ETV Bharat / state

High Court on Maha Kumbhabhishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం వాయిదాపై హైకోర్టు ప్రశ్నలు

author img

By

Published : May 24, 2023, 10:07 AM IST

Maha Kumbhabhishekam at Srisailam postponed
శ్రీశైలంలో మహా కుంభాభిషేకం వాయిదా

High Court on Maha Kumbhabhishekam in Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం వాయిదా వేయడంపై దేవాదాయ కమిషనర్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఎవర్ని సంప్రదించి గత ముహుర్తం నిర్ణయించారు?... ఈ కార్యక్రమం వాయిదా వేసే విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారా? ఇప్పటి వరకు ఎంత ఖర్చుచేశారు? అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈవోను ఆదేశించింది. తగినంత సమయం లేనందున ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. మహా కుంభాభిషేకం నిర్వహించాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

High Court on Postponement of Maha Kumbhabhishekam in Srisailam: శ్రీశైలంలో ఈనెల 25 నుంచి 31 వరకు నిర్వహించతలపెట్టిన మహా కుంభాభిషేకం.. వాయిదా వేస్తూ దేవదాయశాఖ కమిషనర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ ఛైర్మన్‌ సంగాల సాగర్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తి చేసినందున షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమం నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదించారు.

కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. వాయిదా వేయడానికి ముందు ఎవర్ని సంప్రదించలేదని.. ఏర్పాట్ల కోసం ఇప్పటికే 3కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారన్నారు. ఓ ఆహ్వానితుడు కుంభాభిషేకానికి రానంత మాత్రానా కార్యక్రమాన్ని వాయిదా వేయడం సరికాదని.. వడగాడ్పులు కారణమని బయటకు చెబుతున్నా.. అంతర్గతంగా ఇతర కారణాలున్నాయని వాదించారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఆ రోజుల్లో కుంభాభిషేకం నిర్వహిస్తే భక్తులకు ఇబ్బంది తలెత్తుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ పెద్దలు, అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. కార్యక్రమాన్ని వాయిదా వేయడం అంటే ముహుర్తాన్ని మార్చడంతో సమానమని.. వేదపండితులు ఖరారు చేసిన ముహుర్తాన్ని కమిషనర్‌ నిర్ణయంతో మార్చడం సరికాదన్నారు. సీఎంవోలో సమావేశం నిర్వహించి, మహాకుంభాభిషేకం నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఆహ్వాన పత్రికలు పంచిపెట్టిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేయడం సరికాదని తెలిపారు.

కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మహా కుంభాభిషేకం వాయిదా వేయడంపై దేవాదాయ కమిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ఎవర్ని సంప్రదించి గత ముహుర్తాన్ని నిర్ణయించారు? కార్యక్రమాన్ని వాయిదా వేసే విషయంలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారా? అని హైకోర్టు నిలదీసింది. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లకు ఇప్పటి వరకు ఎంత ఖర్చుచేశారు? వాయిదా వేయడం వల్ల ఆ సొమ్ము వృథా అవుతుందా? వంటి సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది.

కార్యక్రమం నిర్వహణ నిర్ణయం, వాయిదా వేయడంలో శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుల పాత్ర, కార్యక్రమ నిర్వహణ కోసం దేవస్థానం సొమ్ము ఎంత ఖర్చు చేశారో తదితర వివరాలతో కౌంటర్‌ వేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవోకు సూచించింది. తగినంత సమయం లేనందున ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మహా కుంభాభిషేకం నిర్వహించాలని ఆదేశించలేమని తెలిపింది. మరోవైపు కార్తీకమాసం సమయంలో కుంభాభిషేకం నిర్వహిస్తామని చెప్పడంపై ఆక్షేపించింది.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని, ఆ రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయని..కుంభాభిషేకం కారణంగా సేవలు రద్దు చేస్తే భక్తులు అసౌకర్యానికి గురవుతారని స్పష్టం చేసింది. ప్రస్తుత పిల్‌పై విచారణను పెండింగ్‌లో ఉంచి పర్యవేక్షిస్తామని తెలిపింది. పిటిషనర్‌ అభ్యంతరాలపై ఏమి చెబుతారని దేవాదాయశాఖ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దేవస్థానం అధికారులతో సంప్రదించాకే వాయిదా వేసేందుకు కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారని.. విజయవాడలో ఇటీవల నిర్వహించిన యజ్ఞానికి వడగాడ్పులు కారణంగా భక్తులు అనుకున్న స్థాయిలో హాజరుకాలేదని.. మహా కుంభాభిషేకం విషయంలో కంచి పీఠాధిపతిని దేవస్థానం ఈవో సంప్రదించగా వాయిదా వేయాలని సలహా ఇచ్చారని తెలిపారు.

ఎవర్ని సంప్రదించకుండా కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్‌ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. కుంభాభిషేకం నిర్వహణకు ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే చేశామన్నారు. ఆర్థికంగా దేవస్థానానికి నష్టం ఏమి లేదన్నారు. వడగాడ్పుల వల్ల కేవలం వాయిదా వేశారు తప్ప.. పూర్తిగా కార్యక్రమాన్ని రద్దు చేయలేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.