ETV Bharat / state

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్​లో ప్రవేశాలకు మరోసారి అవకాశం..

author img

By

Published : Nov 21, 2022, 1:30 PM IST

INTER ADMISSIONS 2022: తెలంగాణలో ఇంటర్ ప్రవేశాలకు బోర్డు మరోసారి అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ప్రవేశాల గడువు పొడిగించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఇంటర్​లో ప్రవేశాలకు మరోసారి అవకాశం
ఇంటర్​లో ప్రవేశాలకు మరోసారి అవకాశం

INTER ADMISSIONS 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం తరగతులు మొదలై 4 నెలలు గడిచాక మరోసారి ప్రవేశాలకు.. ఇంటర్మీడియట్ బోర్డు అనుమతించింది. తొలి ఏడాది ప్రవేశాలు జూన్‌లో మొదలు కాగా.. పలుమార్లు గడువును పొడిగిస్తూ చివరకు అక్టోబరు 15వ తేదీకి ముగించారు. తాజాగా నేటి నుంచి ఈ నెల 27 వరకు ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో బోర్డు తెలిపింది. ఇప్పటి వరకు 3.50 లక్షల మంది విద్యార్థుల పేర్లే బోర్డు లాగిన్‌ పరిధిలోకి వచ్చాయి. వారికి మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అర్హత ఉంటుంది. ఇంకా దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది ప్రవేశాలు బోర్డు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదు. అది జరగాలంటే ఆయా కళాశాలల యాజమాన్యాలకు లాగిన్‌ అయ్యేందుకు బోర్డు అవకాశం ఇవ్వాలి. ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపు లేకపోవడంతో ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విద్యార్థుల కోసం ఈ గడువును పెంచారు.

గుర్తింపు రాని 475 కళాశాలలు..: 125 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్‌) దరఖాస్తులు ఇంటర్‌బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి అఫిలియేషన్‌ జారీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోమవారం నుంచి ఆయా కళాశాలలకు లాగిన్‌ అవకాశం ఇస్తారు. గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న మరో 350 ప్రైవేట్‌ కళాశాలలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ దక్కకపోవడంతో వాటికి ఇంటర్‌బోర్డు అఫిలియేషన్‌ ఇవ్వలేదు. ఈ ఏడాది వాటికి అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ లేకుండానే అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం హోంశాఖ కార్యదర్శితో సమావేశం జరగనుంది. వాటికి 27లోపు అనుమతి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.