ETV Bharat / state

Amaravati R5 Zone: ఆర్​5 జోన్​లో ఆగమేఘాలపై ఆమోదం.. నెలలోనే 47వేల ఇళ్లు మంజూరు..

author img

By

Published : Jun 27, 2023, 8:51 AM IST

Amaravati R5 Zone: రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. పూర్వాపరాలు, న్యాయపరమైన చిక్కుల్ని పట్టించుకోకుండానే.. రాష్ట్రం అడగ్గానే.. 47 వేల ఇళ్ల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు తుది తీర్పు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే దాదాపు 700 కోట్ల రూపాయలు వృథా అయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Etv Bharat
Etv Bharat

47 వేల ఇళ్లకు ఆగమేఘాలపై ఆమోదం

Amaravati R5 Zone: రాష్ట్రప్రభుత్వం అడిగిందే తడవుగా ఆగమేఘాలపై రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సమ్మితించింది. అమరావతిలో చేపట్టే 47 వేల ఇళ్లకు సోమవారం జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అనుమతులిచ్చింది. మెుదటి విడతగా వీటిని మంజూరు చేసినట్లు తెలిపింది. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజా ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా.. కేంద్రం దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అడగ్గానే.. కేంద్రం అలా ఆమోద ముద్ర వేసేసింది. ఈ మెుత్తం వ్యవహారం నెలలోనే పూర్తవడం గమనార్హం.

సీఎం జగన్ అమరావతిలో రాజధానేతరులైన 50 వేల 793 మందికి ఇళ్ల పట్టాణాలు పంపిణీ చేశారు. వీరిలో 47 వేల మందికి కేంద్రం తాజాగా ఇళ్లు మంజూరు చేయగా.. మిగిలిన ఇళ్ల నిర్మాణాలకు తదుపరి సమావేశంలో అనుమతులిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ 47 వేల మందికి కేంద్రం.. పట్టణ పరిధిని ప్రాతిపదికగా ఇళ్లు మంజూరు చేసింది. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం లక్షా 50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 30వేలు అందిస్తాయి. కేంద్రం ఇచ్చే లక్షా 50 వేల రూపాయల్నే ప్రాతిపదికగా తీసుకున్నా.. 47 వేల ఇళ్ల నిర్మాణానికి 705 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఇంత పెద్ద మెుత్తంలో ఆర్ధిక సాయం అందిస్తున్నా.. భవిష్యత్‌లో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. పరిస్థితి ఏంటని కేంద్రం ఆలోచించనట్టుగా ఉంది. అదే జరిగితే 705 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసినట్లే కదా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్ని పంపినా.. కేంద్రానికి ఎందుకంత తొందర అని ప్రశ్నిస్తున్నారు. ఆగమేఘాలపై అనుమతులివ్వాల్సిన అవసరం ఏంటని రాజధాని రైతులు మండిపడుతున్నారు.

మరోవైపు అమరావతిలో జూలై 8న ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు.. జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చేపట్టే ఇళ్ల నిర్మాణంలో మెజార్టీ వాటిని ప్రభుత్వమే కట్టించి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నిర్మాణం వేగంగా జరిగేందుకు షియర్‌వాల్‌ సాంకేతికతను వినియోగించనున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే నలుగురు గుత్తేదారుల్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. రాజధానిలో ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు కేటాయించిన 46 వేల ఇళ్లను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందు కోసం నంద్యాల జిల్లాకు చెందిన 8 వేల 959 మంది లబ్ధిదారులు, వైఎస్‌ఆర్ జిల్లాలోని 8 వేల 126 మంది లబ్ధిదారుల ఇళ్లను జగన్ సర్కార్‌ రద్దు చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 148 ప్రాజెక్టుల నుంచి పేదలకు కేటాయించిన 46 వేల 928 ఇళ్లను రద్దు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.