ETV Bharat / state

నాడు ప్రధానికి లేని చెక్‌ పవర్‌ సర్పంచ్‌కి - నేడు పంచాయతీల ఖాతాల్లో నిధుల్లేకుండా ఊడ్చేసిన జగన్ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 9:24 AM IST

Updated : Dec 15, 2023, 11:55 AM IST

CM Jagan Cheating Sarpanches: దేశానికి గ్రామాలే పట్టుకొమ్ములు అంటారు. ప్రజల ఎన్నుకున్న సర్పంచ్‌ ఆ గ్రామానికి రారాజు. ఇదంతా ఒకప్పుడు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పరిస్థితి అంతా తారుమారైంది. రారాజుల్లా ఉండాల్సిన సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాంలా మారారు. అధికారాలేమీ లేని ఓ కీలుబొమ్మలా తయారయ్యారు. జగన్‌ పాలనలో గ్రామ సచివాలయమే ప్రధానమవ్వగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సర్పంచ్‌ ఆధ్వర్యంలో జరిగే గ్రామసభ కాస్త డమ్మీ అయింది. హక్కుల కోసం పోరాడి సర్పంచులు అలసిపోతున్నారు తప్ప జగన్‌ ప్రభుత్వానికి మాత్రం కనికరం కలగడం లేదు.

CM_Jagan_Cheating_Sarpanches
CM_Jagan_Cheating_Sarpanches

నాడు ప్రధానికి లేని చెక్‌ పవర్‌ సర్పంచ్‌కి - నేడ పంచాయతీల ఖాతాల్లో నిధుల్లేకుండా ఊడ్చేసిన జగన్ ప్రభుత్వం

CM Jagan Cheating Sarpanches : నాడు దేశంలో ప్రధానికి కూడా లేని చెక్‌ పవర్‌ సర్పంచ్‌కి ఉండేది. నేడు చెక్‌ పవర్‌ అలాగే ఉంది కానీ జగన్‌ ప్రభుత్వం సర్పంచ్‌ల పవరే లాగేసింది. పంచాయతీల ఖాతాల్లో నిధుల్లేకుండా ఊడ్చేస్తోంది. గతంలో గ్రామానికి కావాల్సినవన్నీ సర్పంచ్‌లే నిర్ణయించేవారు. గ్రామ సభలో నిర్ణయాలు తీసుకునేవారు. నరేగాలో నిధులతో దర్జాగా రోడ్లు వేయించేవారు. కాలువలు తవ్వించేవారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగి సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టకముందే జగన్‌ ప్రభుత్వం నరేగా నిధులకు ఎసరు పెట్టేసింది. ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు లాంటి భవనాల నిర్మాణానికి వాడేసింది.

సర్పంచ్‌ల 'నాడు-నేడు' పరిస్థితి:-

  • నాడు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులే పంచాయతీకి ప్రధాన ఆలంబనగా ఉండేవి వాటితోనే మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనుల్ని చేసేవారు. నేడు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుంది. వాటిని మళ్లించి విద్యుత్‌ బకాయిలు, ఇతర పద్దులకు జమ చేసేస్తోంది. దీంతో పంచాయతీల ఖాతాలన్నీ ఖాళీ అయిపోయి పనులేమీ చేయలేక గ్రామస్ధుల ముందు సర్పంచులు తెల్లముఖం వేయాల్సిన దుస్థితి నెలకొంది.
  • అప్పట్లో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, చెత్త నుంచి ఎరువులు తయారు చేసే కేంద్రాలు లాంటివి సర్పంచ్‌ల పర్యవేక్షణలోనే నడిచేవి. ఇప్పుడు ఎరువులు ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎప్పుడో మూతపడ్డాయి. నిర్వహణ లేక వీధి దీపాలు వెలగడం లేదు. ఒక్క కిలోమీటరు సిమెంట్‌ రోడ్డు వేయడానికీ డబ్బుల్లేవు. పారిశుద్ధ్య నిర్వహణ లేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి.
  • నాడు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను సర్పంచులే ఎంపిక చేసేవారు. పథకాల అమల్లో వారే క్రియాశీలంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం సర్పంచ్‌లకు సమాచారమే ఉండట్లేదు. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల అమలు వరకు అంతా సచివాలయ ఉద్యోగులేదే పెత్తనం.
  • నాడు సర్పంచ్‌ అంటే గ్రామస్థులకు ఒక గౌరవం. కాస్త శ్రద్ధగా, నిబద్ధతతో పనిచేసే వారినైతే ప్రజలు మరింత అభిమానంగా చూసుకునేవారు. అలాగే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాన్న తృప్తి, ప్రజలు చూపించే ఆదరణతో కలిగిన సంతోషంతో సర్పంచ్‌ల ముఖాల్లో నవ్వులు విరిసేవి. నేడు చాలా చోట్ల గ్రామ వాలంటీర్‌కి ఉన్న గౌరవం కూడా సర్పంచ్‌కు ఉండట్లేదు. వాలంటీర్లు నెల నెలా ఇళ్లకు వెళ్లి పింఛన్లయినా ఇస్తున్నారు. సర్పంచ్‌లకు ఆ మాత్రం పనీ లేదు.

పంచాయతీలకు శాపంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు - నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచులు

Sarpanches Situation under YSRCP Government : నిధులన్నీ ప్రభుత్వం ఎత్తుకుపోవడంతో గ్రామాల్లో అవసరమైన కనీస పనులూ చేయలేక, ఎన్నుకున్న ప్రజలకు ముఖం చూపించలేక కుమిలిపోతున్నారు. భిక్షమెత్తుతూ, రోడ్లు ఊడుస్తూ, బూట్లు తుడుస్తూ వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. కానీ జగన్‌ ప్రభుత్వంలో మాత్రం మార్పు రాలేదు.

Sarpanches Problems in AP : సర్పంచ్‌ల్ని ఉత్సవ విగ్రహాల్లా మార్చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీలకు సర్వాధికారాలు కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ సచివాలయాల పేరుతో ఒక సమాంతర వ్యవస్థను తీసుకొచ్చింది. సర్పంచులకు ఉన్న కొద్దిపాటి అధికారాల్నీ జగన్‌ సర్కార్‌ లాగేసుకుంది.

జగన్‌ సర్కార్‌ 2019 అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పంచాయతీల నియంత్రణలో ప్రజలకు సేవలందిస్తారని చెప్పింది. సచివాలయ ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేసే అధికారమూ సర్పంచ్‌లకే ఇస్తున్నామని నమ్మబలికింది. ఆ మేరకు ఒక జీవో కూడా ఇచ్చేసింది. కానీ 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తర్వాత సచివాలయాలపై సర్పంచ్‌ల నియంత్రణ పూర్తిగా తొలగించింది. సచివాలయాలపై ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖను సృష్టించింది.

AP Government Diverted Central Finance Corporation Funds : కేంద్రం ఇచ్చే నిధులకు కొంత నిధులిచ్చి పంచాయతీలను పరిపుష్ఠం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక దొంగలా వ్యవహరించింది. 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లోంచి సర్పంచులకు తెలియకుండా గత రెండున్నరేళ్లలో 15 వందల 97 కోట్ల విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించింది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా పంచాయతీ పీడీ ఖాతాల్లోని నిధుల్ని విద్యుత్తు పంపిణీ సంస్థలకు బదిలీ చేసింది.

AP Sarpanch Association Protests For Panchayat Funds: రాష్ట్రంలో పలుచోట్ల సర్పంచుల ఆందోళన.."నిధుల మళ్లింపుపై సీబీఐ విచారణ జరిపించాలి"

పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిలోనే ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మొత్తం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గాలికొదిలేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా కేంద్రం విడుదల చేసిన 6వందల 89 కోట్ల 29 లక్షల్లో 3వందల 52 కోట్ల 42 లక్షలు డిస్కంలకు మళ్లించి, మిగిలిన 3వందల 36 కోట్ల 83 లక్షలు మాత్రమే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో వేసింది.


బాధ్యతలు చేపట్టకముందే నిధులు మాయం : పంచాయతీల్లో కొత్త పనులు చేయడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్, కేంద్ర ఆర్థిక సంఘం నిధులే ప్రధాన ఆధారం. అయితే జగన్‌ సర్కార్‌ గ్రామాల్లోని మౌలిక వసతుల్ని గాలికొదిలేసింది. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాల భవన నిర్మాణాలకు నరేగా నిధులు కేటాయించింది. సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టకముందే ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి 9 వేల కోట్ల నిధులు ఖర్చుపెట్టేసింది.

మోసపోయిన సర్పంచ్‌లు ముందుకు రావడం లేదు : గడచిన రెండున్నరేళ్లుగా నరేగా కింద వచ్చిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులన్నీ నిర్మాణంలో ఉన్న భవనాలకే వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ పంచాయతీల్నీ పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో రహదారులు, కాలువల పనులకు మండలానికి 60 లక్షల రూపాయల చొప్పున నరేగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ జగన్‌ ప్రభుత్వంలో మోసపోయిన సర్పంచ్‌లు పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో? లేదోనని ముందుకు రావడం లేదు.

కేంద్రం హెచ్చరింకలు, ఆర్థిక సంఘం ఏర్పాటు : పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు కావాలి. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. 2015లో ఏర్పడిన నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం 2020లో ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల నివేదికే ఇప్పటికీ వెలుగే చూడలేదు. సిఫార్సులు అమలు చేస్తే పంచాయతీలకు వెయ్యి కోట్ల వరకు నిధులివ్వాల్సి వస్తుందని ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.

ఆర్థిక సంఘం నిధులు నిలిపి వేస్తామని కేంద్రం హెచ్చరించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేసింది. ఇది ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. వృత్తి పన్ను, తలసరి ఆదాయం, సీనరేజి, స్టాంపు డ్యూటీ కింద పంచాయతీలకు కేటాయించాల్సిన నిధుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తోంది..

Sarpanches Problems in AP: నిధుల కొరతతో సర్పంచుల అవస్థలు.. బ్లీచింగ్​కూ డబ్బుల్లేని పరిస్థితి

Last Updated : Dec 15, 2023, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.