ETV Bharat / state

Sarpanches Problems in AP: నిధుల కొరతతో సర్పంచుల అవస్థలు.. బ్లీచింగ్​కూ డబ్బుల్లేని పరిస్థితి

author img

By

Published : Jul 31, 2023, 4:27 PM IST

Sarpanches Problems Due to Lack of Funds: గ్రామ పంచాయతీల గల్లా పెట్టె ఖాళీ అయింది. కేంద్రం విడుదల చేసిన ఆర్థికసంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంతో సర్పంచ్‌ల దగ్గర చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనీస అవసరాలు తీర్చేందుకు ఆందోళనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అభివృద్ధి పనుల మాటదేవుడెరుగు.. వర్షాకాలం కనీసం బ్లీచింగ్‌ చల్లించడానికీ డబ్బులు లేక సర్పంచ్‌లు అవస్థలు పడుతున్నారు.

Sarpanches Problems
సర్పంచ్‌ల సమస్యలు

నిధులు కొరతతో సర్పంచుల అవస్థలు

Sarpanches Problems Due to Lack of Funds: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. గ్రామాల్లో తట్టమట్టి ఎత్తడానికి కూడా రూపాయి లేక సర్పంచ్‌లు దీనావస్థలో ఉన్నారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా ఉన్న చిన్న పంచాయతీలకు కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులే ఆధారం. వీటితో పాటు గ్రామాల పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్లు, మైనింగ్ సెస్‌ ఛార్జీలతోనే మనుగడ సాగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆ ఛార్జీల సొమ్మును జమ చేయకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన రూ. 689 కోట్ల నిధులను సైతం దారిమళ్లించింది.

గ్రామ పంచాయతీలకు కేంద్రం మే నెలలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా రెండు నెలలు తమవద్దే ఉంచుకుని ఇతర అవసరాలకు వాడుకుంది. దీంతో పంచాయతీల్లో నిధులు లేవు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు ఇవన్నీ కూడా పంచాయతీల్లో వచ్చే అరకొర ఆదాయం నుంచే చెల్లించాల్సి వస్తోంది.

సర్పంచ్‌లు రెండు నెలలుగా ఆందోళన చేయగా.. 360 కోట్లు మాత్రమే పంచాయతీల ఖాతాల్లోకి వేసింది. మిగతా నిధుల్ని కరెంటు బిల్లుల బకాయిల పేరిట తీసేసుకుంది. ఆర్థిక సంఘం నిధులు వస్తే తప్ప గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేమని సర్పంచ్‌లు వాపోతున్నారు. మేజరు పంచాయతీలలో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సర్పంచ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అప్పులు చేసి చేయించిన పనులకే బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు తెలిపారు.

మురుగు తీయడానికి, చెత్తను శుభ్రం చేయడానికి, బ్లీచింగ్‌కు కూడా పంచాయతీల ఖాతాల్లో సొమ్ములు లేవు. వీధి దీపాలు మరమ్మతు చేయించకపోవడంతో చీకట్లలోనే పల్లెవాసులు కాలం గడుపుతున్నారు. వర్షాకాలంలో మురుగు కాలువలు శుభ్రం చేయడానికి.. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడానికి నిధులు లేకపోవడంతో.. పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త తీయటం లేదని, మురుగు నీరు ఇళ్లలోకి వస్తోందని చాలాచోట్ల ప్రజలు వాపోతున్న పరిస్థితి.

మురుగు ప్రవహించే ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లడానికి కూడా అప్పుల కోసం చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో అత్యవసరమైన పనులు చేయడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు పాత బకాయిలకే సరిపోతాయని.. కొత్తగా ఎక్కడా అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదని సర్పంచులు వాపోతున్నారు.

"పంచాయతీలలో ఏ పనిచేయాలన్నా ఖర్చుతో కూడుకున్నదే. ఈ వర్షాకాలంలో ఏ పని చేయించాలన్నా సరే డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది. పూర్తిగా నిధులు అన్నీ కట్ చేసి.. ఏదో అరకొరగా వేశారు. ఆ నిధులుతో పంచాయతీల మనుగడ సాధ్యం కాదు". - మనోహర్, బండారుపల్లి సర్పంచ్

"లోటు బడ్జెట్ కారణంగా గ్రామంలో శానిటేషన్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. శానిటేషన్ సరిగ్గా లేని కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేయడానికి.. నిధులను ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటున్నాం". - మబ్బు శిరీష, జొన్నలగడ్డ సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.