ETV Bharat / state

ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారు..? కనికా టెక్రివాల్‌ను ప్రశ్నించిన ఈడీ

author img

By

Published : Nov 19, 2022, 8:47 PM IST

Delhi liquor scam in AP
Delhi liquor scam in AP

Delhi liquor scam case update: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు నిందితులకు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించింది.

Delhi liquor scam case update: దిల్లీ మద్యం స్కామ్‌లో ఇద్దరు నిందితులు అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌లకు ఈడీ కస్టడీని పొడిగిస్తూ.. రౌస్‌ ఎవెన్యూలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరికీ గతంలో విధించిన కస్టడీ ఇవాళ ముగియనుండగా.. ఈడీ అధికారులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై జరిగిన వాదనల్లో.. దిల్లీ మద్యం కేసులో వంద కోట్ల రూపాయల ముడుపులు చేరవేయడంలో అభిషేక్ బోయినపల్లి కీలకపాత్ర పోషించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని రాబట్టేందుకు మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈ వాదనలపై సానుకూలంగా స్పందించిన కోర్టు.. ఇద్దరు నిందితులను మరో ఐదు రోజులు కస్టడీకి ఇస్తూ.. ఉత్తర్వులు జారీచేసింది.

కనికా టెక్రివాల్‌ను ప్రశ్నించిన ఈడీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ద్వారా కనికా టెక్రివాల్‌ ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. అయితే, ఈ సంస్థ నడిపిన విమానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ప్రయాణించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారని గుర్తించారు. దీంతో ఈ సంస్థ నడిపిన విమాన సర్వీసుల వివరాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆప్‌ ఇండియా (ఏఏఐ) నుంచి గతనెల 18న జెట్‌ సెట్‌ గో సంస్థ వివరాలను ఈడీ సేకరించింది.

జెట్‌ సెట్‌ గో సంస్థ ద్వారా నడుస్తున్న విమానాలు ఏమిటి? సంస్థ కార్యనిర్వహణ ఏవిధంగా ఉంది? సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిపినటువంటి కార్యకలాపాలు, చార్టెర్డ్‌ విమానాల ద్వారా ప్రయాణించిన ప్రయాణికులు, మేనేజర్ల వివరాలను ఏఏఐ నుంచి ఈడీ సమాచారం తీసుకుంది. ఈ సమాచారం ఆధారంగానే వివరాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే కనికాను విచారణకు పిలిచి ప్రశ్నించామని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.