ETV Bharat / state

'స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా' 2021-22 రిపోర్ట్​.. ఏపీనే టాప్​

author img

By

Published : Dec 5, 2022, 3:08 PM IST

Updated : Dec 6, 2022, 6:40 AM IST

Smuggling India 2021 2022 report
Smuggling India 2021 2022 report

15:03 December 05

'స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా' 2021-22 నివేదిక విడుదల చేసిన కేంద్రం

SMUGGLING IN INDIA 2021 2022 REPORT : ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌ సోమవారం విడుదల చేసిన ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం సీఆర్‌పీఎఫ్‌ 2021-22లో ఆంధ్రప్రదేశ్‌లో 18,267.84 కేజీల డ్రగ్స్‌/నార్కోటిక్స్‌ను స్వాధీనం చేసుకొని 90 మందిని అరెస్ట్‌ చేసింది. దేశంలో ఇంత ఎక్కువగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నది ఇక్కడే.

ఏపీ తర్వాతి స్థానాల్లో త్రిపుర (10,104 కిలోలు), అస్సాం (3,633), తెలంగాణ (1,012), ఛత్తీస్‌గఢ్‌ (830) ఉన్నాయి. ఏపీలో సీఆర్‌పీఎఫ్‌ 4 అక్రమ తుపాకులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయగా, తెలంగాణలో 4 తుపాకులను పట్టుకొని, ఒకరిని అరెస్ట్‌ చేసింది. ఏపీలో 2021-22లో 1,057 కిలోల గంజాయిని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకొంది. మధ్యప్రదేశ్‌ (5,846), త్రిపుర (4,264), ఉత్తర్‌ప్రదేశ్‌ (3,141), అస్సాం (2,800), మహారాష్ట్ర (2,639), మేఘాలయ (1,356), బిహార్‌ (1,297)ల తర్వాత ఎక్కువగా పట్టుబడింది ఆంధ్రప్రదేశ్‌లోనే. 2021-22లో దేశం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.97 కోట్ల విలువైన 161.83 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ నివేదిక పేర్కొంది.

‘ఎర్రచందనం ఎక్కువగా కడప, చిత్తూరు జిల్లాలోని పాలకొండ, శేషాచలం పర్వత శ్రేణుల్లో పెరుగుతోంది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లోనూ అక్కడక్కడ ఇది కనిపిస్తుంది. దేశీయంగా దీని వినియోగం చాలా తక్కువ. ఆయుర్వేద మందులు, చిన్నచిన్న బొమ్మల తయారీకి మాత్రమే దీన్ని వినియోగిస్తారు. నిర్మాణ, ఫర్నిచర్‌ తయారీకి దేశీయంగా దీని డిమాండ్‌ చాలా తక్కువ. దీంతో ఇది చైనా, జపాన్‌లకు అక్రమంగా తరలిపోతున్నట్లు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సరకును బట్టి తెలుస్తోంది.

ఈ మొక్కలు పండే చోటతో పోలిస్తే తరలించే చోట ఉన్న ధరల వ్యత్యాసం స్మగ్లర్లకు అత్యంత అనువుగా మారింది. అందుకే పెద్దమొత్తంలో భారత్‌ నుంచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ముంబయిలోని నావసేన, గుజరాత్‌లోని ముంద్రా, తమిళనాడులోని చెన్నై పోర్టుల నుంచి ఎక్కువగా తరలిపోతోంది. కొన్నిసార్లు సెజ్‌ల నుంచీ వెళ్తోంది. ఎర్రచందనంతో నింపిన కంటెయినర్లను తొలుత దుబాయ్‌, మలేసియా, దక్షిణ కొరియాలకు తరలించి అక్కడి నుంచి అంతిమ గమ్యస్థానాలకు పంపుతున్నారు.

తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల చిన్న పరిమాణంలో విమానాల ద్వారానూ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు బయటపడింది. ఇనుము, బ్రాస్‌ హార్డ్‌వేర్‌, ప్రెషర్‌ కుక్కర్లు, గృహవినియోగ వస్తువులు, రెడీమేడ్‌ దుస్తులు, గ్రానైట్‌ స్లాబులు, ట్రాక్టర్‌ విడి భాగాలు, ఐరన్‌ పైప్‌ల పేరుతో వీటిని ఎక్కువగా తరలిస్తున్నారు’ అని డీఆర్‌ఐ ఈ నివేదికలో పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.