ETV Bharat / state

HC ON CI ISSUE: 'ఠాణాకు వెళ్లేందుకు న్యాయవాదులు భయపడితే వ్యవస్థ పతనమైనట్లే': హైకోర్టు

author img

By

Published : Jul 6, 2023, 8:33 AM IST

HC ON CI ISSUE: న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఠాణాకు వెళ్లేందుకు న్యాయవాదులు భయపడితే ఆ రోజు వ్యవస్థ పతనమైనట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. హిందూపురం సీఐ కేసు వ్యవహారాన్ని సుమోటో పిల్‌, కోర్టుధిక్కరణ వ్యాజ్యాలుగా మలిచి విచారణ చేపట్టిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

Etv Bharat
Etv Bharat

HC SERIOUS ON CI: న్యాయవాది ఉదయ్‌ సింహారెడ్డి, కోర్టు సిబ్బంది శివశంకర్‌పై.. హిందూపురం 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఇస్మాయిల్‌ చేయిచేసుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఠాణాకు వెళ్లేందుకు న్యాయవాదులు భయపడితే ఆ రోజు వ్యవస్థ పతనమైనట్లేనని.. ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ధర్మాసనం పేర్కొంది. కోర్టు సిబ్బందిని భయపెట్టేందుకే పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారని.., ఆ తర్వాత పొరపాటు జరిగిందని చెబుతూ కేసును మూసివేశారని గుర్తుచేసింది. ఆయన వ్యవహార శైలి ఏవిధంగా ఆమోదయోగ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. సీఐపై సంబంధిత డీఐజీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో కొంత కాలం వేచిచూద్దామని పేర్కొంటూ.. విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు సీఐ ఇస్మాయిల్‌ హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది.

HC SERIOUS ON CI: అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ.. అమాయకులను చితకబాదుతూ..

ఇదీ జరిగింది.. గతేడాది అక్టోబర్​లో దొంగతనం ఆరోపణతో గిరీష్ అనే వ్యక్తిని హిందూపురం పోలీసు స్టేషన్​కు తీసుకొచ్చిన సీఐ ఇస్మాయిల్.. విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తన కుమారుడిని అక్రమ నిర్బంధంలో హింసిస్తున్నారని నిందితుడి తల్లి స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై హిందూపురం కోర్టు.. అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసి పోలీసు స్టేషన్​లోని నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అక్రమ నిర్బంధంలో ఉన్న గిరీష్ కోసం అడ్వకేట్ కమిషన్ సభ్యులు, న్యాయవాదులు 2022 అక్టోబర్‌ 21న ఠాణాకు వెళ్లారు. ఆ సమయంలో గిరీష్‌ అక్రమ నిర్బంధంలో ఉన్నట్లు, పోలీసులు అతడిని కొట్టినట్లు అడ్వకేట్ కమిషనర్‌ గమనించారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెల్తానని చెప్పగా.. అందుకు సీఐ ఇస్మాయిల్‌ నిరాకరించారు.

ఈ క్రమంలో అడ్వకేట్‌ కమిషనర్‌పై సీఐ చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కమిషన్ అధికారి సహాయకుడిగా వెళ్లిన కోర్టు సిబ్బందిపై కూడా అక్రమ కేసు పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు గిరీష్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. అతడికి వైద్య పరీక్షలు చేయించగా.. పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో సీఐ ఇస్మాయిల్​పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి.. పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను డీఐజీతోపాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించారు. ఇంత జరిగినా సీఐని.. కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. కాగా హిందూపురం పోలీసు స్టేషన్​లో జరిగిన ఈ ఘటనపై హైకోర్టు ఇటీవల జరిపిన విచారణలో తీవ్రంగా స్పందించి.. సీఐ ఇస్మాయిల్​ వ్యవహరించిన తీరుపై మండిపడింది.

AP High Court: జ్యుడీషియల్‌ అధికారిని బెదిరించడానికి ఎంత ధైర్యం?.. సీఐపై హైకోర్టు ఆగ్రహం

ఈ వ్యవహారం హైకోర్టు రిజిస్ట్రార్‌ విజిలెన్స్‌కు చేరింది. ఆ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా ఉన్న హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. ఇది చాలా తీవ్రమైన వ్యవహారంగా పరిగణించారు. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడేందుకు ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని నిర్దేశించారు. పిల్‌ను కమిటీ ముందు ఉంచేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో పిల్‌, కోర్టుధిక్కరణ వ్యాజ్యాలుగా మలిచి విచారణ చేస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు హిందూపురం సీఐ ఇస్మాయిల్‌ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్న అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సీఐ ఇస్మాయిల్​కు విధించిన స్వల్ప శిక్షను పెద్ద శిక్షగా మార్చినట్లు తెలిపారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ తన వాదనలు వినిపిస్తూ.. క్రమశిక్షణ చర్యలు తీసుకునే వ్యవహారం ఇంకా డీఐజీ పరిధిలో ఉందన్నని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.

BJP leaders protest: సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.