ETV Bharat / state

ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 7:20 AM IST

it_sector
it_sector

IT Sector is Not Progressing Under YCP Government: ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం ఇవీ ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ ఇచ్చిన హామీలు. అయితే ఉపాధి కల్పనలో ఎంతో కీలకమైన ఐటీ రంగం పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వెనుకబడింది. గత అయిదేళ్ల కాలంలో కేవలం 59 కంపెనీలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగమంటే వలస పోవడం తప్ప యువతకు వేరే గత్యంతరం కనిపించని పరిస్థితి దాపురించింది.

ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం

IT Sector is Not Progressing Under YCP Government: బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో తెలుగు వారే అత్యధికంగా ఉంటారు. వారిలోనూ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. రాష్ట్రంలో ప్రముఖ నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడల్లో ఐటీ పరిశ్రమ విస్తరించి ఉంటే యువతలో అధికశాతానికి వలసబాట తప్పేది. సొంత రాష్ట్రంలోనే ఘనమైన ఉపాధి దొరికేది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆనాటి ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ ఇప్పుడున్న వైఎస్సార్​సీపీ సర్కారు చూపకపోవడంతో ఆ రంగం ఆశించిన స్థాయిలో ముందడుగు వేయలేకపోయింది.

ఐటీ కంపెనీ పెట్టాలంటే భయపడే పరిస్థితి: వైసీపీ సర్కార్ విద్యుత్‌ పీపీఏలు, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామిక వేత్తలను వేధింపులకు గురి చేసింది. ఆ ప్రభావం ఐటీ రంగంపైనా పడి కంపెనీ ఏర్పాటు చేయడానికి యజమానులు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు, పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల అమలుకు ఏపీని పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి. అదానీ సంస్థ విశాఖలో 70 వేల కోట్ల పెట్టుబడులతో 5 గిగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యమిచ్చింది. దీంతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని 21 వేల 844 కోట్లకు తగ్గించి 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు పరిమితమైంది.

Jagan promises to Vizag: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మహానగరం.. హామీల అమలులో జగన్ వైఫల్యం

ఉపాధి దొరక్క వలసపోతున్న లక్షల మంది యువత: ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పదేపదే చెప్పింది. ఐటీ పార్కులు, ఆఫీసు స్పేసెస్, కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది. నైపుణ్య మానవ వనరులు, వందల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నా ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. దీంతో ఇంజినీరింగ్‌ పట్టాతో బయటకు వస్తున్న లక్షల మంది యువత సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారు.

వైఎస్సార్​సీపీ హయాంలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గణాంకాల ప్రకారం 59 ఐటీ సంస్థలే వచ్చాయి. వాటిలో అధికశాతం విశాఖ, తిరుపతికే పరిమితమయ్యాయి. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో 13 లక్షల 12 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందాల్లో ఐటీ రంగం వాటా 3.18 శాతం అంటే 41 వేల 748 కోట్లు మాత్రమే.

విశాఖలో ఐటీ రంగం వెలవెల.. భవనాలు ఖాళీ

వైఎస్సార్​సీపీ అధికారంలోకి రాగానే మూత పడిన భవనాలు: వైఎస్సార్​సీపీ సర్కార్ ఐటీ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోగా ఉన్న వాటినీ నిరుపయోగంగా మార్చేసింది. గత ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇస్తూ విశాఖలో స్టార్టప్‌ విలేజ్‌ను ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్‌ కంపెనీలు ప్రత్యక్షంగా మరో 80 స్టార్టప్‌లు వర్చువల్‌ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత దశ యాక్సిలరేటర్‌ స్థాయి కంపెనీల కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోని స్టార్టప్‌ విలేజ్‌ను మూసేసి అక్కడి భవనాలను మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచింది. మిలీనియం టవర్స్‌ 1, 2 భవనాలను ఖాళీగా ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన వాటికి దానిలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించలేదు.

హాస్యస్పదంగా జగన్‌ ప్రభుత్వం గొప్పలు: వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం కొన్ని చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇన్ఫోసిస్‌ సంస్థ ఏపీలో విశాఖను ఎంపిక చేసుకుంది. అంతేకానీ దీని వల్ల అదనంగా ఉపాధి ఏమీ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం దగ్గర హెచ్‌సీఎల్‌ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యువతకు సొంతంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. కానీ, కృష్ణా జిల్లాలో హెచ్‌సీఎల్‌ కేంద్రం 2023లో ఏర్పాటు చేసినట్లుగా జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం హాస్యస్పదంగా మారింది. ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సాంకేతిక విభాగానికి శ్రీనాథ్‌ దేవిరెడ్డి, విద్యాసాగర్‌ రెడ్డి, పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్‌కు రాజశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అయినా ఫలితాలు కనిపించలేదు. ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత 5 ఏళ్లలో 21 సంస్థలు కేవలం 6 కోట్ల 20 లక్షల రూపాయలను ప్రోత్సాహకాలుగా పొందాయి. అంటే ఏటా సగటున కోటి 24 లక్షల ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లయింది.

Industries in AP: వైఎస్సార్​సీపీ ఎంపీకే వ్యాపారం చేయలేని పరిస్థితి.. వెళ్లిపోతున్న పరిశ్రమలు.. ఇది జగనన్న పాలన

లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయడంలో డీలా: 2021-24 ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది. ఐటీ రంగాన్ని తామే పతాక స్థాయిలో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. ఐటీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేస్తామని, కార్యకలాపాలను వెంటనే ప్రారంభించడానికి వీలుగా కో వర్కింగ్‌ స్పేస్, శాటిలైట్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తామని పాలసీలో వివరించింది. స్టార్టప్‌లు, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులతో వచ్చే వారికి వెంటనే అనుమతులు ఇస్తామని పేర్కొంది. విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ రంగానికి అవసరమైన రీసెర్చ్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్స్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ల్యాబ్‌లు, కో-వర్కింగ్‌ స్పేసెస్, స్టేట్‌ డేటా సెంటర్‌ వంటి వాటిని అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటికీ ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది. పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.