ETV Bharat / state

అటు టీడీపీలో కన్నా చేరిక.. ఇటు భారీగా మోహరించిన పోలీసులు.. వేడెక్కిన మంగళగిరి

author img

By

Published : Feb 23, 2023, 1:14 PM IST

Updated : Feb 23, 2023, 1:23 PM IST

Kanna join in tdp : గుంటూరు జిల్లా సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. కాసేపట్లో భారీగా అనుచరగణంతో కలిసి టీడీపీ కార్యాలయంలో.. అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అటు కన్నా అనుచరులు, మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానుండగా.. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Kanna join in tdp : గుంటూరు జిల్లా సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నారు. భారీగా తరలివస్తున్న అనుచరులతో కన్నా నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు కన్నా చేరిక సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నాయి. తనతో పాటు చాలామంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2.48 గంటలకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరటానికి ముహూర్తం నిర్ణయించినట్లు చెప్పారు. యాభై మంది ముఖ్య నేతలకు చంద్రబాబు టీడీపీ కండువా వేస్తారన్నారు.

మరింత మంది సిద్ధం.. బీజేపీ సీనియర్లు కొందరు పార్టీ మారేందుకు తనతో టచ్ లో ఉన్నారని కన్నా వెల్లడించారు. కన్నా చేరికపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. కన్నాను ... గుంటూరులోని ఆయన నివాసంలో కలిసిన తర్వాత ఆలపాటి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు.

నాతో పాటు చాలామంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. యాభై మంది ముఖ్య నేతలకు చంద్రబాబు పార్టీ కండువా వేస్తారు. బీజేపీ సీనియర్లు కూడా కొందరు పార్టీ మారేందుకు నాతో టచ్ లో ఉన్నారు. - కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి

గుంటూరు నగరంలో కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారి తీసింది. కన్నా టీడీపీ లో చేరుతున్న సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మార్కెట్ సెంట‌ర్లో ఫ్లెక్సీలని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. విషయం తెలిసిన కన్నా అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. ఫ్లెక్సీల తొలగింపు పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో పేదలను మరింత పేదలు గా మారుస్తోంది. కన్నా టీడీపీలోకి వస్తుంటే అధికార పార్టీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు. కన్నా చేరికతో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుంది. - ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ సీనియర్ నేత

భారీగా మొహరించిన పోలీసులు... కాగా, గన్నవరం ఘటన దృష్ట్యా డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడిస్తారనే అనుమానంతో భారీ భద్రత ఏర్పాటుచేశారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం వరకు సర్వీసు రోడ్డు-జాతీయ రహదారి మధ్య ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. సర్వీస్ రోడ్డులో మూడంచెల బారికేడ్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. సర్వీసు రోడ్డులోకి రాకుండా వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. డీజీపీ కార్యాలయ పరిసరాలంతా పోలీసులు వలయాన్ని ఏర్పాటు చేశారు. అరెస్టు చేసి తరలించే వాహనాలు, అదనపు బలగాలు మోహరించారు. పోలీసు చర్యలతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

ఇవీ చదవండి :

Last Updated :Feb 23, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.