ETV Bharat / state

Farmers On R5 Zone: శ్మశానంతో పోల్చిన అమరావతిలో.. పేదలకు ఎలా స్థలాలు ఇస్తున్నారు..?: రైతులు

author img

By

Published : May 9, 2023, 8:22 PM IST

R-5 Zone Issue: కౌలు డబ్బులు చెల్లించకుండా, రిటర్నబుల్‌ ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రాజధాని నిర్మాణానికి తామిచ్చిన భూములు పందేరం చేయడానికి వీల్లేదని రైతులు తేల్చిచెప్పారు. కురగల్లులో.. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పాతిన హద్దు రాళ్లను పీకేశారు. మరోవైపు అమరావతి ఏమైనా ప్రైవేట్‌ వెంచరా అని ప్రభుత్వం ప్రశ్నిచింది.

Etv Bharat
Etv Bharat

ఆర్​ 5 జోన్ పై రైతుల నిరసన

R-5 Zone Issue: రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి.. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. ఆర్-5జోన్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లులో కొందరు రైతులు.. తమ భూముల్లో ప్లాట్లు వేసి పాతిన హద్దు రాళ్లను పీకేశారు. తమ రిటర్న్‌బుల్‌ ప్లాట్ల అభివృద్ధి సంగతేంటో తేల్చాలని డిమాండ్‌ చేశారు. కనీసం కౌలు కూడా ఇవ్వకుండా.. తామిచ్చిన భూములను ఎవరికో పందేరం చేస్తామంటే ఎలాగని రైతులు నిలదీశారు.

ఎడారి, శ్మశానంతో పోల్చిన అమరావతిలో పేదలకు ఎలా స్థలాలు ఇస్తున్నారని.. రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. అమరావతి.. ఆర్-5 జోన్ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుకుంటుందని స్పష్టం చేశారు.

ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రభుత్వం ఆగాలని.. రైతులు డిమాండ్‌ చేశారు. కృష్ణాయపాలెంలో నాలుగోరోజూ.. రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆర్-5 జోన్‌పై గ్రామ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు పట్టించుకోకుండా.. ప్రభుత్వం ముందుకు వెళ్తోందంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.

అమరావతి ఓ బ్రహ్మపదార్ధమా అంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో పేదవారికి రైతులకు కేటాయించిన ఆర్ 3 జోన్​లో ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అమరావతి భూములు ప్రైవేటు వ్యక్తులవి కావు.., ప్రభుత్వానివి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. న్యాయస్ధానాల తీర్పులను గౌరవిస్తున్నాం కనుకే రాజధానిలో సెంటు భూమిఇస్తున్నాం అంటున్న బోత్సా 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. విశాఖ రుషికొండలోనూ, కర్నూలులో ఉన్న మంచి సెంటర్లలో ఎందుకు పేదలకు సెంటు స్ధలాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నప్పుడు పూలింగ్ ఇచ్చాము.. అప్పుడు కౌలు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు జగన్ వచ్చాక కౌలు డబ్బులు రాలేదు, ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా భూమికి కొంత రోడ్డు కేటాయించారు, కొంతమందికి సెంటు భూమికి కేటాయించారు. మా ప్లాట్ మాకు అలాట్ చేసి, కౌలు డబ్బులు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. -రైతు

అమరావతిని ఎడారి, శ్మశానంతో పోల్చి ఇప్పుడు ఏ విధంగా పేదలకు సెంటు స్థలాలు ఇస్తున్నారు.. ప్రభుత్వానికి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే.. లిటిగేషన్ లేకుండా, కేసులు లేకుండా మంచి ఏరియాలో లేదా ఇంతకుముందే సీఆర్​డీఏ కింద 5శాతం భూమి పేదలకు కేటాయించింది ఉంది కదా.. ఆ భూమిలో ఇల్లు కట్టించొచ్చు కదా..! ఎవరికి అభ్యంతరం ఉండదు కదా.. జగన్ అధికారంలోకి వచ్చాక కౌలు చెక్కులు ఆపేశారు. ఇక్కడ పాతిన రాళ్లని మేమే ఇప్పుడు తొలగిస్తాము కౌలు చెక్కుల బకాయిలు చెల్లిస్తే తొలగించిన రాళ్లని మేమే పాతుతాము.- రైతు

పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధం: ఆర్‌-5 జోన్‌లో పేదలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు లేఖలు రాశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు లబ్ధిదారుల జాబితాను పంపించారు. అలాగే లబ్ధిదారుల ఫొటోలను కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారు. మరోవైపు అడిగిన భూమికి అదనంగా 200 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఆర్​డీఏ కమిషనర్​ కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇప్పటికే 1134.58 ఎకరాలు కేటాయించగా.. అదనంగా 200 ఎకరాలు ఆర్‌-5 జోన్‌కు ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.