ETV Bharat / state

Jagan cheated students నయవంచనగా విదేశీ విద్యా దీవెన.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన జగన్

author img

By

Published : Jul 29, 2023, 9:01 AM IST

Updated : Jul 29, 2023, 10:26 AM IST

Foreign Education Scholarship Scheme సీఎం జగన్‌ పెత్తందారీ భావజాలంతో పేద విద్యార్థుల ఉన్నత విద్య కలల్ని అడుగడుగునా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను ఇప్పటికే అమ్మకానికి పెట్టిన సీఎం.. ఇప్పుడు విదేశీ విద్యాదీవెన పథకాన్నీ పేద పిల్లలకు దక్కకుండా కుయుక్తులు పన్నుతున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారి ఉన్నత చదువులకే ఎసరు పెడుతున్నారు.

Foreign Education Scholarship Scheme
నయవంచనగా విదేశీ వాద్యా దీవెన.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన జగన్

foreign education scholarship scheme పేదలకు ఉన్నత విద్య అందించడంపై జగన్‌ మాటలు వింటుంటే, ఆయనది ఎంత పెద్ద మనసో అనుకుంటాం! నిరుపేదల ఉన్నత విద్య కోసం చేతికి ఎముకే లేనట్లు సాయం అందిస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది. కాని వాస్తవంగా జరుగుతున్న తతంగం చూస్తే.. ఇదంతా ఉత్తుత్తి పురాణమే అని తేటతెల్లం అవుతుంది. మాటలు గారడీ చేయడంలో జగన్‌ దిట్ట అని తేలిపోతుంది. అడ్డగోలు నిబంధనలతో కోత వేసి, నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల ఎదుగుదలకు ఆదరవు లేకుండా చేసేసి.. అది కంటికి కనిపించకుండా చరిత్రలో ఎవరూ చేయని ఆర్థిక సాయాన్ని తానే చేస్తున్నట్లు చెప్పడంలో జగన్‌ను మించిన నటుడు మరెవరూ ఉండరని అనిపిస్తుంది. పేద పిల్లలకు కోట్ల రూపాయల్లో సాయం అందిస్తున్నట్లు ఇంతలా డాంబికాలు పలుకుతున్న ఆయన.. రెండో విడత విదేశీ విద్యా దీవెన కింద విడుదల చేసిన జాబితాలో ఆర్థిక సాయం దక్కించుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులెందరో తెలుసా? కేవలం 8 మంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కకుండా చేసిన ఇదే కదా అసలు సిసలు పెత్తందారీతనం.

కోత కోసం మరింత పకడ్బందీగా నిబంధనలు.. గత ప్రభుత్వ హయాంలో అమలైన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు పక్కన పెట్టారు. తర్వాత కోర్టు ఆదేశాలతో పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమల్లోకి తెచ్చినా.. తన కుటిలనీతిని ప్రదర్శించి పథకానికి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ కాకుండా చూస్తున్నారు. ఆర్థిక సాయాన్ని గతం కంటే మిన్నగా ఇస్తున్నామని చూపిస్తూ పథకాన్ని అసలైన నిరుపేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు అందకుండా చేస్తున్నారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో టాప్‌ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది.

క్యూఎస్‌ ర్యాంకింగ్‌ టాప్ 100 వరకు ఉన్న యూనివర్శిటీల్లో సీటు పొందితే 100 శాతం ఫీజు భరిస్తామని, అదే 101 నుంచి 200 వరకు ఉన్న యూనివర్శిటీల్లో సీటు వస్తే, 50 శాతం ఫీజు లేదా 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని మాట మార్చింది. విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. మొదటి ఫేస్​లో అన్ని వర్గాల నుంచి 290 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 119 మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య కూడా ఎక్కువే అనుకున్నారో ఏమో.. ఈ సారి మరింత విద్యార్ధుల సంఖ్యను తగ్గించేందుకు, మరింత పకడ్బందీగా నిబంధనలు తెచ్చారు. ఆర్థిక సాయాన్ని పెంచుతున్నామనే అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించి అర్హుల సంఖ్య తగ్గించే ఎత్తుగడను అమలు చేశారు.

ఉత్తర్వుల్లో సవరణలు.. తాజాగా, సబ్జెక్టుల అంశాన్ని తెరపైకి తెచ్చి, వాటిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా ఉత్తర్వుల్లో సవరణ చేశారు. ఒక్కో సబ్జెక్టుకు 50 నుంచి 70 విశ్వవిద్యాలయాలను అధికారులు కేటాయించారు. ఈ ఎత్తుగడ బాగానే పని చేసినట్టు ఉంది. కొత్త నిబంధనలతో మొత్తంగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు సంఖ్య 50 లోపే వచ్చింది. వీరిలో గురువారం సాయం అందించింది కేవలం 8మంది విద్యార్ధులకే. మిగతావారు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లు తెచ్చిన తర్వాత సాయం అందిస్తారనడం కొసమెరుపు. అంటే మొదటి విడతగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల సంఖ్య 119తో పోలిస్తే.. రెండో విడతలో వీరి సంఖ్య దాదాపుగా 50 శాతంపైగానే కోత పడినట్లు తేలిపోయింది.

ఈ పథకం బటన్ నొక్కిన అనంతరం సీఎం తన ప్రసంగంలో 357మందికి రూ. 45కోట్ల 53లక్షల సాయం అందించినట్లు ప్రకటించారు. అయితే, ఇక్కడా ఆయన అంకెల గారడీని వదిలిపెట్టలేదు. విదేశీ విద్యాదీవెన పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నాలుగు వాయిదాల్లో చెల్లిస్తోంది. జగన్‌ దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని, ప్రసంగం చేశారు. తొలి విడతలో ఎంపిక చేసిన వారికి రెండో వాయిదా కింద ఆర్థిక సాయాన్ని అందించారు. వీరిని రెండో విడతలో ఎంపికైన వారితో కలిపి లబ్ధిదారులు ఎక్కువ ఉన్నట్టు కనిపించేలా మాయ చేశారు.

అన్నీ అందాకే విడుదల.. కొత్తగా సవరించిన నిబంధనల తర్వాత విదేశీ విద్యాదీవెన రెండో విడత కింద ఎంపిక చేసిన బీసీ విద్యార్థుల సంఖ్య 13. మరో 15 మంది విద్యార్థులు ఎంచుకున్న కోర్సుల విషయంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ గురువారం ఆర్థిక సాయం అందలేదు. వారి నుంచి ల్యాండింగ్‌ పర్మిట్, బోర్డింగ్‌ పాస్, టికెట్లు అందిన తర్వాత సాయాన్ని విడుదల చేస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మొదటి విడత కింద ఎంపిక చేసిన 64 మంది విద్యార్థులకు రెండో వాయిదా కింద ఇచ్చే సాయాన్నీ తాజాగా కలిపి సంఖ్యను పెద్దదిగా చూపించారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల విషయంలోనూ ఇదే కథ. రెండో విడత కింద 12మంది మైనారిటీ విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. వీరిలో విదేశాలకు వెళ్లినట్లు ధ్రువపత్రాలు సమర్పించిన ఇద్దరికే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. మొదటి విడత కింద ఎంపిక చేసిన 25 మందికి రెండో వాయిదా మొత్తాన్ని ఇప్పుడు జమ చేసి మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య 27 అని చూపించారు. ఎస్టీ విద్యార్థులకూ విదేశీ విద్యలో తీవ్ర అన్యాయమే జరిగింది. తొలి విడత కింద ఒక్క ఎస్టీ విద్యార్థీ ఈ పథకానికి అర్హత సాధించలేదు. రెండో విడుతలో ఎంపికైందీ ఒక్కరే. అయిదుగురు ఎస్సీ విద్యార్థులకు రెండో విడత కింద సాయాన్ని అందించినట్లు తెలిసింది.

నయవంచనగా విదేశీ విద్యా దీవెన.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన జగన్
Last Updated : Jul 29, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.