ETV Bharat / state

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 8:18 PM IST

Updated : Dec 12, 2023, 2:39 PM IST

YCP_Incharges_Change_in_11_constituencies
YCP_Incharges_Change_in_11_constituencies

20:13 December 11

11 నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం-మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

YCP Changed Incharges in 11 Constituencies : ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గ ఇంఛార్జులను మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న విడుదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌కు మళ్లీ విజయావకాశాలు లేవని ఐ-ప్యాక్‌ సర్వేల్లో తేలడంతో వారి స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించారు. పార్టీ నియమించిన ఇంఛార్జుల్లో కొత్త వారికి నలుగురికే చోటు కల్పించడంతో కచ్చితంగా తమకే సీటు అని భావించిన కొంతమందికి షాక్‌ ఇచ్చినట్లయింది. 11 మార్పుల్లో కేవలం ఉమ్మడి గుంటూరు నుంచే 8 ఉండటంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో ఇంఛార్జుల మార్పు పట్ల అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.

Incharge Changes In YSRCP : సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్పు చేయడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఇద్దరు మంత్రులతో సహా ఎనిమిది మందిని మార్చారు. చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారని తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీ అసంతృప్తి భగ్గుమంది.

YSRCP MLA Alla Ramakrishna Reddy Resigned : ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకీ రాజీనామా చేశారు. గాజువాక టికెట్‌ ఆశించి పనిచేసుకుంటున్న సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అయితే ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అసహనానికి లోనై తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఈ 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబీయింగ్‌ గట్టిగా పనిచేసిందని ప్రచారం సాగుతోంది. ఒక కాంట్రాక్టరు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటానంటే ఆయనకో నియోజకవర్గాన్ని అప్పగించారని ఇద్దరు మాజీ మంత్రులకు సొమ్ము ముట్టజెప్పిన ఒకరికి మరో నియోజకవర్గం అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ఒక మంత్రి లాబీయింగ్‌తో మరో నాయకుడికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది ? మరి జలగన్న కామన్​ మ్యాన్​కు నచ్చుతాడా ?!

తెలంగాణ ఎన్నికలతో అప్రమత్తమైనా జగన్ : మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఉమ్మడి గుంటూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందన్న భావన ఆ పార్టీ నేతలని వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో పొరుగు జిల్లాలకు చెందిన నేతలను తీసుకొచ్చి ఇంఛార్జులుగా నియమించారు. సిట్టింగులపై వ్యతిరేకతే తెలంగాణలో భారాసను అధికారం నుంచి దూరం చేసిందని భావించిన జగన్‌, ఇంఛార్జులుగా నాలుగు కొత్త ముఖాలను పంపి కొంత నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారనే చర్చ జరుగుతోంది. అయితే కొత్తవారితో పార్టీకి మైలేజీ రాకపోగా నియోజకవర్గాల్లో కొత్త గ్రూపులు పెరిగే అవకాశముందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పరిస్థితుల పట్ల అవగాహన లేని ఐ ప్యాక్‌ చేసే సర్వేలు, చెప్పే థియరీలతో ఇష్టారీతిన మార్చేస్తున్నారని కొత్త వారికి తాము మద్దతు ఇవ్వకపోతే నెల రోజుల్లో మళ్లీ రివర్స్‌ కావాల్సిందనని పాత సమన్వయకర్తలు వాపోతున్నారు.

ఆయనకు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం : మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ MLA కాండ్రు కమల టికెట్‌ ఆశించారు. వారిని పట్టించుకోకుండా చిరంజీవిని నియమించడంపై కాండ్రు కమల వర్గీయులు గుర్రుమంటున్నారు. ఆర్కేను సముదాయించే బాధ్యత ఆయన సోదరుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి అప్పజెప్పారు. ఆయన రంగంలోకి దిగి సముదాయించే ప్రయత్నం చేయగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వినలేదు. పైగా ఆయన ముందే టైర్లు తగలబెట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గంజి చిరంజీవికి టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. చేసేదిలేక అయోధ్యరామిరెడ్డి వెనుదిరిగారు.

వైసీపీలో మెుదలైన ముస‌లం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి సానుకూలంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజనిని ఇంఛార్జిగా నియమించారు. ప్రస్తుత MLA గిరిధర్‌తో పాటు MLC చంద్రగిరి ఏసురత్నం, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు ఈ టికెట్‌ని ఆశిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీను అంటిపెట్టుకొని తిరుగుతున్న గిరిధర్‌కు మొండిచేయి చూపడంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.

ముఖ్యనేతలు అసంతృప్తి : మంత్రి విడదల రజని నియోజకవర్గం చిలకలూరిపేటకు మల్లెల రాజేష్‌ నాయుడుని ఇంఛార్జిగా నియమించారు. ఆయన పార్టీలో ఉన్న అంతగా గుర్తింపు లేదని, MLA స్థాయి కాదని, నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నేతలు అంటున్నారు. అయితే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆయన్ని నియమించినట్లు చెబుతున్నారు. రాజేష్‌ నియామకంపై నియోజకవర్గంలోని ముఖ్యనేతలకు సమాచారం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తన మరిదికి ఇవ్వాలని మంత్రి కోరినా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రజలకు తెలియని వారిని ఇంఛార్జిగా నియామకం : ప్రస్తుతం ప్రత్తిపాడు MLAగా ఉన్న మాజీమంత్రి సుచరితను ఆమె కోరిక మేరకు తాడికొండ ఇంఛార్జిగా నియమించారు. దీంతో తాడికొండలో టికెట్‌ ఆశిస్తున్న కత్తెర సురేష్‌కుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆందోళన చెందుతున్నారు. గడచిన ఏడెనిమిది మాసాలుగా కత్తెర సురేష్‌కుమార్ సమన్వయకర్తగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పడు ఉన్నఫళంగా తనను కాదని సుచరితను ఇంఛార్జిగా నియమించడంపై సురేష్‌కుమార్‌ అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. సుచరితను తాడికొండకు పంపించి, ప్రత్తిపాడు ఇంఛార్జిగా విజయవాడకు చెందిన ఆర్కటెక్చర్‌ ఇంజినీరు బాలసాని కిరణ్‌కుమార్‌ను నియమించారు. ఆయనెవరో తెలియదని నియోజకవర్గ నాయకులంటున్నారు.

వారసత్వానికి స్వస్థ చెప్పినట్లేనా : వేమూరు నియోజకవర్గంలో మంత్రి మేరుగ నాగార్జునకు తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయన్ని ప్రకాశం జిల్లా పరిధిలోని సంతనూతలపాడు ఇంఛార్జిగా నియమించారు. వేమూరు ఇంఛార్జిగా ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన వరికూటి అశోక్‌బాబును నియమించారు. రేపల్లె నియోజకవర్గ బాధ్యునిగా మాజీ మంత్రి ఈపూరు సీతారావమ్మ కుమారుడు, వైద్యుడు ఈపూరు గణేష్‌ను నియమించారు. గత నెల 15 వ తేదీన సీఎం జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిన గణేష్‌కు బాధ్యతలు అప్పగించడంపై మోపిదేవి వెంకటరమణ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ మోపిదేవి వర్గీయులు తాడేపల్లిలో కీలక నేతలతో సమావేశమయ్యారు. మోపిదేవి తనకు లేదా తన కుమారుడికి టికెట్‌ ఆశించారు.

ఇప్పుడు కొత్తవారిని నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జిగా బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పి. హనిమి రెడ్డిని నియమించారు. గత నాలుగున్నరేళ్లుగా సమన్వయకర్తగా ఉన్న కృష్ణ చైతన్యను అధిష్ఠానం పక్కన పెట్టింది. ఎన్నికల్లో పోటికి సిద్ధమవుతున్న నియోజకవర్గ ఇంఛార్జిగా హనిమిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. హనిమిరెడ్డి, YV సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి అని అందుకే నియమించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వివాదాలతో గందరగోళ పరిస్థితులు : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. బాలినేనికి జిల్లాలోని మిగతా MLAలతో పొసగకపోవడం, మంత్రి పదవి పోయిన తర్వాత మంత్రి ఆదిమూలపు సురేష్‌తో విభేదాలు తారస్థాయికి చేరుకోవడం వంటి పరిణామాల పార్టీని కొంత నష్టపరుస్తున్నాయి. ఇప్పుడు నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. SC రిజర్వు నియోజకవర్గం అయిన కొండెపి ఇంఛార్జిగా ముగ్గురిని మార్చారు. డా. వెంకయ్యని నియమించగా ఆయనకు బాలినేని వర్గంతో సయోధ్య కుదరక వరికూడి అశోక్‌ బాబుకు కట్టబెట్టారు. అశోక్‌బాబు ఇంఛార్జిగా ఉన్నన్నాళ్లూ గొడవలు, వివాదాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మంత్రి ఆదిమూలపు సురేష్ విఫలం : వైసీపీలోని సీనియర్లు, పలు పదవుల్లో ఉన్నవారిపైనా అశోక్‌బాబు వర్గం దాడులు, ప్రతికార చర్యలకు తెగబడింది. అయన వర్గంతో తలనొప్పులు రావడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థి అవసరమని వెతుకులాటలో పడ్డారు. తెలుగుదేశం కంచుకోటైన కొండెపి బాధ్యునిగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు గత కొద్ది కాలంగా చర్చలోకి వచ్చింది. యర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్‌ నియోజకవర్గ అభివృద్ధికి గానీ, కేడర్‌ని కలుపునే విషయంలో కానీ విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పైగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి కూడా నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో కొండెపిలో సరైన అభ్యర్థి కనిపించకపోవడంతో సురేష్‌ ను ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలుస్తోంది.

మళ్లీ వారికే టికెట్‌ ఇస్తే ఫలితాలు తారుమారవుతాయా? : సంతనూతలపాడు నియోజకవర్గం ఇంఛార్జిగా మంత్రి మేరుగ నాగార్జునను నియమించారు. ఎమ్మెల్యే సుధాకర బాబు పనితీరు బాగోకపోవడం, వైసీపీలో బలమైన రెండు సామాజిక వర్గాలు కూడా అసంతృప్తితో ఉండంటంతో అధిష్ఠానం ఆయన్ని పక్కకి పెట్టినట్లు సమాచారం. సుధాకర్‌ బాబుకి మళ్లీ టికెట్‌ ఇస్తే ఫలితాలు తారుమారవుతాయని భావించి మేరుగను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నియోజకర్గానికి ఇంఛార్జిని ప్రకటించనప్పటికీ అనధికారికంగా గుంటూరు ZP ఛైర్‌పర్సన్‌ మేరీ క్రిష్టినా, ఆమె భర్త కత్తి సురేష్‌లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల మార్పు అనేది బలపడటానికా..? ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్ధులు బలహీన పడటం వల్ల అనేది చర్చనీయాంశంగా మారింది.

రాజీనామా చేసి అజ్ఞాతంలోకి : గాజువాక సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆయన కుమారుడు దేవన్‌ రెడ్డికి టికెట్‌ అడుగుతున్నారు. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ బంధువైన 70వ వార్డు కార్పొరేటర్‌ వరికూటి రామచంద్రరావుకు అవకాశం ఇచ్చేశారు. మంత్రి లాబీయింగ్‌తో ఇది జరిగిందనే విమర్శలున్నాయి. దేవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆయన రాజీనామా లేఖ బయటకు రాకపోవడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది.

సర్దిచెప్పే ప్రయత్నం : ఇంఛార్జిల మార్పుల వేళ కొందరితో ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అద్దంకిలో కృష్ణ చైతన్యను పిలిచి 'హనిమిరెడ్డిని గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తా. నా తమ్ముడిలా చూసుకుంటా' అని, కొండపి నుంచి వేమూరుకు మార్చిన వరికూటి అశోక్‌బాబుతో 'వేమూరుకు వెళ్లు, నీకేం పర్లేదు, అక్కడంతా బాగుంటుంది' అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.

మరో రెండు రోజుల్లో ప్రకటన : ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజవర్గాలతో పాటు గుంటూరు తూర్పు, పొన్నూరు స్థానాలకు కూడా సమన్వయకర్తలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఈసారి అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అంబటి రాంబాబుకు ఈసారి సత్తెనపల్లిలో టికెట్‌ లేనట్లేనా అనే చర్చ నడుస్తోంది.

Last Updated :Dec 12, 2023, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.