ETV Bharat / state

మాస్కులకు టైమొచ్చింది..! కేంద్రం హెచ్చరికలతో ప్రజల్లో పెరుగుతున్న అప్రమత్తత

author img

By

Published : Dec 22, 2022, 10:25 AM IST

Genome sequencing reduced: ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రజల్లోనూ ఒకింత ఆందోళన మొదలైంది. కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలను పాటించాలని సూచించింది. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని పేర్కొంది.

corona alert
కరోనా హెచ్చరిక

Genome sequencing reduced: కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చైనాలో కొవిడ్‌ కేసులు పెరగడం, అక్కడ వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్‌ ఉపరకం బీఎఫ్‌-7 కేసులు భారత్‌లోనూ మూడు నమోదవడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రజల్లోనూ ఒకింత ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి కేసులు పెద్దగా నమోదు కాకపోయినా.. వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సరైన నిఘా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు వచ్చిన నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే కొవిడ్‌ నమూనాల జన్యు పరీక్షలు ప్రస్తుతం సీడీఎఫ్‌డీలో జరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసులు తగ్గిపోవడంతో ఆ మేరకు సీక్వెన్సింగ్‌ తగ్గించారు. కొవిడ్‌ నిఘా కోసం దేశంలోని 54 సంస్థల భాగస్వామ్యంతో జీనోమ్‌ కన్సార్టియం ఇన్సాకాగ్‌ ఏర్పడింది. తెలంగాణలో సీడీఎఫ్‌డీ, సీసీఎంబీ, గాంధీ ఆసుపత్రి ఇందులో ఉన్నాయి. తక్కువ కేసులు వస్తుండడంతో కొంతకాలంగా సీడీఎఫ్‌డీలో వాటి నమూనాలను పరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని కొంత ప్రాంతం, తదితర చోట్ల నుంచి కొవిడ్‌ కేసుల నమూనాలు ఇటీవల వరకు సీసీఎంబీకి వచ్చేవి. ఇప్పుడు ఎక్కడికక్కడ స్థానికంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు.

ఏపీకి సంబంధించి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో పరీక్షిస్తున్నారు. సీసీఎంబీలో జన్యు పరీక్షలు చేయాలంటే ఒకేసారి 300 వరకు నమూనాలు కావాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో ఇప్పుడు కేసులు లేవు. మూడు వారాల క్రితం చేసినప్పుడు ప్రమాదకర వేరియంట్లు ఏవీ గుర్తించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘కొత్తగా వచ్చిన బీఎఫ్‌-7 గురించి ఇంకా పూర్తిగా తెలియకుండా ఇప్పుడే మాట్లాడలేం. నమూనాలు వచ్చేదాన్ని బట్టి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కొనసాగుతుంది’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి అన్నారు.

మాస్క్‌లు వాడకం మొదలైంది : కొవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో వెయ్యిలో ఒకరిద్దరు మినహా మాస్క్‌ల వాడకం దాదాపుగా మానేశారు. చైనాలో కేసులు పెరిగిన వార్తలు వస్తుండడం.. కేంద్రం హెచ్చరికలతో ఇళ్లలో ఎక్కడో మూలన పడేసిన మాస్క్‌లను మళ్లీ బయటకు తీసి ధరించడం ప్రారంభించారు. బూస్టర్‌ డోస్‌లపైనా ప్రజలు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ట్యాబ్‌ "తెర" పై వివాదం.. పోటీ ఉంటే తక్కువ ధరకే వస్తాయంటున్న నిపుణులు

"ఈట్‌ రైట్‌ క్యాంపస్‌" గా రామోజీ ఫిల్మ్‌సిటీ.. ధృవీకరించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

అయోమయంలో "పది" విద్యార్థులు.. చదివేది ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌.. రాసేది మాత్రం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.