ETV Bharat / state

పాత బస్సులు, మూడుసార్లు ఛార్జీల మోత - ఆర్టీసీ ప్రయాణికుల జేబుకు చిల్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 1:35 PM IST

APSRTC_Higher_Charges_Effect_on_Common_People
APSRTC_Higher_Charges_Effect_on_Common_People

APSRTC Higher Charges Effect on Common People: ప్రజల ప్రభుత్వం అంటారు! జీతాలు పెంచండని రోడ్డెక్కనా పట్టించుకోరు! పేదల సర్కార్‌ అంటారు! ఆర్టీసీ బస్సు ఛార్జీలతో నడ్డి విరిచేస్తారు. అదేంటి అంటే డీజిల్‌ ధరలు పెరిగిపోయాయ్‌ కదా అని కాకి లెక్కలు చెబుతారు. పోనీ బస్సులకు మరమ్మతులు అయినా చేస్తారా అంటే అదీ లేదు. దీంతో ప్రజల ప్రాణాలకు భద్రత కూడా కరవైంది. వైసీపీ పాలనలో మూడు సార్లు చార్జీలు పెంచి దాదాపు 2 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. డొక్కు బస్సులు మార్చకుండానే, కొత్తవి కొనకుండానే ప్రజలపై మోత మోగించారు.

పాత బస్సులు, మూడుసార్లు ఛార్జీల మోత - ఆర్టీసీ ప్రయాణికుల జేబుకు చిల్లు

APSRTC Higher Charges Effect on Common People: పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూశారని గత ప్రభుత్వంపై నిందలు మోపేలా సీఎం జగన్ గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. పేదలపై తనకెంతో ప్రేమ ఉన్నట్లు, వారికి ఎంతో మేలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అదే పేదలు, సామాన్యులు అత్యధికంగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను మాత్రం మూడుసార్లు పెంచేశారు. ప్రజల నుంచి ఏటా 2వేల కోట్లను పిండుకుంటున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత భారీగా ఛార్జీలు పెంచలేదు. గ్రామీణులు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు బస్సులు మొదలుకొని, దూర ప్రాంత సర్వీసులతో సహా అన్నింటా రాజీలేకుండా ఎడాపెడా బాదేశారు.

విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి కిలోమీటర్‌కు సగటు బేసిక్ ఛార్జీ 76 పైసలు ఉండగా.., 2018-19లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 83 పైసలకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కలిపి బేసిక్ ఛార్జీ 7 పైసలు మాత్రమే పెరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి కిలోమీటర్‌కు సగటున 83 పైసలు ఉన్న బేసిక్ ఛార్జీ ఇప్పటివరకు 124 పైసలుకు చేరింది. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక సగటు బేసిక్ ఛార్జీ కిలో మీటర్‌కు 41 పైసలు పెరిగింది.

బ్యారేజీ కాదు ఆర్టీసీ గ్యారేజీ! - వర్షం నీళ్లలో ఏళ్ల తరబడి మెకానిక్​ల అవస్థలు

జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన 6 నెలలకే అంటే 2019 డిసెంబరులోనే డీజిల్ ధరలు, బస్సుల విడిభాగాలు, టైర్ల ధరలు పెరిగాయని, వీటికి తోడు ఉద్యోగుల జీతాలు భారంగా మారాయని చెబుతూ ఛార్జీలు పెంచారు. అప్పుడు ప్రయాణికులపై ఏటా 700 కోట్ల రూపాయల మేర భారం వేశారు. 2022 ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరిట రెండోసారి ఛార్జీలు పెంచారు. దీని ద్వారా ప్రయాణికులపై ఏడాదికి 720 కోట్ల మేర బాదేశారు. అప్పటివరకు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ 5 రూపాయలు ఉండగా, దాన్ని10కి పెంచేశారు. రెండోసారి ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, రెండు నెలల వ్యవధిలోనే 2022 జులై నుంచి మరోసారి డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచారు. ఈ దఫా ఏటా 500 నుంచి 600 కోట్లు వడ్డించారు. ఇలా మూడు దఫాలు కలిపి ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేరకు ప్రయాణికుల నుంచి పిండేస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా 2020 జనవరి ఒకటిన విలీనం చేశారు. వారికి జీతాల రూపంలో నెలకు 200 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి సంస్థ రాబడిలో 25 శాతం తీసుకుంటోంది. అంటే ఆర్టీసీ రాబడి నెలకు సగటున 500 కోట్లు ఉంటే అందులో 125 కోట్ల వరకు ప్రభుత్వం తీసుకుంటోంది. డీజిల్ భారం పేరిట మూడుసార్లు ఛార్జీల రూపంలో ప్రయాణికులపై వేసిన భారం 2 వేల కోట్ల రూపాయలు, అంటే పెంచిన ఛార్జీల ద్వారా ఆర్టీసీకి ప్రతినెలా 166 కోట్లు వస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతినెలా 125 కోట్లు తీసుకోవడం మానేస్తే, ఛార్జీలు తగ్గించి ప్రయాణికులకు ఉపశమనం కల్పించొచ్చు. కానీ పేదల పక్షపాతినని చెప్పే జగన్ సర్కారు మాత్రం అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు.

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి ఛార్జీలు పెంచినప్పుడు డీజిల్ ధరలు భారీగా పెరిగాయని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంధన సెస్ వేస్తున్నామని ఛైర్మన్, సీఎం చిన్నాన్న మల్లికార్జునరెడ్డి, ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2019లో లీటరుకు 67 రూపాయల డీజిల్ ధర 2022 ఏప్రిల్‌కు 107కి చేరిందని, ఆ భారం తగ్గించుకునేందుకే పెంపు అని సమర్థించుకున్నారు. కానీ అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయిల్ కంపెనీల నుంచి బల్క్ కాకుండా, రిటైల్ అవుట్లెట్లలో తక్కువ ధరకు డీజిల్ కొనుగోళ్లను ప్రారంభించారు.

అప్పటి నుంచి నుంచి 2023 ఫిబ్రవరి చివరి వరకు బంకుల్లోనే డీజిల్ తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రమంతా సగటున లీటరు 99 నుంచి 100 రూపాయలుగా ఉంది. తర్వాత ఆయిల్ కంపెనీల బల్క్ ధర ఇంకా తగ్గడంతో 2023 మార్చి నుంచి మళ్లీ బల్క్ డీజిల్ కొంటున్నారు. అయితే లీటరుకు 107 రూపాయల డీజిల్ ధర పేరిట పెంచిన ఛార్జీలను ప్రస్తుతం డీజిల్ ధర 99 కంటే తక్కువ ఉన్నప్పటికీ ఛార్జీల్లో పైసా కూడా తగ్గించకుండా బాదేస్తున్నారు.

APSRTC Bus Charges Hike: ఏపీఆర్టీసీలో రాయితీల కోత.. ప్రయాణికులపై ఛార్జీల మోత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.