ETV Bharat / state

నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 6:59 AM IST

Updated : Dec 17, 2023, 8:40 AM IST

Four Years for Three Capitals Announcement in AP: మూడు రాజధానుల పేరిట వైసీపీ సర్కార్‌ తెరలేపిన నాటకానికి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ దమన నీతిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమబావుటా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతోంది. సర్కార్‌ అణచివేతలు, నిర్బంధాలు, కిరాతకాలను అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకుని ఒక్కరోజూ విరామం లేకుంటా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Four_Years_for_Three_Capitals_Announcement_in_AP
Four_Years_for_Three_Capitals_Announcement_in_AP

Four Years for Three Capitals Announcement in AP: నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం

Four Years for Three Capitals Announcement in AP: 2019 డిసెంబరు 17న శాసనసభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయటంతో పాటు, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉంటే తప్పేంటన్న వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి మద్దతిచ్చి, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా రాజధానిని ఎక్కడికీ మార్చబోమని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే మాట తప్పి, మడమతిప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు.

ముఖ్యమంత్రి నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు పిడికిలి బిగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, వివిధ రంగాల్లోని నిపుణులు, దేశవిదేశాల్లోని ప్రవాసాంధ్రులు వారికి మద్దతుగా నిలిచారు. మూడు రాజధానుల నిర్ణయంతో మనస్థాపం చెంది 247 మంది రైతులు, రైతు కూలీలు అశువులు బాశారు. పోలీసుల లాఠీదెబ్బల్ని, హింసాకాండను తట్టుకుని, మహిళలు ముందువరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించారు.

ఇలా ఉద్యమజెండా దించకుండా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటం నాలుగేళ్లకు చేరింది. ఈ క్రమంలో సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. అయినా వారు వెరవకుండా ప్రభుత్వ అణచివేతకు, పోలీసుల దమనకాండకు ఎదురొడ్డి నిలిచారు.

Amaravati Farmers Movement Reached 1400 Days: జగన్ ఎంత ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరు.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రైతులు

సర్కార్‌ దుర్మార్గమైన చర్యలు: ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే క్రమంలో 2020 జనవరి 7న చినకాకాని వద్ద జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. దీంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ సర్కార్‌ దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టింది. 144 సెక్షన్, సెక్షన్ 30 వంటివి ప్రయోగించింది. రాజధాని వీధుల్లో పోలీసు కవాతులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా రాజధాని ప్రాంతంలోని రైతుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

మహిళలపై లాఠీలతో విరుచుకుపడుతూ: 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న రాజధాని మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని తీవ్రంగా మందలించడంతో పోలీసుల ఉక్కు పిడికిలిని ప్రభుత్వం కొంత సడలించింది.

2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు. శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. ఇలా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు జగన్ ప్రభుత్వం చేయని దాష్టీకం లేదు. నాలుగేళ్లపాటు ప్రభుత్వ దమనకాండను తట్టుకుని, సంయమనం కోల్పోకుండా, హింసకు తావివ్వకుండా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు.

Andhra Pradesh Three Capitals Issue: రాజధానిని మారుస్తూ అవస్థలు పడ్డా కశ్మీరును చూసి నేర్చుకోండి.. సీఎం సారూ..

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వేలకోట్ల రూపాయల విలువైన పనులను నిలిపేసింది. 70నుంచి 90శాతం నిర్మితమైన భవనాలు సైతం పూర్తి చేయకుండా గుత్తేదార్లను పంపించివేశారు. రైతులకిచ్చిన ప్లాట్లనూ అభివృద్ధి చేయలేదు. అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ఓసారి, అమరావతి పురపాలక సంఘం పేరుతో మరోసారి రాజధాని గ్రామాల్ని విడదీయాలని చూసింది.

కుట్రలను అడ్డుకున్న రైతులు: గ్రామసభల ద్వారా వాటికి రైతులు చెక్ పెట్టారు. ప్రభుత్వం ఆర్-5 పేరుతో మరో నాటకానికి తెరలేపింది. రాజధాని వెలుపల ప్రాంతాలకు చెందిన 50 వేల మంది పేదలకు రాజధానిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా నిలుపుదల చేయించారు. రాజధానిలో భూముల్ని విక్రయించేందుకు పన్నిన కుట్రలను సైతం రైతులు అడ్డుకున్నారు.

అడుగడుగునా ఆంక్షలు: అమరావతి పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు రాజధాని రైతులు 2021 నవంబరు 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. వారికి దారిపొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ప్రభుత్వం తన అక్కసు ప్రదర్శించింది. అడుగడుగునా ఆంక్షలు పెట్టింది. రైతులకు ఆశ్రయమిచ్చినవారిపై వేధింపులకు దిగింది. ప్రకాశం జిల్లాలో రైతులపై పోలీసులు వీరంగం చేసి, లారీఛార్జికి దిగడంతో పలువురు గాయపడ్డారు. ప్రజల అండతో ఆ పాదయాత్రను రైతులు విజయవంతంగా పూర్తిచేశారు.

CM Jagan Plan to Destroy Capital Amaravati: అమరావతిని నాశనం చేసేందుకు మరో ప్లాన్.. గుట్టుగా కసరత్తు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు

అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యో రోజుకు చేరిన వేళ 2022 సెప్టెంబరు 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారిపొడవునా వైసీపీ నాయకులే వారికి అడ్డుతగిలారు. రాజధాని రైతులు తమ ప్రాంతానికి ఎలా వస్తారో చూస్తామంటూ ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. ప్రతికూల పరిస్థితుల్లో రామచంద్రపురంలోనే ఆ యాత్రను రైతులు నిలిపేశారు. అయినా తమ గళాన్ని మాత్రం రైతులు వినిపిస్తూనే వచ్చారు.

రాజధాని రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే కోర్టుల్లోనూ న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 2022 మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కేసు విచారణలో ఉండగానే సీఎం క్యాంపు కార్యాలయం, వివిధ శాఖల కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు కుట్రచేసింది. ఈ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.

YSRCP Government Ignored Amaravati Development : రాష్ట్ర ప్రజలనే కాదు.. అబద్ధాలతో వైసీపీ ప్రభుత్వం కోర్టులను సైతం మోసం..

Last Updated :Dec 17, 2023, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.