చిరు ధాన్యాల ధరల మంట.. కొనలేని పరిస్థితిలో పేద, మధ్యతరగతి ప్రజలు

author img

By

Published : Jan 30, 2023, 9:20 AM IST

millets

Millets Prices Increased: చిరుధాన్యాలను తినాలి అనుకునే పేదవారి ఆశ.. తీరే విధంగా కనిపించడం లేదు. చిరు ధాన్యాల ధరలు.. బియ్యం రేట్లను మించిపోయాయి. దీంతో మార్కెట్లో వీటిని కొనలేని పరిస్థితి ఉంది. అలా అని పండించిన రైతుకు మాత్రం లాభం రావడం లేదు.

Millets Prices Increased: పదేళ్ల కిందట చిరుధాన్యాలను పండించినా కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు కొనేవారున్నా వాటి ధరలు పేదలకు అందుబాటులో ఉండటం లేదు. పచ్చజొన్నల ధర కిలో రూ.70 నుంచి రూ.80 వరకూ పలుకుతోంది. కొర్రల ధర కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ ఉంది. బియ్యం రేట్లను మించిపోయాయి. రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీతో రాగులు, జొన్నలను పంపిణీ చేయడంపై ఇటీవల వాలంటీర్లతో సర్వే చేయిస్తే.. కార్డుదారులంతా కావాలనే కోరారు. మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా ఉన్నత, మధ్యతరగతి కుటుంబాలే కాదు.. పేదలూ వాటి వినియోగంపై ఆసక్తి చూపుతున్నారనేందుకు ఇదే నిదర్శనం. అవసరమైన మేర చిరుధాన్యాలే అందుబాటులో లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే చిరుధాన్యాల సాగు అధికంగా ఉండేది. దిగుబడులు లేకపోవడం, పండించినా వాటిని మార్కెట్‌లో కొనేవారు కనిపించకపోవడంతో.. 18 ఏళ్లలో 52% మేర సాగు పడిపోయింది. నాలుగైదేళ్లుగా సాగు కొంతమేర పెరిగినా.. గిట్టుబాటు ధరలు లభించడం లేదు. చిరుధాన్యాల సాగు, రైతుల్ని ప్రోత్సహించేందుకే మిల్లెట్‌ మిషన్‌ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించినా రైతులకు ఒరిగిందేమీ లేదు.

పెరుగుతున్న పెట్టుబడి: కొందరు రైతులు సాగుకు ముందుకొస్తున్నా.. పెట్టుబడులు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఆలోచనలో పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో కిలో పచ్చజొన్న రూ.40 చొప్పున రైతుల నుంచి కొంటూ.. మార్కెట్లో రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. కొర్ర పండించే రైతుకు దక్కేది కిలోకు రూ.30లోపే అయినా.. మార్కెట్లో రూ.50నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారు. గతేడాది రబీలో వరిగ వేసే సమయంలో క్వింటా రూ.6వేలు పలికిన వరిగ.. పంట చేతికొచ్చే నాటికి రూ.2,500 చేరిందని ప్రకాశం జిల్లాకు చెందిన రమేశ్‌ అనే రైతు వాపోయారు. సజ్జ కూడా క్వింటా రూ.2,200 మించి కొనడం లేదని రైతులు పేర్కొంటున్నారు.

కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం: గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా జొన్న, రాగులను పంపిణీ చేసినా.. 2019-20 నుంచి నిలిపేశారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఇందుకు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రేషన్‌ దుకాణాల ద్వారా జొన్నలు, రాగుల్ని పంపిణీ చేస్తామంటోంది. అధిక విస్తీర్ణంలో సాగు చేయాలంటూ లక్ష్యాలు నిర్ణయిస్తున్నా.. మద్దతు ధర పెంచి వాటిని కొనుగోలు చేయడంపై దృష్టి సారించడం లేదు. అధిక దిగుబడినిచ్చే రకాలనూ అందుబాటులో ఉంచడం లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.