మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఏటా నిర్వహించే జయంతి వేడుకల్లో కుటుంబసభ్యులంతా కలిసి పాల్గొనేవారు. గతేడాది వేర్వేరుగా నివాళులర్పించగా, శుక్రవారం మాత్రం వేర్వేరుగా వచ్చి.. కలిసి ప్రార్థనలు చేసి.. వేర్వేరుగా తిరుగుపయనమయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ, కుమార్తె, వైతెపా అధ్యక్షురాలు షర్మిల వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతితో కలిసి చేరుకున్నారు. అందరూ కలిసి పాస్టరు నరేష్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనా కూటములు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జగన్, షర్మిల ఎవరికి వారు వైఎస్‌ఆర్ సమాధితోపాటు అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘాట్ వద్ద జగన్, షర్మిల పలకరించుకోలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ తన తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో కడపకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి వెళ్లారు. షర్మిల ఉదయం 11.30 గంటలకు కడపకు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: