ETV Bharat / state

farmers fire on Jagan: బహిరంగ సభలో గొప్పగా ప్రకటించారు.. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారు: కుప్పం రైతులు

author img

By

Published : Jul 5, 2023, 10:45 AM IST

Jagan
Jagan

Kuppam constituency Farmers fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ హామీలపై కుప్పం నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల్లో కుప్పం కెనాల్‌ను పూర్తి చేస్తామని చెప్పి.. సంవత్సరం కాలం కావొస్తున్నా అతీగతీ లేదని విమర్శిస్తున్నారు. బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రకటించే హామీలన్నీ వట్టి నీటిమూటలని సంబోధిస్తున్నారు. ఇప్పటికైనా ఎత్తిపోతల పథకం, బ్రాంచ్ కెనాల్ పనులు ప్రారంభించి నీరు అందించాలని కోరుతున్నారు.

హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారు: కుప్పం రైతులు

Kuppam constituency Farmers fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గతకొన్ని నెలలుగా ఏ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన 'మాది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వం' అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతేకాకుండా, మరికొన్ని నెలల్లో ఇది చేస్తాం, అది చేస్తామంటూ రైతులకు, మహిళలకు హామీల మీద హామీలు ప్రకటిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో నెలలు గడుస్తున్నా ఆ హామీలు నేరవేరకపోవడంతో ప్రజలు, రైతులు, మహిళలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక.. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని ఆవేదన చెందుతున్నారు. నెల రోజుల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, 6 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాను (సీఎం జగన్‌) ఇచ్చిన హామీని మరొకసారి గుర్తు చేసుకుని.. ఎత్తిపోతల పథకం, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ప్రారంభించి.. నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

జగన్ మాటలన్నీ నీటిమూటలే.. జగన్ ఏలుబడిలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. రైతు ప్రభుత్వమంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప.. వాళ్లకు పనికొచ్చే ఒక్క పనీ చేయడం లేదు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారు. నాలుగేళ్లుగా పనులు ఇంచు కూడా ముందుకు సాగడం లేదు. దాని సంగతి అటుంచి.. నెల రోజుల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తామని చెప్పి, 6 నెలలు గడుస్తున్నా.. ఆ ఊసే ఎత్తడం లేదు. మిగిలిన 10 శాతం పనుల పూర్తికి నిధులు ఇవ్వడానికైనా ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు. జగన్ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయంటూ ప్రజలు, రైతులు మండిపడుతున్నారు.

ఆరు నెలల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తాం.. గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన కుప్పంలో వైఎస్సార్ చేయూత మూడో విడత నిధులను విడుద చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..''ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వామని గుర్తు పెట్టుకోండి. భరత్ తన నోటితో అడుగుతూ.. ఇంకా కొన్ని కుప్పంకి చేసేవి ఉన్నాయి అన్న అన్నారు.హెచ్‌ఎస్ఎన్ఎస్‌లో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను మరో ఆరు నెలల్లో పూర్తి చేసి, మీరే వచ్చి ప్రారంభించాలని అడిగారు. అది పూర్తి చేస్తానని ఈ సందర్బంగా హామీ ఇస్తున్నాను.'' అని అన్నారు. నెల రోజుల్లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని భరోసా ఇస్తున్నానని గొప్పగా ప్రకటించారు. కానీ, ఇప్పుడు కాలువ పనులు ఎంత వరకు వచ్చాయి..?, ప్రాజెక్టు పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై ఈటీవీ భారత్ పలుకరించగా.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

6 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు.. ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభల్లో చేసే ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని రైతులు వాపోతున్నారు. కుప్పం రైతులకు ఎంతో కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిగా గాలికొదిలేశారు. 6 నెలలు గడుస్తున్నా హామీలకు అతీగతీ లేదు. నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ భూములకు సాగునీటితో పాటు.. కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించేందుకు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టారు.

కెనాల్ పనులు ప్రారంభించండి మహోప్రభో.. రూ. 553 కోట్లతో 123 కిలోమీటర్ల మేర కాలువలు, మూడు లిఫ్ట్‌లు, 327 చిన్నపాటి వంతెనలు నిర్మించేలా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ రూపొందించారు. 2016 జనవరిలో ప్రారంభించి శరవేగంగా పనులు చేసి 2019 నాటికి దాదాపు 90 శాతం పనులు పూర్తిచేశారు. ప్రభుత్వం మారడమే అక్కడి రైతులకు శాపంగా మారింది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను కనీసం ముట్టుకోనేలేదు కూడా. రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల్లో చాలాచోట్ల కాలువ తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. తెలుగుదేశం హయాంలో 121 కిలోమీటర్ల మేర కాలువ తవ్వినా.. మిగిలిన 2 కిలోమీటర్ల పరిధిలో మట్టి తవ్వకాలను జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయింది. మరో 85 కోట్ల రూపాయలు వెచ్చిస్తే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తవుతాయి. చిన్నపాటి నిర్మాణాలు చేసి సాగు, తాగునీరు అందించే అవకాశమున్నా పట్టించుకోవట్లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎత్తిపోతల పథకం, బ్రాంచ్ కెనాల్ పనులు ప్రారంభించి నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.