ETV Bharat / state

అంతర్వేది ఘటనపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు

author img

By

Published : Sep 7, 2020, 10:50 AM IST

Updated : Sep 7, 2020, 12:46 PM IST

అంతర్వేది ఆలయ రథం అగ్నికి ఆహుతవ్వడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ సంఘటనా ఎలా జరిగింది అనే అంశాలపై కీలక శాఖల బృందాలు ఆరా తీస్తున్నారు. నిఘా వైఫల్యం, భద్రతా చర్యల్లో లోపాలను తెలుసుకుంటున్నారు. రథాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ , ఎంపీ అనురాధ, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌ పరిశీలించారు.

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
అంతర్వేది ఆలయ రథం కారణాల అన్వేషణలో కీలక శాఖల బృందం

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
రథాన్ని పరిశీలించి వస్తున్న మంత్రి వేణు, ఎంపీ అనురాధ, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌

అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామివారి దివ్య రథం అగ్నికీలల్లో కాలిపోయిన ఘటన భక్తులను కలచివేసింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ఆలయ ప్రాంగణంలోని రథాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా అగ్నికీలలు ఆవహించాయి.. ప్రమాదాన్ని గుర్తించి.. అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇవ్వడం.. అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్షలాది భక్తజనం మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని కొందరు.. భద్రతా చర్యల్లో వైఫల్యమే కారణమని మరికొందరు.. ఆరోపించారు. ప్రమాదం అనంతరం ఆలయ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి సమగ్ర విచారణ జరపపడంతోపాటు.. రథం పునర్నిర్మాణానికి హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కారణం ఏమిటి..?

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
సంఘటనా స్థలంలో డీఐజీ మోహన్‌రావు, ఎస్పీ అద్నాన్‌నయీమ్‌ అస్మి

రథం అగ్నికి ఆహుతి కావడం వివాదాస్పదం కావడంతో విచారణకు దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారిని నియమించింది. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆదేశాల మేరకు రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా తిరుగుతున్న పశ్చిమ్‌ బంగాకు చెందిన ఓ మానసిక రోగితోపాటు మరికొందర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలోని తేనెపట్టుకు పొగ పెట్టడానికి కొందరు ప్రయత్నించారని.. ఈ క్రమంలో నిప్పు రవ్వలు తాటాకులపై పడి అంటుకుని ఉంటాయనే దిశగానూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలో పొడవైన కర్రను కూడా గుర్తించినట్లు సమాచారం.

తేరుకుని.. చేరుకునేలోగా..

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
ఘటనపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, విచారణ అధికారి రామచంద్ర మోహన్‌

మంటలను శనివారం రాత్రి 1.30 గంటలకు అక్కడి కాపలాదారు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. 30 కి.మీ దూరంలో ఉన్న రాజోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను ఆర్పారు. రాత్రి 3.15 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని 4.30 గంటల కల్లా మంటలను ఆర్పినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు చెప్పారు. తక్షణం స్పందించేలా ఆలయ ప్రాంగణంలోనే అగ్నిమాపక పరికరాలు కూడా అందుబాటులో లేవన్న వాదన వినిపిస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికే తీవ్ర జాప్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిఘా నిద్దరోయింది..

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
పనిచేయని సీసీ కెమెరా

అంతర్వేది నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆలయంలో మొత్తం 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది పనిచేయడం లేదు. రథానికి సమీపంలోని సీసీ కెమెరా నెల రోజులుగా పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోలేదనే వాదన స్థానికంగా వినిపించింది. ఇటీవల వర్షాల కారణంగా రెండు వారాలుగా సాంకేతిక సమస్య ఎదురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కెమెరా పనిచేసిఉంటే ప్రమాదానికి కారణంపై స్పష్టత వచ్చేది.

ఆలయానికి ఇన్‌ఛార్జి అధికారిగా వ్యవహరిస్తున్న దేవాదాయ ఏసీ చక్రధరరావు అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి పూర్తి బాధ్యతలతో పాటు తలుపులమ్మలోవ ఆలయానికి కూడా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడానికి ప్రధాన కారణం ఇదేనని పలువురు ఆరోపిస్తున్నారు. అదనపు బాధ్యతలు అప్పగించేటప్పుడు సమీపంలోని ఆలయాలకు కాకుండా దూరం.. దూరం ఉన్న ఆలయాల బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆలయంలో 85 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది రెగ్యులర్‌ సిబ్బంది కాగా మిగిలిన 68 మంది ఎన్‌ఎంఆర్‌లు, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు ఎన్‌ఎంఆర్‌లు మాత్రమే విధుల్లో ఉన్నారు. రథం చాలా వరకు కాలిపోయిన తర్వాత గానీ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

తలుపులు లేకపోవడంతో..

Antarvedi Temple Chariot A team of key branches in the search for causes
స్వామివారి రథం ఉంచే భవనం (దాచిన చిత్రం)

ఆలయ ప్రాంగణంలో 40 అడుగుల ఎత్తున్న రథాన్ని శ్లాబుతో నిర్మితమైన 50 అడుగుల షెడ్డులో ఉంచారు. ముందు భాగంలో ఎండ, వాన తగలకుండా తలుపు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం తాటాకులు, ప్లాస్టిక్‌ తాడులతో కూడిన తాత్కాలిక అడ్డుగోడ ఏర్పాటు చేశారు. రథం ఉంచే షెడ్డుకు ఎలాంటి విద్యుత్తు వైరింగ్‌ గానీ, సౌకర్యం గానీ ఏర్పాటుచేయలేదు. పై నుంచి కూడా ఎలాంటి తీగలు లేవు. దీంతో అగ్నిప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

కీలక శాఖలతో కమిటీ

అంతర్వేది ఆలయంలో అగ్నిప్రమాదంపై విచారణ చేయిస్తున్నాం. ఇప్పటికే పలువురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేశాం. అంతర్వేదిలో ఫిబ్రవరిలో ఉత్సవాలకు కొత్త రథం సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దేవాదాయ ఇంజినీర్‌ పర్యవేక్షణలో ఈపనులు త్వరితగతిన చేపడతాం. ఇటీవల వర్షాల కారణంగా సీసీ కెమెరాల్లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు ఈవో చెబుతున్నారు. వాస్తవం ఏంటో తెలుసుకుంటాం.

- డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

సమగ్ర విచారణ జరుపుతాం..

ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరా పనిచేయకపోవడంతో సమస్య వచ్చింది. రాజోలు సీఐకి విచారణ బాధ్యతలు అప్పగించాం. ఇప్పటికే రెండు, మూడు ఆధారాలు దొరికాయి. వీటితోపాటు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం.

- అద్నాన్‌ నయీం అస్మి, జిల్లా ఎస్పీ

కఠినంగా శిక్షిస్తాం

రథం కాలేందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం. దీనిపై సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. వచ్చే కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని తయారు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భక్తులు సంయమనం పాటించాలి.

-చెల్లుబోయిన వేణు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఇదీ చూడండి. రథం దగ్ధం ఘటనపై తెదేపా నిజ నిర్ధరణ కమిటీ

Last Updated :Sep 7, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.