ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. విశాఖలో వెండి బిస్కెట్లు కలకలం.. వీడియో వైరల్​

author img

By

Published : Mar 11, 2023, 10:45 AM IST

Updated : Mar 11, 2023, 11:29 AM IST

SILVER BISCUITS PACKING VIDEO VIRAL

SILVER BISCUITS PACKING VIDEO VIRAL : పట్టభద్రుల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు కోసం పట్టభద్రులను అన్ని రకాలుగా ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే తాజాగా వెండి బిస్కెట్లు ప్యాకింగ్‌ చేసి ఉంచారన్న వీడియోలు విశాఖపట్నంలో కలకలం రేపాయి.

SILVER BISCUITS PACKING VIDEO VIRAL : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. గెలుపు కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉద్యోగులను, పట్టభద్రులను కాకాపట్టడం కోసం శ్రమిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ అయినప్పటి నుంచే తాయిలాలను ఎరగా వేస్తున్నారు. తాజాగా ఇప్పుడు వెండి బిస్కెట్లను పంచడానికి ప్యాకింగ్​ చేసి ఉంచారన్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

పట్టభద్రుల ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ వెండి బిస్కెట్లు ప్యాకింగ్‌ చేసి ఉంచారన్న వీడియోలు రాష్ట్రంలో కలకలం రేపాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్‌ రోడ్డులోని మెజిస్టిక్‌ టవర్‌లోని 101వ ఫ్లాట్లో వెండిని పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు శుక్రవారం ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ ఫ్లాట్ వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్‌ కార్యాలయమని స్థానికులు చెబుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలపై స్పందించిన పీడీఎఫ్​ నాయకులు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అధికారులకు ఫిర్యాదు చేయగా.. సుమారు ఐదు గంటల తరువాత తనిఖీ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు, అధికారులు ఫ్లాట్ లోపలికి వెళ్లకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"ఆర్కే బీచ్​లోని మెజిస్టిక్​ టవర్స్​లోని 101 ప్లాట్​ నెంబర్​లో వెండి బిస్కెట్లు ప్యాకింగ్​ చేసి ఉన్నాయి. ఎన్నికలను ఎంత అవినీతి మయంగా చేస్తున్నారో దీనిని బట్టే అర్థమవుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోంది. పట్టభద్రులు ఇప్పటికైనా ఆలోచించాలని కోరుతున్న"-గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్​, విశాఖ

టీడీపీ, వామపక్ష నేతలను లోనికి అనుమతించని పోలీసులు.. రాత్రి 8 గంటల తర్వాత అధికార పార్టీకి చెందిన కొందరిని మాత్రం లోపలికి పంపడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే ప్యాకింగ్‌ చేసిన వెండి బిస్కెట్లు వేల సంఖ్యలో ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు ఎంతకీ వివరాలు వెల్లడించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్వంలో టీడీపీ నాయకులు, పీడీఎఫ్‌ ప్రతినిధులు అపార్టుమెంటు ఎదుట ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన అందరినీ పోలీసులు అడ్డుకున్నారు.

రాత్రి 10.30 గంటల తరువాత తనిఖీ బృందాలు వచ్చి, కార్యాలయంలో కేవలం కరపత్రాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోందని పీడీఎఫ్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క వెండి బిస్కెట్​ బరువు 15 గ్రాముల ఉంటుందని పీడీఎఫ్​ నాయకులు భావిస్తున్నారు. వెండి బిస్కెట్లను వైసీపీ అభ్యర్థి కార్యాలయం నుంచి వాహనాల్లో తరలించేశారని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీతంరాజు సుధాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. విశాఖలో వెండి బిస్కెట్లు కలకలం.. వీడియో వైరల్​

ఇవీ చదవండి:

Last Updated :Mar 11, 2023, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.