Spinning Industry Problems: సమస్యల సుడిగుండంలో స్పిన్నింగ్ పరిశ్రమ..

author img

By

Published : Jun 27, 2023, 10:03 AM IST

Etv Bharat

Spinning Mills in Crisis: పెరిగిన ముడిసరకు ధరలు, విద్యుత్ టారిఫ్ భారాలు, పేరుకుపోయిన దారం నిల్వలు, ప్రభుత్వం నుంచి అందని ప్రోత్సాహకాలు..! ఇలా అన్ని వైపుల నుంచి స్పిన్నింగ్ మిల్లులను సమస్యలు చుట్టుముట్టాయి. వేల మందికి ఉపాధి చూపే నూలు పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సుమారు 10 శాతం వరకు స్పిన్నింగ్ మిల్లులు ఇప్పటికే మూతపడగా మిగతావీ ఉత్పత్తిని సగానికిపైగా తగ్గించాయి. తీవ్ర నష్టాలతో యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు.

సమస్యల సుడిగుండంలో స్పిన్నింగ్ పరిశ్రమ..

Spinning Mills in Crisis: రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు సమస్యల సుడిగండంలో చిక్కుకున్నాయి. 2022 జనవరి వరకు మిల్లుల పరిస్థితి కొంత బాగానే ఉన్నప్పటికీ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ తయారైన దారం మొత్తాన్ని దేశీయంగా వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో క్రమంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దూది నుంచి కిలో దారం తయారుచేస్తే సగటున 10 రూపాయలు నష్టం వస్తోంది. కొన్ని మిల్లుల్లో ఇది 15 రూపాయల వరకు ఉంది. మరోవైపు విద్యుత్ ఛార్జీలు పెరగడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోవడంతో మిల్లుల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో కొందరు నడపడం కంటే మూసేయడం మేలని భావిస్తున్నారు. ఓవైపు ముడిసరకు, పత్తి ధరలు పెరగడం, మరోవైపు దారం ఎగుమతులు ఆగిపోయి నిల్వలు పేరుకుపోయి పరిశ్రమ కుదేలవుతోంది. స్పిన్నింగ్ మిల్లులు ఉత్పత్తి చేసిన దారాన్ని దేశీయంగా వినియోగించడంతోపాటు చైనాకు సుమారు 30 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో చైనా నుంచి ఇతర దేశాలకు రెడీమేడ్, గార్మెంట్స్ దుస్తులు తగ్గిపోయాయి. దీంతో చైనా మన దేశం నుంచి దారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. దేశీయంగా కూడా వస్త్రానికి సరైన డిమాండ్ లేకపోవడంతో కొనుగోలు చేసేవారు కరవయ్యారు.

గత ఏడాది సీజన్ ప్రారంభమైన అక్టోబరు నెలలో క్యాండీ దూది ధర 85 వేలు ఉండగా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 57 వేలకు చేరుకుంది. నూలు మిల్లుల నిర్వాహకులు దూది కొన్న తర్వాత ధరలు తగ్గడంతో ఆ మేరకు నష్టపోయారు. స్పిన్నింగ్ మిల్లులు మూసేసినా 25వేల స్పిండిల్స్ సామర్ధ్యం ఉన్న పరిశ్రమకు యూనిట్ కు విద్యుత్ శాఖకు డిమాండ్ ఛార్జీల కింద 4.64 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 25వేల స్పిండిల్స్ ఉన్న చిన్న మిల్లుల వారు 50 శాతం సామర్థ్యంతో నడుపుతూ నెట్టుకొస్తున్నారు.

కిలో దారం తయారీకి సగటున 4 నుంచి 5 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. రెండేళ్ల కిందట విద్యుత్ ఛార్జీలతో పోలిస్తే ఇప్పుడు యూనిట్ కు 3 రూపాయలు అదనపు భారం పడుతుందని మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఒక్క విద్యుత్ ఛార్జీల వల్ల కిలోకు 12 భారం పడుతుందని వారు వాపోతున్నారు. గడిచిన 50 ఏళ్లుగా విద్యుత్ సుంకం యూనిట్ కు 6 పైసలు ఉండగా ఇప్పుడు దానిని ఒకేసారి రూపాయికి పెంచారు. 2014-2019 మధ్య ట్రూఅప్ ఛార్జీల వసూలు, తాజాగా ఏప్రిల్ నుంచి గత ఏడాది విద్యుత్ నష్టాల పేరుతో ఇప్పుడు ప్రతి నెలా భారం వేయడంతో యూనిట్​కు 3రూపాయలు పెరిగింది.

నెల రోజుల కిందట దూది ధరతో పోలిస్తే ప్రస్తుతం క్యాండీకి 6 వేల రూపాయల వరకు తగ్గుదల కన్పిస్తోంది. ఈ లెక్కన ఒక్కో మిల్లు దూది కొనుగోళ్లలో 2 కోట్ల వరకు నష్టపోయామని ఎటూ పాలుపోని పరిస్థితుల్లో మిల్లును 50 శాతం సామర్థ్యంతో నిర్వహిస్తున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం నూలు మిల్లుల పరిశ్రమలను అదుకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఈ సంక్షోభం నుంచి కోలుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు.

వేలాది మంది కార్మికులు ఆధారపడిన నూలు మిల్లులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ చేస్తున్నారు.

'స్పిన్నింగ్ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విద్యుత్ చార్జీలు పెరిగాయి. బిల్లులు కట్టలేని పరిస్థితిలో మిల్లులు ఉన్నాయి. నెలకు 20 లక్షల రూపాయలు వడ్డి వస్తుంది. బ్యాంకులకు వాయిదాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.' - కోటేశ్వరరావు, స్పిన్నింగ్ మిల్లు యజమాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.