వైసీపీకీ బుద్ధి చెప్పండి.. టీడీపీ అభ్యర్థులను గెలిపించండి': చంద్రబాబు బహిరంగ లేఖ

author img

By

Published : Mar 11, 2023, 4:48 PM IST

Updated : Mar 12, 2023, 6:07 AM IST

CBN Open letter

TDP chief Chandrababu open letter on MLC election: ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న వైసీపీకీ బుద్ధి చెప్పాలని, తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలతో అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులైన.. చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్‌తో అవగాహనకు వచ్చామని.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని, పీడీఎఫ్‌కు ఓటేసినవారు రెండో ప్రాధాన్య ఓటు టీడీపీకి వేయాలని ఓటర్లకు చంద్రబాబు సూచించారు.

TDP chief Chandrababu open letter on MLC election: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకూ చేసిన దుర్మర్గాలు, అరాచకాలు, అవినీతి గురించి ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ.. పలు కీలక అంశాలను వివరించారు.

లేఖలో ఏముదంటే?: ''ప్రియమైన రాష్ట్ర ప్రజలకు..! మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం నిరంతరం దాడికి గురవుతూనే వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెెడ్డి కనుసన్నల్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతంగా మారిన పరిణామాలపై ప్రజలకు, ఓటర్లకు వాస్తవాలను తెలియజేసేందుకే ఈ బహిరంగ లేఖను రాస్తున్నాను.

అధికారం అంటే ఒక ఉన్నతమైన బాధ్యత. ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసేందుకు లభించిన అవకాశం అని భావించే పార్టీ టీడీపీ. ప్రజల అవసరాలు, యువత భవిష్యతును దృష్టిలో పెట్టుకొని.. పాలన చేసిన పార్టీ తెలుగుదేశం. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించి యువత భవితకు బాటలు వేశాం. 6లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారికి అండగా నిలిచాం. అయితే, నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్ అంధకారం అయ్యింది. నేడు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ గురించి, డీయస్సీ గురించి ఎలా మోసం చేసిందో కూడా చూశాం.

ఇక ప్రభుత్వంలో భాగం అయిన ఉద్యోగులకు ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఇచ్చాం. రాష్ట్ర విభజన సమయంలో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. వారికి తగు గౌరవం ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్మెంట్ కాదు కదా.. కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా నేడు లేదు. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద పెట్టి ఎలా అవమానించారో కూడా రాష్ట్రం మొత్తం చూసింది. ఈ అన్ని అంశాలను యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను'' అని పేర్కొన్నారు.

వైసీపీకి బుద్ధి చెప్పండి- టీడీపీ అభ్యర్థులను గెలిపించండి: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పండి- తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి అంటూ చంద్రబాబు ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రలోభాలతో వైసీపీ అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ అభ్యర్థులైన చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్‌తో అవగాహనకు వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని, పీడీఎఫ్‌కు ఓటేసినవారు రెండో ప్రాధాన్య ఓటు టీడీపీకి వేయాలని చంద్రబాబు ఓటర్లకు సూచించారు.

వైసీపీ అక్రమాలకు, ఫోర్జరీలకు తెరతీసింది: అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైసీపీ తెరతీసిందని చంద్రబాబు ఆరోపించారు. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారని మండిపడ్డారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేల పైగా దొంగ ఓట్లను చేర్పించారని ఆయన ధ్వజమెత్తారు. మూడు పట్టభద్రులు ఎన్నికల ఓటర్ల జాబితాలో 20-30శాతం వరకు దొంగ ఓట్లు ఉన్నాయని పరిశీలనలో తేలిందన్నారు. దొంగ సర్టిఫికెట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు పొందటం తీవ్ర నేరమన్న చంద్రబాబు.. దీనికి పాల్పడినవారు శిక్షార్హులవుతారని హెచ్చరించారు.

రసవత్తరంగా మారిన పోటీ: మరోపక్క ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రంలో 10 మంది ఎమ్మెల్యేల సంతకం కావాల్సి ఉండగా, పార్టీ శాసన సభ్యులు కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుని ఈ మేర ప్రక్రియ పూర్తి చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి జరిగే ఈ ఎన్నిక ప్రక్రియలో ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 నుంచి 23 వరకూ మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం ఉంటుంది.

ఆ మాజిక్‌ ఫిగర్‌ను చేరుకోకుంటే అభ్యర్థుల గెలుపోటమిల్లో రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి. సాంకేతికంగా తెలుగుదేశం పార్టీకీ శాసనసభ పక్షంలో 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌లు వైసీపీలో చేరినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అటూ అధికార పార్టీ వైసీపీని పలువురు అసమ్మతి ఎమ్మెల్యేల సెగ వేధిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.

ఇవీ చదవండి

Last Updated :Mar 12, 2023, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.