ETV Bharat / state

Medical Colleges in AP: వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారుగా జగన్‌.. కోటీశ్వరులకే 50 శాతం సీట్లు

author img

By

Published : Jul 20, 2023, 7:15 AM IST

mbbs seats
mbbs seats

New Categories Creation in Medical Colleges: పేదలు, పెత్తందారులంటూ పదే పదే కల్లబొల్లి మాటలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌.. తన అసలైన పెత్తందారీ అవతారాన్ని బయటపెట్టారు. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనట్లు.. సీట్లను అమ్మకానికి పెట్టి నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు షాకిచ్చారు. ఎంబీబీఎస్‌ పట్టా అందుకుని వైద్యవృత్తి చేద్దామని కలలుగనే నిరుపేద విద్యార్థుల గుండెల్లో గునపాలు దించారు. మాటల్లో తియ్యని ప్రేమను ఒలకబోస్తూ చేతల్లో మాత్రం వారి ఆశలను నిలువునా నాశనం చేశారు.

వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారుగా జగన్‌.. కోటీశ్వరులకే 50 శాతం సీట్లు

New Categories Creation in Medical Colleges: ధన్వంతరి, శుశ్రుతుడు, చరకుని తర్వాత వైద్యానికి తానే మూలపురుషుడిని అనేలా.. వైద్య కళాశాలల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలో వైద్య విద్యకు అంకురార్పణ చేస్తున్నట్టు ఇన్నాళ్లూ ఊదరగొట్టి.. చివరికు ఆ మాటల వెనుక ఉన్న మర్మాన్ని సీఎం జగన్ బయటపెట్టారు. తానే పెత్తందారునిలా.. పేదలకు వైద్యవిద్య అందకుండా అమ్మకానికి పెట్టారు. ఇదేనా వారి పక్షాన నిలవడమంటే? కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటైతే సీట్లు వస్తాయని ఇన్నాళ్లూ సంబరపడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు.. ఈ నిర్ణయంతో వైద్య విద్యను దూరం చేసేశారు.

అధికంగా కళాశాలల్ని తెచ్చామని చెబుతూ దశాబ్దాలుగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించి మీ తండ్రి పేరును ఆగమేఘాలపై పెట్టుకున్నారే.. ఇలా సీట్లను అమ్మకానికి పెట్టి వ్యాపారం చేయడానికేనా?. వైద్య కళాశాలల్లో అత్యధికంగా మీరు నిర్ణయించిన 20 లక్షల రూపాయల ఫీజును ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కడతారు?. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 25 వైద్యకళాశాలల్లో15 వేల నుంచి 20 వేలకే అన్ని సీట్లను భర్తీచేస్తుంటే మీరు 50 శాతం సీట్లకు డొనేషన్ల తరహా ఫీజులు నిర్ణయిస్తారా? కేవలం 25 శాతం సీట్లలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అవకాశాలను కల్పించడమంటే ఆయావర్గాలకు దారుణంగా అన్యాయం చేయడం కదా? తమ బిడ్డలను వైద్యులుగా చూడాలని ఆశ పెంచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఇది నిలువుగా మోసం చేయడం కాదా ..అని ఆయా పలు సంఘాల నేతలు మండిపడుతున్నారు..

Categories in New Medical Colleges in AP: ప్రభుత్వ వైద్యవిద్య సీట్లతో సరికొత్త వ్యాపారానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల కలలను చెదరగొట్టింది. ఈ విద్యా సంవత్సరం(2023-24) నుంచి కొత్తగా వచ్చిన 5 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను అమ్మకానికి పెట్టింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఫీజుల వసూళ్ల కోసం.. కన్వీనర్‌ కోటా కాకుండా అదనంగా రెండు కేటగిరీలను సృష్టించింది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను ఆశలను అడియాసలు చేసింది.

ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలన్న తేడా లేకుండా పోయింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లోలాగే ఐదు కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని సీట్లను ఎ, బి, సి కేటగిరీల వారీగా భర్తీ చేయబోతుంది. ‘ఎ’ కేటగిరి ఫీజు 15వేల రూపాయలు, బి కేటగిరీ ఫీజు 12 లక్షలు, సి కేటగిరీ ఫీజు 20 లక్షలను వసూలు చేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదంతోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం(జులై 19) వెలువడ్డాయి.

New Medical Colleges in AP: ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని బి, సి కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా దక్కించుకునే అవకాశం ఉన్నా, భారీ మొత్తంలో ఫీజులు కట్టలేక.. మంచి ర్యాంకు కోసం మరోసారి నీట్‌ రాసేందుకు చాలా మంది విద్యార్థులు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వమే ఇలా బి, సి కేటగిరీలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 68వేల 678 మంది నీట్‌ రాస్తే 48 వేల 836 మంది అర్హత సాధించారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీట్లు అంటే.. అన్నింటినీ కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేస్తారని విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి.. వారి తల్లిదండ్రుల ఆశలు ప్రభుత్వ నిర్ణయంతో నీరుగారిపోయాయి.

2023-24 విద్యా సంవత్సరం నుంచి రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున సీట్ల భర్తీకి జాతీయ వైద్యకమిషన్‌ ఆమోదం తెలిపింది. ఇందులో జాతీయ కోటా కింద 15 శాతం సీట్లు వెళ్తాయి. అంటే.. ఐదు కాలేజీల్లో కలిపి 750లో 112 సీట్లను జాతీయ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 638 సీట్లలో 50 శాతంలో …25 శాతం సీట్లు జనరల్‌, 25 శాతం సీట్లు రిజర్వేషన్‌ కింద.. కన్వీనర్‌ కోటాలో రాష్ట్ర విద్యార్థులతో భర్తీ అవుతాయి. మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం ‘బి’ కేటగిరీ కింద, 15 శాతం ఎన్నారై కోటా కింద భర్తీచేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Fee Details of New Medical Colleges: ప్రస్తుత విధానంలో గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీల్లో ఉన్న సీట్లన్నింటినీ కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేస్తున్నారు. ఇలా సీట్లు పొందినవారు వార్షిక ఫీజు కింద 15వేల వరకు చెల్లిస్తే సరిపోతుంది. కొత్తగా వచ్చే ఐదు కళాశాలల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. భవిష్యత్తులో అదనంగా వచ్చే ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 50శాతం సీట్లు అమ్మకానికి ఉంచుతారు. తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పడినా.. వాటిలోని సీట్లను కన్వీనర్‌ కోటాలోనే భర్తీచేస్తున్నారు.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అవకాశాల్ని కాలరాయడమేనని అంటున్నాయి. సీఎం జగన్‌ పథకం ప్రకారం వైద్యవిద్యలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లేకుండా చేస్తున్నారని .. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు 50 శాతం వైద్యవిద్య సీట్లు అమ్మకానికి పెట్టారని మండిపడుతున్నాయి. ప్రభుత్వం పేదలకు మేలు చేసేలా ఉండాలే గానీ.. వారికి దక్కే అవకాశాల్ని కాలరాయకూడదని అంటున్నాయి. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముస్లింలను ఉన్నత విద్యకు దూరం చేసే ఎత్తుగడను అమలు చేస్తోందన్న మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే విదేశీవిద్య నుంచి ముస్లిం సమాజాన్ని దూరం చేసిందని.. ఇప్పుడు వైద్యవిద్య కూడా అందకుండా చేసేలా ఉత్తర్వులిచ్చిందని మండిపడింది. కొత్త వైద్యకళాశాల్లో ఒకదాన్ని పూర్తిగా ముస్లిం విద్యార్థులకే కేటాయించాలని ముస్లిం సంఘాలు డిమాండు చేస్తుంటే.. ఉన్న అవకాశాలనూ తగ్గించడమేంటిని ప్రశ్నించింది. జగన్‌ తీరు కార్పొరేట్‌ యాజమాన్యంలా ఉందని ఆక్షేపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.