ETV Bharat / state

Jagananna Colonies జగనన్న కాలనీలా! చెరువులా!.. ఇల్లు నిర్మించాక పరిస్థితి ఏంటంటున్నలబ్ధిదారులు

author img

By

Published : May 5, 2023, 8:15 AM IST

Updated : May 5, 2023, 10:02 AM IST

Jagananna Colonies: పేదల సొంతింటి కల నేరవేరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు, పేదలు అందరికి ఇల్లు పథకంలోని శంఖు స్థాపన చేసిన జగనన్న కాలనీలు చిన్నాభిన్నమయ్యాయి. వర్షపు నీటికి వేసిన కాంక్రిట్ పునాదులు గాలిలో తెలియాడుతున్నాయి. వేసవిలో కురిసిన గంట వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి.

Jagananna Colonies
Jagananna Colonies

Jagananna Colonies: ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకుపడినా.. నీరు పోయే మార్గం లేక ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి ఇళ్ల నిర్మాణాల మధ్య నీరు నిలిచి వాటి నాణ్యత ప్రశ్నార్థకమైంది. కోట్లు పోసి మెరక చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, చాలా చోట్ల ఫలితం లేకుండా పోతోంది. కొన్ని లే అవుట్లలో మెరక చేయకుండానే వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు, చెరువు, కాలువలను ఆనుకుని, పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది. నాణ్యత లేకుండా నిర్మించిన అంతర్గత రహదారులు, కాలనీల్లోకి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన గ్రావెల్‌ రోడ్లు.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే రూపును కోల్పోయి గుంతలమయమయ్యాయి. కోట్లు వెచ్చించి వేసిన రోడ్లు కోతకు గురయ్యాయి. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన జగనన్న కాలనీల్లో మెరక, చదును పనులు చేసేందుకే ప్రభుత్వం ఇప్పటివరకు 2,200 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. ఈ పనులు నాణ్యంగా చేపట్టకపోవడం వల్ల చాలాచోట్ల నిర్మాణాలు పూర్తికాక ముందే మెరక చెదిరింది. అలాంటిచోట మళ్లీ కోట్లు కుమ్మరిస్తున్నారు. మెరక, చదును కోసం సింహభాగం నిధులను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే వినియోగించారు. చివరకు పేదలనుంచి ఓటీఎస్‌ పేరుతో పిండుకున్న సుమారు 300 కోట్లనూ వినియోగించారు. ఉపాధి హామీ పథకం కింద 1,100 కోట్లు వెచ్చించగా, మరో 800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

పునాదుల కింద మట్టి కొట్టుకుపోయింది.. ఇది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలోని జగనన్న కాలనీ. ఇక్కడ 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలనిచ్చారు. పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగనే ప్రారంభించారు. గుత్తేదారుతో ఇళ్ల నిర్మాణం చేయిస్తున్నారు. కొండవాలు ప్రాంతంలో లే అవుట్ చేయించడం వల్ల వర్షం కురిసినప్పుడు పైనుంచి వచ్చే వరద నీటికి లే అవుట్‌ కోతకు గురైంది. పునాదుల కింద నుంచి నీరు పారి మట్టి కొట్టుకుపోయింది.

కాలనీ అంతా జలమయం.. ఇది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామంలోని పేదలకు 550 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. సుమారు వందమందికిపైగా గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. గురువారం కురిసిన వర్షానికి నీళ్లు బయటకు పోయే మార్గం లేక కాలనీ అంతా జలమయమైంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే మార్గం కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.

ఇవేం కాలనీలు జగనన్నా.. చిరుజల్లు కురిసినా చెరువులే

ఇవీ చదవండి:

Last Updated :May 5, 2023, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.