ETV Bharat / state

R-5 Zone Houses Construction: లబ్ధిదారుల రుణంతో ఇళ్ల నిర్మాణం..కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా?

author img

By

Published : Jul 13, 2023, 7:10 AM IST

Updated : Jul 13, 2023, 12:16 PM IST

R-5 Zone Houses Construction: రాజధానిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. కేంద్రం ఇప్పుడే నిధులివ్వమని తేల్చి చెప్పినా.. లబ్ధిదారులకు రుణం ఇప్పించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం కలిపి ఇళ్లు నిర్మించనున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

Etv Bharat
Etv Bharat

లబ్ధిదారుల రుణంతో ఇళ్ల నిర్మాణం

R-5 Zone Houses Construction : రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్‌లో బయటి ప్రాంతాలకు చెందిన 47వేల మందికి ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కోర్టు కేసులు తేలిన తర్వాతే నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించడంతో కొత్త ఎత్తుగడ వేసింది. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్‌ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఇప్పించే రుణం, రాష్ట్ర వాటా వినియోగించి తొలుత ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో లబ్ధిదారునికి బ్యాంకుల నుంచి 35వేల చొప్పున రుణం అందిస్తోంది. ఆ మొత్తాన్నే ఇళ్ల నిర్మాణానికి వెచ్చించనుంది. ఇలా పావలా వడ్డీకి లబ్ధిదారుల నుంచి 164.50 కోట్లు సమీకరించనుంది. అందుకోసం లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30వేలు అందిస్తోంది. ఈ మొత్తం 141 కోట్లు అవుతుంది. ఈ రెండూ కలిపితే దాదాపు 305.50 కోట్లు కానుంది. ఈ మొత్తంతో ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా? లబ్ధిదారులు పరిస్థితి : రాజధాని ప్రాంతంలో బయటి ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంపై కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే.. ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పట్టాల పంపిణీకే అనుమతి ఇచ్చిందా.. ఇళ్ల నిర్మాణాలకు కూడానా.. అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కోర్టులో కేసులు ఇలా విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు కదులుతోంది. లబ్ధిదారులకు బ్యాంకులు రుణమిచ్చింది మొదలు ఆ మరుసటి నెల నుంచే వాయిదాలు చెల్లించాలి. ఈ చెల్లింపునకు లబ్ధిదారుడే జవాబుదారీ. ఇళ్ల నిర్మాణంతో సంబంధం లేకుండా నిర్దేశిత గడువులోగా తిరిగి చెల్లించాలి. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే రుణ మొత్తం పరిస్థితేంటని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

సకాలంలో కేసులు పరిష్కారం కాకపోతే : ప్రభుత్వం ఈ 305.5 కోట్లను వినియోగించేలోపు కోర్టు కేసులు తేలకపోతే పరిస్థితి ఏంటనేదీ ప్రశ్నగా ఉంది. ఇతర చోట్ల ఇళ్ల నిర్మాణాలకిచ్చే నిధుల్ని అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించకూడదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. 2 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే లక్షన్నర భరించాల్సి ఉండగా.. ఇప్పటికీ అతీగతీ లేదు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఇస్తున్న లక్షా 80వేలు చాలడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను మరో లక్ష ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలేవీ ఇప్పటికీ పరిష్కరించలేదు. ఒకవేళ అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తం భరిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. గృహ నిర్మాణశాఖ అధికారులు మాత్రం లబ్ధిదారుల రుణం, రాష్ట్ర వాటా వినియోగం తర్వాత మిగతా నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

Last Updated : Jul 13, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.