ETV Bharat / state

Bar Associations సీఐడీ నోటీసులపై నిరసనలు.. నేడు కోర్టు విధులకు పలు బార్‌ అసోసియేషన్ల గైర్హాజరు

author img

By

Published : Apr 17, 2023, 10:30 AM IST

Bar Associations Agitaions: మార్గదర్శి అడిటర్ అరెస్టుపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన న్యాయవాదులకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని న్యాయవాదసమాజం ముక్తకంఠంతో తప్పుపడుతోంది. సీఐడీ తీరును ఖండిస్తూ పలు బార్‌ అసోసియేషన్లు ఈ రోజు కోర్టు విధులకు దూరంగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. వివరాల్లోకి వెళ్తే..

Bar Associations protest on CID notices
సీఐడీ నోటీసులపై న్యాయవాదుల నిరసనలు

Bar Associations Agitaions: మార్గదర్శి చిట్​ఫండ్ కేసులో ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కే. శ్రావణ్‌కుమార్‌ అరెస్టుపై విజయవాడలో ఏపీ ప్రొఫషనల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులకు.. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని న్యాయసమాజం తప్పుపడుతోంది. సీఐడీ తీరును ఖండిస్తూ సోమవారం కోర్టు విధులకు దూరంగా ఉండాలని పలు బార్‌ అసోసియేషన్లు ఏకగ్రీవంగా తీర్మానించాయి. విజయవాడ, మచిలీపట్నంలో.. నిరసన దీక్షలకు చర్యలు చేపట్టారు.

కోర్టు విధులకు గైర్హాజరు కావాలని గుడివాడ, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, అవనిగడ్డ, విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, మొవ్వ, బంటుమిల్లి, కైకలూరు, మైలవరం, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు, కొవ్వూరు బార్‌ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఆయా సంఘాల కార్యనిర్వహణ కమిటీలు ఈ మేరకు తీర్మానించాయి. శ్రావణ్‌ అరెస్టుపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, జడా శ్రావణ్‌కుమార్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌కు ఏపీ సీఐడీ.. సీఆర్​పీసీ సెక్షన్‌ 160, 91కింద నోటీసులు ఇచ్చింది.

న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు బెదిరేది లేదని న్యాయవాద సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ప్రముఖ న్యాయవాదులకే ఇలాంటి నోటీసులిస్తే మరి సామాన్యుల పరిస్థితేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీరణ హక్కును హరించడమేనని.. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఏపీ విభాగం పేర్కొంది.

ఏపీ సీఐడీ న్యాయవాదులకు నోటీసులివ్వడాన్ని.. తెలంగాణ రాష్ట్ర ఐలు ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ ఖండించారు. న్యాయవాదుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విశ్రాంత రైల్వే ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున విశ్రాంత సీటీఐ, సీహెచ్​ఎల్ నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా మార్గదర్శి ఆడిటర్ కే. శ్రావణ్​కుమార్​ అరెస్టుపై అభిప్రాయాలను వ్యక్తం చేసిన న్యాయవాదులకు ఏపీ సీఐడీ నోటీసులివ్వటం వారి పరిధి దాటినట్లేనని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు సీఐడీ పోలీసులు 65 ఏళ్లు పైబడిన వారికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకూడదనే నిబంధనను కూడా ఉల్లంఘించారని పలు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అభిప్రాయం వ్యక్తం చేస్తే.. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకునిరావాలని సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వటం సరికాదని వారు అంటున్నారు. సీఐడీ అధికారులు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బార్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు నిరసనలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.