ETV Bharat / state

YSRCP Plenary: అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్

author img

By

Published : Jul 8, 2022, 1:03 PM IST

Updated : Jul 8, 2022, 3:06 PM IST

YSRCP Plenary: అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్‌ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు.

cm jagan at ysrcp plenary at chinakakani in guntur
అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్

అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్

YSRCP Plenary: 'అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం అని నిరూపించాం' ఇవి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.. ప్లీనరీలో మాట్లాడిన మాటలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని.. శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో.. సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.

2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. 2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు. నా గుండె బెదరలేదు.. నా సంకల్పం చెదరలేదు. నాన్న చనిపోయిన తర్వాత ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు. తోడుగా నిలబడ్డారు.. అడుగులు వేయడానికి బలాన్నిచ్చారు. అందుకే 2019లో చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో 175 స్థానాలకు గాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారు. అదే సమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నవారిని దేవుడు, ప్రజలు అదే సీట్లకు పరిమితం చేశారు. -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపించాం. మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసి ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలాసార్లు చూశాం. అలాంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి పాలన సాగిస్తున్నాం. తమ మేనిఫెస్టో దొరకకుండా మాయం చేసిన పార్టీ తెదేపా. యూట్యూబ్‌, వెబ్‌సైట్‌ల నుంచి వాళ్లు తీసేయించారు. మనం మాత్రం మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి మనిషిని కలుస్తున్నాం -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

నిబద్ధతతో కూడిన పరిపాలన: పరిపాలన సంస్కరణలు ఇలా ఉండాలని చేసి చూపించామన్న సీఎం.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధానం తీసుకువచ్చినట్లు వివరించారు. వైద్యం, ఆరోగ్యంపై శ్రద్ధ, అవినీతి, లంచం, వివక్షకు తావు లేని పరిపాలనను చూపించామన్నారు. నవరత్నాలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి జగన్.. తమ ప్రభుత్వం నిబద్ధతతో కూడిన పరిపాలన చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజల తోడు ఒక్కటే: ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కులాల కుంపట్లు.. మతాల మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. తనకు అండగా ఉన్నది ప్రజల తోడు ఒక్కటేనన్నారు.

ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా? మనం మాత్రం జనం గుండెల్లో ఉన్నాం. వారిది చేతగాని పాలన.. మనది చేతల పాలన. మన గెలుపు ఆపడం వారివల్ల కాదు.. అందుకే రాక్షస గళాలు కలుస్తున్నాయి. కులాల కుంపట్లు.. మతాల మంటలు రేపుతున్నారు. మనపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నాకు అండగా ఉన్నది ఒక్కటే.. అది ప్రజల తోడు. ప్లీనరీలో రేపు సాయంత్రం మరోసారి మాట్లాడతా. -వై.ఎస్.జగన్, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Jul 8, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.