ETV Bharat / state

రేపు తెలంగాణకు.. అక్కడి నుంచి ఆంధ్రకు.. మోదీ ఫుల్ షెడ్యూల్ ఇలా..

author img

By

Published : Jul 1, 2022, 6:54 AM IST

Updated : Jul 1, 2022, 3:29 PM IST

Modi Hyderabad Tour Schedule: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న మోదీ... సాయంత్రం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. రెండ్రోజులపాటు నోవాటెల్‌ హోటల్‌లో బస చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది విధులు నిర్వహించనున్నారు.

modi
modi

Modi Hyderabad Tour Schedule: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని బయలుదేరతారు. 2 గంటల 55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలికాప్టర్‌లో హెచ్​ఐసీసీ నోవాటెల్ కి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్‌ హోటల్‌లోనే బస చేసే అవకాశం ఉంది.

జూలై 3వ తేదీన ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి వాటి అమలుకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారు. సాయత్రం 5 గంటలకు సమావేశం ముగియనుండగా.. ఆరు గంటలకు ప్రధాని సహా అగ్రనేతలంతా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి నోవాటెల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం బయల్దేరి.. భీమవరం వస్తారు.

భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు : ప్రధాని నరేంద్ర మోదీ రాకను పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ పార్కులో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భీమవరంలో ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. దిల్లీ నుంచి ప్రత్యేక రక్షణ దళం అధికారులు వచ్చి బందోబస్తు, నిఘా ఏర్పాట్లను చూస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ అధికారులు భీమవరంలోనే ఉండి శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సానిక అధికారులతో సమీక్షిస్తున్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యటన ప్రాంతాలను, బహిరంగ సభ ప్రాంగణాన్ని శుభ్రం చేయిస్తున్నారు. పెదఅమిరంలో బహిరంగ సభ ప్రాంగణంలో కంకర, నల్ల మెటల్‌ వేసి చదును చేయించారు. వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు. వీటికింద కనీసం 45 వేల మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బహిరంగ సభకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. వేలాది వాహనాలను నిలిపేందుకు స్థలాలను కేటాయించారు. కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి వచ్చే అవకాశాలున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సైతం ఉత్సవ కమిటీ తరఫున ఆహ్వానం అందింది. ఆయన హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్యకర్తలను భారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భాజపా యువమోర్చా తరఫున భీమవరం చుట్టుపక్కల ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యారులు సభకు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజనులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈమేరకు భీమవరం పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 1, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.