మెడికల్‌ రిపోర్టులు పరిశీలించిన తర్వాత తెలిసిందేంటంటే.. ఆ చిన్నారికి మెదడు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది. దీనివల్ల అతడి కుడి చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. కొంతసేపు చికిత్స గురించి మాట్లాడిన తర్వాత మను తన అమ్మానాన్నలను బయటకువెళ్లమని కోరాడు’’

story of a child
చిన్నారి గాథ

‘‘వారు వెళ్లిపోయిన తర్వాత మను నాతో మాట్లాడుతూ.. ‘డాక్టర్‌ నేను ఈ వ్యాధి గురించి ఐపాడ్‌లో తెలుసుకున్నా. నాకు తెలుసు నేను ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకనని. కానీ, ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పలేదు. చెబితే వారు తట్టుకోలేరు. ప్లీజ్‌ మీరు కూడా చెప్పొద్దు’ అన్నాడు. అది వినగానే నాకు కొంతసేపు నోట మాటరాలేదు. ఆ తర్వాత ఎలాగో సర్దుకుని.. జాగ్రత్తగా ఉండమని చెప్పా. ఆ తర్వాత మనును బయటకు వెళ్లిపొమ్మని చెప్పి.. నేను అతని అమ్మానాన్నలతో మాట్లాడా. మను నాకు చెప్పిందంతా చెప్పి.. ఇదంతా మీకు తెలియనట్లే ఉండాలని కోరా. ఎందుకంటే.. ఇలాంటి సున్నితమైన విషయాలు కుటుంబానికి తెలియాలి. అప్పుడే చివరి రోజుల్లో అయినా వారిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని భారమైన హృదయంతో వెళ్లిపోయారు’’.

‘‘కొన్ని రోజుల తర్వాత ఈ విషయం నేను మర్చిపోయా. అలా 9 నెలల తర్వాత ఆ దంపతులు నన్ను చూడటానికి వచ్చారు. నేను వారిని గుర్తుపట్టి మను గురించి అడిగా. నెల క్రితమే మను వారిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని చెప్పారు. ఈ 8 నెలలు అతడిని ఎంతో ఆనందంగా చూసుకున్నామన్నారు’’ అని ఆ డాక్టర్‌ వివరించారు. ఈ ట్విటర్‌ థ్రెడ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నారి ధైర్యాన్ని, తల్లిదండ్రుల మీద అతడికున్న ప్రేమను పలువురు మెచ్చుకుంటూ, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.