ETV Bharat / state

వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలకు మరోషాక్ ఇవ్వనున్న జగన్ - త్వరలోనే మరో లిస్ట్ విడుదల!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 10:38 AM IST

YSRCP Incharges Changes in Assembly Constituencies: వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలపై వరుసగా రెండో బాంబును సీఎం జగన్‌ పేల్చారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటికే పలువురి టికెట్లు చించేసిన జగన్‌, మరిన్ని చింపేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేకీ స్థానచలనం చేయనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలను పిలిచి సీఎం జగన్ ఈ విషయం చెప్పారు. విజయవాడలోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. త్వరలోనే కొత్త సమన్వయకర్తల పేర్ల ప్రకటన చేసే సూచనలున్నాయి.

ycp_incharges_changes_in_assembly_constituencies
ycp_incharges_changes_in_assembly_constituencies

YCP Incharges Changes in Assembly Constituencies: వైసీపీ ఎమ్మెల్యేలకు మరోషాక్ ఇవ్వనున్న జగన్ - త్వరలోనే మరో లిస్ట్ విడుదల!

YSRCP Incharges Changes in Assembly Constituencies: అధికార వైఎస్సార్​సీపీలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల మార్పు జోరందుకుంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సీట్లు మార్చిన సీఎం జగన్‌, సోమవారం తాజాగా మరో మంత్రినీ సిట్టింగ్‌ సీటు నుంచి మార్చేశారు. ఇప్పుడు ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలకూ స్థానచలనం తప్పలేదు.

ఇప్పటికే 11 నియోజవర్గాల్లో కొత్త సమస్వయకర్తలను నియమించిన సీఎం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల స్థానాలకు ఎసరు పెట్టారు. వీరిలో కొందరికి స్థానచలనం తప్పదని, మరికొందరికి అసలు టికెట్‌ ఉండదని తేల్చి చెప్పేశారు. పార్టీ తిరిగి అధికారంలోకొస్తే మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి పంపినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి మాట్లాడారు.

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు, ఎలీజా, కొండేటి చిట్టిబాబు, టి.బాలరాజు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరదందరితో గతవారం నుంచి సంప్రదింపులు జరుపుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్సార్​సీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్‌ రెడ్డి, సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారితో చర్చలు జరిపారు. తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు.

నేనున్నానంటూ నేతలను నమ్మించిన జగన్‌-సొంత మనుషుల్లా నమ్మిన వారి సీట్లకే ఎసరు పెట్టిన వైసీపీ అధిష్టానం

త్వరలోనే స్పష్టత: 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్సార్​సీపీకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే స్థానం లేకుండా చేశారు. తన భవిష్యత్తు ఏంటని సీఎంను కలిసి మాట్లాడినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీ అధినాయకత్వానికి చెప్పేశారంటున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన విషయంలో సీఎం ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపై నేడో రేపో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొత్త సమన్వయకర్తల ప్రకటనతో స్పష్టత వస్తుందంటున్నారు.

ఈ నెల 11వ తేదీన 11 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చినపుడు ఐదుగురు దళితులు, ముగ్గురు బీసీలను మార్చారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలకు సిట్టింగ్‌ స్థానాలను ఖాళీ చేయించారని తెలిసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి తప్పించి రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ లేదా లోక్‌సభ అభ్యర్థిగా వెళ్లమని చెప్పినట్లు సమాచారం. రామచంద్రపురంలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను దాదాపు ఖాయం చేశారంటున్నారు.

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్‌ లేనట్లే: రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారంటున్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని, ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్‌ లేనట్లేనని స్పష్టం చేశారంటున్నారు. ఒక ఎస్సీ ఎంపీని పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖరారు చేసినట్లు తెలిసింది.

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్‌ భాగ్మలక్ష్మితో సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. వెలంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు మార్చే అవకాశం ఉందంటున్నారు. పశ్చిమలో ఒక విద్యా సంస్థ యజమాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో వెలంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైఎస్సార్​సీపీ నూతన ఇన్​చార్జ్​లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.