ETV Bharat / state

Jagan Delhi Tour: పోలవరానికి నిధులివ్వండి.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం జగన్​

author img

By

Published : Jul 6, 2023, 8:30 AM IST

CM Jagan Delhi Tour Updates
CM Jagan Delhi Tour Updates

CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్​ దిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సీఎం జగన్​ చర్చించినట్లు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

CM Jagan Delhi Tour Updates: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55వేల 548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12వేల 911.15 కోట్ల మంజూరుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ ఇస్తేనే ప్రాజెక్టు తొలి దశ పూర్తయినట్లవుతుందని ప్రధానికి జగన్​ వివరించారు. ఈ నేపథ్యంలో తొలిదశకు రూ.17వేల 144 కోట్లు మంజూరు చేసేలా జల్‌శక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు దిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో సాయంత్రం కలుసుకున్నారు. సుమారు గంట ఇరవై నిమిషాల పాటు ఇరువురూ భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో 45 నిమిషాలు భేటీ అయిన జగన్​.. ప్రధానితో భేటీ అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సీఎం జగన్​ చర్చించినట్లు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యమంత్రి గతంలో దిల్లీ వచ్చిన సందర్భంగా చేసిన వినతులనే ఇందులోనూ పేర్కొన్నారు. దాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.1,310.15 కోట్లను వెంటనే విడుదల చేయాలని మోదీని ముఖ్యమంత్రి జగన్​ కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7వేల 230.14 కోట్ల బకాయిలను ఆ రాష్ట్రం నుంచి ఇప్పించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో లోపించిన హేతుబద్ధతతో రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్ర రేషన్‌ దక్కకుండా పోతోందని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రేషన్‌ అందజేతకు రాష్ట్ర ఖజానాపై ప్రతి సంవత్సరం రూ.5వేల 527 కోట్ల భారం పడుతున్నందున దీనిపై సత్వరమే జోక్యం చేసుకోవాలని కోరారు.

77 వేల టన్నుల బియ్యం ఇవ్వండి..: అలాగే కేంద్రం వద్ద ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం ఉంటున్నాయని, వాటిలో 77 వేల టన్నులు ఏపీకి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సబ్సిడీల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,702.90 కోట్లను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలు కూడా అమలు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగై రాష్ట్రం స్వయంసమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు. ఏపీలో పెరిగిన జిల్లాలకు తగినట్లు 17 మెడికల్​ కాలేజీల నిర్మాణాల్ని చేపట్టినందున తగినంత ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. వైఎస్​ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని మోదీకి సీఎం గుర్తు చేశారు. సీఎం వెంట వైసీపీ పార్లమెంటరీ, లోక్‌సభ పక్ష నేతలు విజయసాయిరెడ్డి, పి.వి.మిధున్‌రెడ్డి ఉన్నారు. దిల్లీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం సీఎం ఏపీకి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.