ETV Bharat / state

medical colleges start in August : త్వరలో మెడికల్ కళాశాలలు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే..!

author img

By

Published : Jun 7, 2023, 10:36 AM IST

medical colleges start in August : ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 ప్రభుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అద‌నంగా రాబోతున్నాయ‌ని మంత్రి విడదల రజిని తెలిపారు. ఐదు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు లభించినందున నిర్మాణ పనులు, హాస్టళ్ల ఏర్పాటు సహా ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని ఆమె సూచించారు.

Etv Bharat
Etv Bharat

ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని

medical colleges start in August : ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో ఐదు కొత్త ప్రభుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ఈ క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయ‌ని ఆమె వెల్లడించారు. మంగళవారం ఐదు కొత్త మెడికల్ కాలేజీలకు చెందిన జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపాళ్లతో పనుల పురోగతి పై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

750 సీట్లు... రాష్ట్రంలో విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్టణం, రాజ‌మండ్రి మెడిక‌ల్ కళాశాల‌ను ఆగ‌స్టు నెల‌లో ప్రారంభించే దిశగా ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారన్నారు. ఐదు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు లభించినందున నిర్మాణ పనులు, హాస్టళ్ల ఏర్పాటు సహా ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర విద్యార్థుల‌కు నాణ్యమైన వైద్య విద్య అందించాల‌న్న ఉద్దేశంతో సీఎం జగన్ ప్రభుత్వం మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధకనబర్చారన్నారు. మొత్తం 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి 8500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 ప్రభుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అద‌నంగా మ‌నకు రాబోతున్నాయ‌న్నారు. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్య అభ్యసించే అవకాశం ఈ కాలేజీల ద్వారా ల‌భిస్తుంద‌న్నారు.

రెండేళ్లు కావస్తున్నా పునాదులు దాటని పనులు... ముఖ్యమంత్రి జగన్ 2021 మే 31న రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్‌ కళాశాలలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా.. ఆ జాబితాలో ఆదోని కూడా ఉంది. తమ పట్టణానికి మెడికల్ కళాశాల వస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఆలూరు, ఆదోని, కోసిగి, కౌతాళం, పత్తికొండ, ఏమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆదోనిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ, రెండు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పునాది దాటలేదు.

ఆదోని శివారులో ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో 58 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు. వంద సీట్లు, 450 పడకల సామర్థ్యంతో 475 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా అతీగతీ లేదని స్థానికులు వాపోతున్నారు. 2023 చివరి నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించగా.. పనులు జరుగుతున్న తీరును చూస్తే మరో మూడేళ్లు పట్టేలా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల నిర్మాణం కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాకుండా చిత్తశుద్ధితో పనులు చేపట్టాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.