ETV Bharat / state

CBN : నవ రత్నాలు కాదు.. నవ మోసాలు.. జగన్ రాజకీయాలకు అనర్హుడు : చంద్రబాబు

author img

By

Published : Apr 27, 2023, 10:51 AM IST

CBN : ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలకే అనర్హుడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఒక పక్కన... జగన్ మరో పక్కన అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్తెనపల్లి శరభయ్య స్కూల్ మైదానంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు... జగన్​తో పాటు ప్రభుత్వంపైనా సునిశిత విమర్శలు చేశారు.

తెలుగు దేశం అధినేత చంద్రబాబు
తెలుగు దేశం అధినేత చంద్రబాబు

Chandrababu naidu fire on Jagan : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అశేష ప్రజావాహిని కదిలివచ్చింది. స్థానిక శరభయ్య పాఠశాల మైదానంలో జరిగిన సభలో చంద్రబాబు.. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. పల్నాటి పులి కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తిని వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి నకిరేకల్ లో శంకుస్థాపన చేయించిన కోడెల శివప్రసాద్... సైకో సీఎం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని కూడా వేధించి చంపారని విమర్శించారు. తను 14 ఏళ్లు సీఎంగా ఉన్నా... ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? అంటూ ప్రశ్నించారు.

చెల్లెలు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి... బాబాయ్ వివేకా హత్యపై సొంత చెల్లి షర్మిల చేసిన వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు లోటు బడ్జెట్లో ఉండగా ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్, అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా పెట్టానని గుర్తు చేశారు. బడుగు వర్గాల కోసం ఇప్పుడు సబ్ ప్లాన్ లు ఉన్నాయా అని ప్రశ్నించారు. జగన్ చెప్పినవి నవరత్నాలు కావని... నవ మోసాలని చంద్రబాబు ఆరోపించారు. ఇచ్చేది 10 రూపాయలు... దోచుకునేది 100 రూపాయలుగా ఆరోపించారు. పెట్రోల్, గ్యాస్, వంట నూనెలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని విమర్శించారు. కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచాడని.. 300 రూపాయలు ఉండే కరెంట్ చార్జీ 800 రూపాయలకు చేరుకుందని ఆరోపించారు. నాడు విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదని గుర్తుచేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తానని... రైతులెవరూ దీనిపై ఆందోళన చెందవద్దని చెప్పారు.

అరాచక పాలన కొనసాగుతోంది.. తను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దానిని కొనసాగించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడున్న జగన్ మాత్రం అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నాడు ఇసుకను ఉచితంగా ఇచ్చామని... ఇప్పుడు ట్రాక్టర్ 5 వేలు, లారీ ఇసుక 75 వేలు అయ్యిందని చెప్పారు. దేవుడు ఇచ్చిన ఇసుకపై వీళ్ల పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఏఒక్క వ్యక్తి కూడా ఆనందంగా లేరని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 16 లక్షల మందికి ఇస్తే.... ఇప్పుడు 10 లక్షల మందికే ఇస్తున్నారని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో పీజీ చదివే వారి సంఖ్య పెరిగిందని, మన దగ్గర పీజీ చదివేవారి సంఖ్య తగ్గిందన్నారు. అమరావతిలో విద్యార్థుల కోసం విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి యూనివర్సిటీలు తెచ్చానని.. మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పారు.

సంపద సృష్టించాలి.. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు తేవడం గొప్పకాదన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీయని గుర్తుచేశారు. ఆనాడు తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని.. తరువాత వచ్చిన పాలకులు కొనసాగించారని చెప్పారు. సీఎం జగన్.. నాలుగేళ్లలో రూ. 2లక్షల కోట్లు దోపిడీ చేశారని, ప్రజల పేరుతో 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడని ఆరోపించారు. సత్తెనపల్లి పట్టణంలో డ్రైనేజ్ పనికి వెళ్లి అసువులు బాసిన బీసీ వర్గానికి చెందిన తురక అనీల్ అనే యువకుడికి వచ్చిన 5 లక్షల ఆర్థిక సాయంలో మంత్రి వాటా అడిగాడా లేదా అని ప్రశ్నించారు. అంతకుముందు చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని చంద్రబాబుకు ప్రజలు మంగళహారతులు పట్టారు. రెండు గజమాలలను స్థానిక నాయకులు వేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.