ETV Bharat / state

YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

author img

By

Published : Jun 23, 2023, 8:20 AM IST

YSRCP anarchists: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల నేరాలు..ఘోరాలకు అంతే లేకుండా పోయింది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, కబ్జాలు అన్నింటిలోనూ వైఎస్సార్​సీపీ నాయకులే ఉన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలకు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా పోలీసులది ప్రేక్షకపాత్రే. తనకు ప్రాణహాని ఉందంటూ.. విపక్ష పార్టీకి చెందిన అధ్యక్షుడే ప్రకటించినా పట్టించుకోని దుస్థితి ఖాకీలది.

YCP anarchists
అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

YSRCP anarchists: వైఎస్సార్​సీపీ నాయకులు యథేచ్ఛగా చెలరేగిపోతూ.. దాడులు, నేరాలకు తెగబడుతుంటే సీఎం జగన్‌ ఏనాడూ వాటిని ఖండించరు. పైగా తనను తిడితే అభిమానులకు బీపీ పెరుగుతుందంటూ వారి దాడుల్ని సమర్థించుకున్నారు కూడా. అందుకే వీటన్నింటికీ ముఖ్యమంత్రినే వేలెత్తి చూపాలి’’ అని ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరనియంత్రణపై జిల్లా ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించిన దాఖలాలే లేవు. చట్టం ముందు అందరూ సమానులేనని.. అధికారపార్టీ నాయకులు తప్పుచేసినా వారిపై చర్యలు తీసుకోవాలని ఏనాడూ చెప్పలేదు. పైగా అధికారపార్టీ అరాచకాలకు వత్తాసు పలికేలా పోలీసు వ్యవస్థను మార్చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా.. ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన అర్మీ జవాన్‌ సమరసింహారెడ్డిపై.. వైఎస్సార్​సీపీ నాయకుడు, జెడ్పీ వైస్‌ఛైర్మన్‌ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. గ్రామంలో జరిగిన జాతరకు టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ను ఆహ్వానించారనే అక్కసుతో దాడికి పాల్పడ్డారు.

విజయవాడ.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓవ్యక్తి ఉమ్మివేయగా అది తన కారుపై పడిందంటూ విజయవాడలో వైఎస్సార్​సీపీ నాయకుడు.. ద్విచక్ర వాహనదారుపై బెల్టుతో దాడిచేశారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు దాడిచేసి ఇనుప చువ్వతో కన్నుపొడిచేశారు.

పల్నాడు జిల్లా.. కారంపూడి మండలం మిరియాలలో టీడీపీకు చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టర్‌కు వైఎస్సార్​సీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. ఆ గ్రామంలో జరిగిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆహ్వానించి, ట్రాక్టర్‌లో ఊరేగించినందుకు ఆ ట్రాక్టర్‌పై డీజిల్‌ పోసి నిప్పంటించారు.

రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనాన్ని అడ్డుకుని ఆయన వాహనశ్రేణిపై వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు విసిరారు. కర్రలతో కొట్టారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. సత్యకుమార్‌ వ్యక్తిగత సహాయకుడు కశయ్య యాదవ్, దళిత నాయకుడు సురేష్‌ను ఈడ్చుకెళ్లి కొట్టారు.

ALSO READ: నెంబర్​ లేని కార్లతో మంత్రి జోగి రమేష్ అనుచరుల హల్​చల్.. భక్తులపై దాడి

వైఎస్సార్​సీపీ నేతలుగా పోలీసుల తీరు.. వైఎస్సార్​సీపీ నాయకులు దాడులకు పాల్పడినా, దౌర్జన్యం చేసినా, విధ్వంసం సృష్టించినా, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లపైకి వెళ్లినా, పార్టీ కార్యాలయాలను తగలబెట్టినా, చివరికి హత్యలు చేసినా వారిపై కఠినచర్యలు తీసుకోలేని పరిస్థితి పోలీసులది. అధికారపార్టీలోని కీలక నాయకులు, ప్రభుత్వంలోని ముఖ్య స్థానాల్లో ఉన్నవారి ఒత్తిడి వల్ల వారు చేతులు కట్టేసుకుని ఉండాల్సి వస్తోంది. ఎవరైనా ధైర్యంగా తెగించి చర్యలు తీసుకుంటే ఆ అధికారులను అక్కడి నుంచి శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. అందుకే అధికార పార్టీ నాయకుల అరాచకాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. గన్నవరంలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్​సీపీ నేతలు దాడిచేస్తుంటే పోలీసులు వారిని బతిమలాడుకున్నారు.

విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్‌ కేసులో.. నిందితుడైన రౌడీషీటర్‌ హేమంత్‌.. రోజూ పీఎంపాలెం పోలీసుస్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలి. పోలీసులకు తనపై అనుమానం రాకుండా తన నిర్బంధంలో ఉన్న ఎంపీ కుమారుడు శరత్‌ను బెదిరించి ఆయనతో పీఎంపాలెం పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేయించాడు. మూడు రోజుల పాటు పోలీసుస్టేషన్‌లో సంతకం పెట్టటానికి రాడంటూ శరత్‌తో చెప్పించాడు. రెండు రోజులు స్టేషన్‌కు హేమంత్‌ రాకపోయినా వారు పట్టించుకోలేదు. అతను కచ్చితంగా హాజరుకావాలని పోలీసులు నిర్మొహమాటంగా చెప్పి ఉంటే.. ఆ కిడ్నాప్‌ విషయం ముందే తెలిసేది. కానీ అలా ఎదురు సమాధానం చెప్పడానికి వీల్లేనంతగా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. ఒక రౌడీషీటర్‌కు మద్దతుగా ఎంపీ కుమారుడు ఫోన్‌ చేస్తే పోలీసులు ఎందుకు వినాలి? వైఎస్సార్​సీపీ నాయకుల ఆదేశాలకు పోలీసులు తలొగ్గాల్సిన పరిస్థితులు ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం.

పవన్‌కల్యాణ్‌ ప్రాణహాని ఉందన్నా.. వివేకానందరెడ్డి హత్య వెనకున్నవారే.. తనను తొలగించటానికి సుపారీ ఇచ్చారని..జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. అయినా పోలీసుల్లో కనీస స్పందన లేదు. వైఎస్సార్​సీపీ నేతలపై వచ్చే ఫిర్యాదులు, ఆరోపణలపై పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు ఇదొక ఉదంతం మాత్రమే.

ALSO READ: పరాకాష్ఠకు వైసీపీ ప్రజాప్రతినిధుల అరాచకాలు.. కోట్లల్లో అక్రమ వసూళ్లు

వైఎస్సార్​సీపీ వల్ల జరిగిన బలవన్మరణాలు..

  • అధికారం అండతో రాష్ట్రంలో చాలా చోట్ల అమాయకుల ఆత్మహత్యలకు వైఎస్సార్​సీపీ నాయకులు కారకులయ్యారు. 20 లక్షల రూపాయలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వకుండా వైఎస్సార్​సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకున్నారంటూ జిల్లా ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.
  • పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణ వైఎస్సార్​సీపీ నేతల వేధింపులు, బెదిరింపులు భరించలేకపోతున్నానంటూ దళిత ఆక్వా రైతు నాగేశ్వరరావు గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు.
  • గుంటూరు వైఎస్సార్​సీపీ కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి వేధిస్తున్నారంటూ సీఎం జగన్‌కు లేఖ రాసి గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నంరాజు గిరిధరవర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
  • తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బీరుమాకుల కండ్రిగకు చెందిన కోటకొండ కన్నెమ్మ వైఎస్సార్​సీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
  • బాధ్యత గల సర్పంచి పదవిలో ఉంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించటం తగదంటూ అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్‌ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టగా వైఎస్సార్​సీపీ నాయకులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
  • తమ విలువైన స్థలం ప్రభుత్వపరం చేసేలా వైఎస్సార్​సీపీ నాయకులు వేధిస్తున్నారంటూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం గోవిందపురంలో అన్నాచెల్లెళ్లు కడియాల సోమేశ్వరరావు, అచ్చియమ్మ ఆత్మహత్య చేసుకున్నారు.
  • విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్​సీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను వివిధ సమస్యలపై ప్రశ్నించినందుకు ముస్లిం మహిళ రమీజాపై అధికారపార్టీ నాయకులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారు. రమీజా సోదరి ఛోటీని కేసు పేరిట వేధించడంతో ఆమె గుండెపోటుతో చనిపోయారు.
  • ALSO READ: మాచర్లలో వైసీపీ కార్యకర్తల అరాచకం.. టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి

రాష్ట్రంలో గత పదిరోజుల్లో జరిగిన నేరాలు-ఘోరాలు..

జూన్‌ 21వ తేదీన.. గుంటూరులో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్న శివనాగమణి అనే మహిళపై మంత్రి అనుచరులు దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసులు ఎదుటే ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించారు. సీసీ కెమెరా, సెల్‌ఫోన్‌ ధ్వంసం చేశారు.

జూన్‌ 20వ తేదీన.. పూర్వీకుల నుంచి తనకు సంక్రమించిన భూమిని కొంతమంది వైఎస్సార్​సీపీ నాయకులు ఆక్రమించుకున్నారని.. వారి నుంచి కాపాడాలంటూ ప్రకాశం జిల్లా దర్శికి చెందిన శిరిమెల్ల ఆంజనేయులు నాయీబ్రాహ్మణ, బీసీ సంక్షేమం సంఘం ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు.

మూడు రోజుల క్రితం నంద్యాల జిల్లా అవుకు మండలం చనుగొండ్లలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బైరెడ్డి చెన్నకేశవరెడ్డిని వైఎస్సార్​సీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఆయన్ను తాళ్లతో చెట్టుకు కట్టేసి రాడ్లతో కొట్టి దారుణంగా హింసించారు.

జూన్‌ 20న.. గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి భూమి ఇవ్వలేదన్న కక్షతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం లక్కవరపుపేట సర్పంచి, వైఎస్సార్​సీపీ నాయకుడు ఒకరు.. మూడు గిరిజన కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. వారికి సంక్షేమ పథకాలు నిలిపేశారు.

జూన్‌ 20న.. పల్నాడు జిల్లా కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడు వున్నం లక్ష్మీనారాయణపై వైఎస్సార్​సీపీ నేతలు హత్యాయత్నం చేశారు.

జూన్‌ 19న.. కర్రలతో ఆయన్ను తీవ్రంగా కొట్టారు. వైఎస్సార్​సీపీ నాయకుడు నాగిరెడ్డి ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ గుంటూరు విద్యానగర్‌కు చెందిన కొమ్మారెడ్డి భక్తవత్సలరెడ్డి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

జూన్‌ 19న.. శ్రీసత్యసాయి జిల్లా బత్తులపల్లిలో టీడీపీ కార్యకర్త సాకే ఎర్ర రామయ్యపై వైఎస్సార్​సీపీ నాయకులు మారణాయుధాలతో దాడికి పాల్పడి చంపేశారు. వైఎస్సార్​ సీపీ ఎంపీటీసీ సభ్యుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి.గోపాల్‌రెడ్డి ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ చొరబడి అసభ్యంగా ప్రవర్తించారు.

జూన్‌ 18న.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకుడు, రౌడీషీటర్‌ దర్శిగుంట మహేంద్ర ఓ వితంతువుపై దాడి చేశారు. అప్పు తీసుకుని చెల్లించలేదంటూ ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ దారుణం భరించలేక బాధితురాలు పోలీసుస్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యయత్నం చేశారు. మదనపల్లె రూరల్‌ వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకుడు కల్యాణ్, అతని తండ్రి బయన్నలు దాడికి పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యయత్నం చేశారు.

జూన్‌ 15న.. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ పుట్టి చంద్రశేఖర్‌ను వైఎస్సార్​సీపీ నాయకుడు నవహర్ష తన అనుచరులతో కలిసి ఏలూరులో కిడ్నాప్‌ చేశారు. నగర శివారుకు తీసుకెళ్లి బెదిరించారు. తీవ్రంగా కొట్టారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో వైఎస్సార్​సీపీ ఎంపీటీసీ సభ్యుడు కొండూరి గోవిందు ఇంట్లో భారీగా గంజాయి దొరికింది. ఆయన్ను కేసు నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

2021 అక్టోబరు 19న.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్​సీపీ కార్యకర్తలు, మరికొందరు దాడికి పాల్పడ్డారు. ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేశారు. కార్యాలయ సిబ్బందిని కొట్టి విధ్వంసం సృష్టించారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.