ETV Bharat / state

Kolleru pollution కాలుష్య కాసారమై.. జీవవైవిధ్యానికి పెనుముప్పుగా మారి.. కొల్లేరు విధ్వంసంలో కనిపించని దారుణాలెన్నో!

author img

By

Published : Jul 2, 2023, 6:22 PM IST

Kolleru pollution: ఆసియాలో అతిపెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు..! ఇది చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠం. అలాంటి సరస్సులోని నీళ్లు. ఇప్పుడు తాకడానికీ సాహసించలేని పరిస్థితి. ఒకప్పుడు విదేశీ పక్షులకు ఆలవాలమైన కొల్లేరు.. ఇప్పుడు తవ్వకాల మోతతో తల్లడిల్లుతోంది. కొల్లేరులో కబ్జాకోరుల విచ్చలవిడి విధ్వంసకాండ ఫలితంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికీ పెనుముప్పు వచ్చింది.

Kolleru pollution
Kolleru pollution

Kolleru pollution: కొల్లేరు సరస్సులోని నీళ్లు తాకడానికిీ సాహసించలేని పరిస్థితి. ఒకప్పుడు విదేశీ పక్షులకు ఆలవాలమైన కొల్లేరు.. ఇప్పుడు తవ్వకాల మోతతో తల్లడిల్లుతోంది. కబ్జాకోరుల విచ్చలవిడి విధ్వంసకాండ ఫలితంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికీ పెనుముప్పు పొంచి ఉంది.

42శాతం ఆక్రమణ... కొల్లేరు సరస్సు పేరు తగ్గట్లే ఒకప్పుడు లక్షా 35 వేల ఎకరాల మేర విస్తరించి ఉండేది. దీని పరిధి 245 చదరపు కిలోమీటర్లు అంటే.. ఎంత పెద్ద సరస్సో అర్థం చేసుకోవచ్చు. 2001 ఫిబ్రవరి 9న తీసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం కొల్లేరులో 42 శాతం మేర అక్రమ చేపల చెరువులు తవ్వేశారని వెలుగు చూసింది. అంటే దాదాపు 103 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నది చేపల చెరువులు తప్ప సరస్సు కాదన్నది చేదునిజం. 2006లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరులో అక్రమ చేపల చెరువుల్ని అప్పటి వైఎస్‌ సర్కార్‌ బాంబులతో ధ్వంసం చేసింది. అప్పటికే కొల్లేరు 86 వేల ఎకరాలకు కుంచించుకుపోయింది. కనీసం ఐదో కాంటూరు వరకైనా సురక్షితంగా ఉంటుందనుకుంటే ఆక్రమణలు ఆగనేలేదు. నాడు తండ్రి ధ్వంసం చేయిస్తే నేడు కుమారుడి ఏలుబడిలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోతున్నాయి.

రాజకీయ అండదండలు.. కొల్లేరు పరిధిలో మత్స్య ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువ. ఇక్కడి చిత్తడి నేలలు, జీవావరణం తదితర పరిస్థితుల కారణంగా మత్స్య ఉత్పత్తులు వేగంగా పెరుగుతాయి. రుచి కూడా ఎక్కువని ప్రతీతి. కొల్లేరులో చేపల చెరువు సాగు చేస్తే కోట్లలో ఆర్జించవచ్చన్నది ఆలోచన. అందుకే అక్రమార్కుల కళ్లు అభయారణ్యంపై పడ్డాయి. రాజకీయ అండదండలతో వేల ఎకరాలు గుప్పిట పడుతున్నారు. అక్రమార్కుల వ్యాపార దాహం కొల్లేరును కకావికలం చేస్తోంది. మంచి నీటి సరస్సుగా చెప్పుకునే కొల్లేరులోని నీటిని ఇప్పుడు తాకేందుకూ సాహసించలేని పరిస్థితి. రసాయనాలతో కూడిన చేపల ఫీడ్, చెరువులను శుభ్రవరిచేందుకు వాడే మందులతో కొల్లేరు పరిసరాలు, భూగర్భ జలాలు కాలుష్యభరితమయ్యాయి.

అక్రమార్కులకు ఆదాయ వనరు.. కొల్లేరు విధ్వంసం జీవావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. గ్రేట్ పెలికాన్ లాంటి 180 రకాల విశిష్ట జాతులకు చెందిన విదేశీ పక్షులు కొల్లేరులో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. 61 రకాల మత్స్యజాతులు, 17 రకాలైన రొయ్య జాతులు, నీటి సంబంధమైన 17 రకాల వృక్ష జాతులకు కొల్లేరు అభయారణ్యం నెలవు. సరస్సు గర్భంలో చేపల చెరువుల వల్ల ఇలాంటి అరుదైన జీవజాలాలూ అంతరించే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. రామ్ సర్ సదస్సులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిరక్షణ బాధ్యత అటవీశాఖదే. కానీ ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి ఇవేమీ పట్టవు. కొల్లేరు అభివృద్ధికి వెట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నివేదికలు రూపొందిస్తున్నాయని గతంలో అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ప్రణాళికలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. పర్యావరణపరంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాల్సిన కొల్లేరు సరస్సు... అక్రమార్కులకు కాసులు కురిపించే ఆదాయవనరుగా మారిపోయింది.

కాలుష్య కాసారమైన మంచినీటి సరస్సు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.