ETV Bharat / state

సుబాబుల్‌, జామాయిల్‌ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం..

author img

By

Published : Jun 27, 2023, 12:24 PM IST

No MSP Rates For Subabul Farmers: వైఎస్సార్​సీపీ రైతు సంక్షేమ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్‌.. అవకాశం చిక్కినప్పుడల్లా బీరాలు పోతుంటారు. కానీ రాష్ట్రంలోని సుబాబుల్‌, జామాయిల్​ రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని గమనిస్తే ఇవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోతోంది. ప్రతిపక్ష నేత హోదాలో సుబాబుల్‌, జామాయిల్‌ రైతులపై వరాల జల్లు కురిపించిన జగన్‌, అధికారంలోకి వచ్చాక వారి వైపు తొంగిచూడలేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. అందులో సగం కూడా దొరకక.. రైతులు నష్టాల ఊబిలోకి పడిపోయారు. ఇక పంటే దండగ అని విసిగివేసారే స్థితికి ప్రభుత్వం వారిని తీసుకొచ్చింది. సుబాబుల్‌, జామాయిల్‌ తోటల్ని తొలగించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు మళ్లుతున్నారు. ఫలితంగా పంట సాగు భారీగా తగ్గింది.

Etv Bharat
Etv Bharat

సుబాబుల్‌, జామాయిల్‌ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం..

No MSP Rates For Subabul Farmers : 'అధికారంలోకి వస్తే సుబాబుల్‌, జామాయిల్‌ రైతులకు టన్నుకు 5 వేల రూపాయలు ఇప్పిస్తా..' 2019కి ముందు ప్రతిపక్ష నేత హోదాలో చీమకుర్తి, నందిగామ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో సుబాబుల్‌ రైతులను ఉద్దేశించి జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. కానీ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వారి గోడు పట్టించుకున్న దాఖలేలే లేవు. కొనేవారు లేక రైతులు అయినకాడికి అమ్ముకుంటూ తోటల్ని తొలగిస్తున్నా చోద్యం చూడ్డానికే పరిమితమయ్యారు.

ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులు : సుబాబుల్‌, జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేస్తామంటూ ప్రతిపక్షనేతగా గొప్పలుపోయిన జగన్‌... ముఖ్యమంత్రి పీఠమెక్కాక మడమ తిప్పేశారు. మొక్కుబడిగా మంత్రుల కమిటీ వేసి నాలుగేళ్లుగా నాన్చుతున్నారు. ఈ ఏడాదైనా ధర దక్కుతుందనే ఆశతో ఏళ్ల తరబడి ఎదురుచూసిన సుబాబుల్‌, జామాయిల్ రైతులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. కర్ర కొనుగోళ్లలో దళారుల పెత్తనాన్ని తగ్గించి గిట్టుబాటు ధర ఇప్పించమంటూ మొరపెట్టుకుంటున్నా పట్టించుకునేనాథుడే లేకపోవడంతో అయినకాడికి కర్రను అమ్మేశారు.

సుబాబుల్‌, జామాయిల్‌ తోటల్ని తొలగింపు : కొందరు రైతులు వేర్లతో సహా చెట్లను తొలగించి.. ఇతర పైర్ల వైపు మళ్లారు. సుబాబుల్‌కు టన్నుకు 4 వేల 200 రూపాయలకు పైగా దక్కాల్సి ఉండగా సగానికంటే తక్కువకే తెగనమ్ముకున్నారు. మొక్క నాటాక 3-4 ఏళ్లకు కొట్టాల్సిన కర్రను ఏడెనిమిదేళ్లకూ అమ్ముకోలేక వేలాది ఎకరాల్లో సుబాబుల్‌, జామాయిల్‌ తోటల్ని తొలగించారు. మరికొందరు రైతులు ఇంకా తొలగిస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గి, ఉత్పత్తి పడిపోయింది. కర్ర లేకపోవడంతో ధర కాస్త మెరుగుపడినా 2018లో నిర్ణయించిన ధర ఇప్పటికీ దక్కడం లేదు.

సుబాబుల్‌, జామాయిల్‌, సరుగుడు తోటలను అన్ని జిల్లాల్లోనూ రైతులు సాగుచేస్తున్నారు. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జామాయిల్‌, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సుబాబుల్‌ సాగు అధికంగా సాగు చేస్తారు. సాగర్‌ కాల్వలకు నీరు రాక, వ్యవసాయంలో నష్టాలు భరించలేక సామాజిక వనాల పెంపుపై రైతులు దృష్టి పెట్టారు. కాగితపు పరిశ్రమలే మొక్కలు ఇచ్చి సాగు చేయిస్తున్నాయి. గత ఏడెనిమిదేళ్లుగా సరైన ధరలు దక్కడం లేదు.

ఏడాదికి 57.39 లక్షల టన్నుల ఉత్పత్తి : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కూడా కాగితపు పరిశ్రమలు కొనుగోలు చేయకుండా మొండికేస్తున్నాయి. దీంతో రైతులు విసిగి వేసారి సాగు నుంచి వైదొలుగుతున్నారు. 2016-17 సంవత్సరంలో 3.92 లక్షల ఎకరాల్లో సాగు ఉండగా... 2022-23 నాటికి అది 1.08 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే ఏకంగా 3.42 లక్షల ఎకరాల మేర తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే 2021-22లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మొత్తం 9 జిల్లాల్లో 2.64 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అంచనా వేశారు. ఏడాదికి 57.39 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తోంది. అంటే గత రెండేళ్లలోనే 1.56 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోవడమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

రైతులకు మొదలైన కష్టాలు : తొలుత సుబాబుల్‌, జామాయిల్‌ కర్రను కాగితపు పరిశ్రమలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేవి. దళారుల పెత్తనం పెరగడం, సరైన ధర లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. గతంలో మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేయించి వారి ఆధ్వర్యంలోనే చెల్లింపులు చేసేది. పన్నుల భారం పేరుతో తర్వాత ఈ విధానం మార్చింది. మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వేబ్రిడ్జిల దగ్గర కొనుగోలు చేసి ఆయా పరిశ్రమల ద్వారా రైతు ఖాతాల్లో చెల్లింపులు చేసే విధానం తెచ్చింది. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. టన్నుకు 2 వేల రూపాయలు కూడా దక్కని పరిస్థితి తలెత్తింది.


అంగీకరించని కాగితపు పరిశ్రమ యజమానులు : సుబాబుల్‌, జామాయిల్ రైతులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటుచేస్తున్నా.. ఫలితం శూన్యమే. కఠిన చర్యలు లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా తయారైంది. 2016-17 సంవత్సరంలో ప్రభుత్వం తొలుత అప్పటి ప్రణాళిక బోర్డు ఛైర్మన్ కుటుంబరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసింది. తర్వాత మార్కెటింగ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సుబాబుల్‌కు టన్నుకు 4 వేల 200, జామాయిల్‌కు టన్నుకు 4 వేల 400 రూపాయల చొప్పున ధరను ఈ కమిటీ 2018లో నిర్ణయించింది. ఈ ధరకు కొనేందుకు కాగితపు పరిశ్రమ యజమానులు అంగీకరించడం లేదు.


కమిటీ ఏర్పాటు : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిలో జరిగిన వ్యవసాయ మిషన్‌ సమావేశంలో సుబాబుల్‌ రైతుల సమస్యపై చర్చించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించడంతో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎమ్​వీఎస్ నాగిరెడ్డితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్‌, ఆర్థికశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. అయినా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్యలు కొరవడ్డాయి.

తగ్గిపోయిన సాగు : సాధారణంగా మొక్కలు నాటిన మూడేళ్లకు కర్ర కొట్టాల్సి ఉండగాఅధికశాతం రైతులు 6-7 సంవత్సరాలకు కూడా తీయలేకపోయారు. ధరలు లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రాలేదు. వానలు, గాలులకు దెబ్బతిని విరిగిపడ్డాయి. దీంతో రైతులు మరింత నష్టపోయారు. చేసేది లేక టన్ను వెయ్యి నుంచి 15 వందల రూపాయల చొప్పున అమ్ముకున్నారు. ఆ మొత్తంతో దుంపలు తీయించి ఇతర పంటలు వేస్తున్నారు. దీంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు కాస్త మెరుగయ్యాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో రైతులకు టన్ను జామాయిల్‌కు 3 వేలు, సుబాబుల్‌కు 2 వేల 200 రూపాయల ధర లభిస్తోంది.

మొక్కుబడి సమావేశాలు : దీనికి ఖర్చులు టన్నుకు వెయ్యి రూపాయలు కలిపినా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే రైతుల పెట్టుబడులు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలు అసలు గిట్టుబాటే కావు. వీటిపై రైతులు, రైతుసంఘాలతో ప్రభుత్వం చర్చించిన దాఖలాలే లేవు. అధికారు, మంత్రులు కాగితపు పరిశ్రమల యజమానులు, వ్యాపారాలతో మొక్కుబడి సమావేశాలు ఏర్పాటు చేసి ముగిస్తున్నారు.
దళారుల పాత్రను నియంత్రించాలని రైతులు డిమాండ్ : టన్ను జామాయిల్‌కు 5 వేలు, సుబాబుల్‌కు 4 వేల 800 రూపాయల చొప్పున ధర నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్‌ కమిటీల ద్వారా కర్రను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని, దీనికి అనుగుణంగా కమిటీలకు రివాల్వింగ్‌ ఫండ్‌ కేటాయించాలని కోరుతున్నారు. అనధికార కొనుగోళ్లు, దళారుల పాత్రను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.