ETV Bharat / state

గుడ్డుకు గడ్డుకాలం.. రాష్ట్ర పౌల్ట్రీ రంగానికి ఉత్తరాది పోటు

author img

By

Published : Mar 2, 2023, 9:37 PM IST

Egg production: దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన మన రాష్ట్రం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరాదిన అక్కడి ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఉత్పత్తి.. ఆయా ప్రాంతాల్లో గణనీయంగా పెరుగుతోంది. తద్వారా మన రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఒక్కో గుడ్డుపైనా రైతులు రూపాయికి మించి నష్టపోతున్నట్లు అంచనా. నెలకు 135 కోట్ల రూపాయలకు వరకు పెంపకందారులకు నష్టం జరుగుతోంది. దాణా ఖర్చులు 65 శాతం పెరిగాయి. 2019-20 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమకు వడ్డీ రాయితీ ఇవ్వడం లేదు.

Egg production
Egg production

గుడ్డుకు గడ్డుకాలం.. ఒకప్పుడు దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానం

Challenge to Poultry Industry: రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ కొన్నాళ్ల క్రితం ఆశాజనకంగానే వర్దిల్లింది. ఏపీ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద మొత్తం గుడ్ల ఎగుమతి జరిగింది. రానురాను ఇక్కడి పరిస్థితిలో ఊహించని మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోన్న గుడ్లలో 60 శాతం పూర్తిగా ఎగుమతులపైనే పౌల్ట్రీ పరిశ్రమలు మనుగడ సాగిస్తున్నాయి. దాణా ధరల్లో అడపాదడపా అప్పడు కూడా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమకు తగిన రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో నష్టాల నుంచి గట్టెక్కి ముందడుగు వేశాయి. అనేకమంది ఔత్సాహికులు పౌల్ట్రీకి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఫారాలు విస్తరించారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ బాగా పుంజుకుంది. అక్కడి ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో అక్కడ స్థానికంగానే గుడ్ల ఉత్పత్తి పెరిగింది.

60 శాతం పెరిగిన దాణా ధర: రాష్ట్రం నుంచి ఎగుమతలు తగ్గి ధర పడిపోతోంది. కోళ్ల రైతులు ఏటికేడు నష్టాలను మూటగట్టుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వీరికి తగిన చేయూత అందించడంలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా ఏత్తేసింది. బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా ఏడాదికి ఇచ్చే 60 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కోళ్ల దాణా ధరలు గతంతో పోలిస్తే 60 శాతం వరకు పెరిగాయి. కోళ్ల మేత తయారీలో ఉపయోగించే మొక్కజొన్నను మద్యం ఉత్పత్తికి, నూకలను ఇంథనాల తయారీకి వాడుతుండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. సోయా రేట్లూ చుక్కలనంటాయి. గతంలో కేజీ దాణా 10 నుంచి ఇరవై రూపాయలుగా ఉంటే- ఇప్పుడు ఏకంగా 28 నుంచి 30 రూపాయలకు పైమాటే ఉంటోంది.

పక్క రాష్ట్రాల్లో యూనిట్​కు రాయితీల ఎంతంటే: రాష్ట్రంలో నిత్యం 4.50 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 40 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా.. 60 శాతం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, బీహార్‌లతో పాటు అసోం తదితర ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. దాణా ఖర్చులు పెరగడంతో గుడ్డుకు కనీసం ఐదు రూపాయలు ధర లభిస్తే తప్ప గిట్టుబాటు కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సగటున నాలుగు రూపాయల ఎనిమిది పైసల వరకు ధర దక్కింది. ప్రస్తుతం నాలుగు రూపాయలకు పడిపోయింది. కొన్నిచోట్ల మూడు రూపాయల 75 పైసలుగానే ధర ఉంటోంది. నెల క్రితం ఐదు రూపాయల 40 పైసల వరకు గుడ్డు ధర పలికింది. ఆ ధరతో పోల్చుకున్నా ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై రూపాయి 40 పైసల వరకు ధర తగ్గింది. నెలకు 135 కోట్ల రూపాయల మేర కోళ్ల రైతులు నష్టపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వాలు యూనిట్‌ వ్యయంలో 40 శాతం రాయితీ ఇస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపైనా వడ్డీ రాయితీలు అందిస్తున్నాయి. తక్కువ ధరకే విద్యుత్తు సరఫరా చేస్తున్నాయి. దాణాకు అవసరమయ్యే ఉత్పత్తులను రాయితీపై తక్కువ ధరకే ఇవ్వాలనేది పౌల్ట్రీ పరిశ్రమ డిమాండ్‌. కోళ్ల ఫారాలకు విద్యుత్తు సరఫరాపై రాయితీని పెంచాలని.. దాణా తయారీకి ఉపయోగించే మోటార్ల వినియోనికి కూడా రియతీ వర్తింపజేయాలని కోరుకుంటున్నారు.

తగ్గిన కోడి ధర: ప్రస్తుతం బ్రాయిలర్‌ కోడి ధర కూడా తగ్గింది. ఉత్పత్తి వ్యయం కిలోకు 90 రూపాయల వరకు అవుతుండగా.. సగటు విక్రయం ధర 70 రూపాయలే ఉందని రైతులు చెబుతున్నారు. కోళ్ల రంగానికి గత ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు ప్రకటించారు. తక్కువ ధరకే విద్యుత్తు సరఫరాతోపాటు బ్యాంకు రుణాలపై నాలుగు శాతం చొప్పున వడ్డీ రాయితీ ఇచ్చారు. 2017-18లో రూ.62.07 కోట్లు, 2018-19లో రూ.56.83 కోట్లు వడ్డీ రాయితీగా ప్రభుత్వం అందజేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించినా.. అవి ఇప్పటికీ విడుదల కాలేదు. ఆ తర్వాత ప్రోత్సాహకం ఊసే లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.