ETV Bharat / state

జల్సాల కోసం చోరీలు.. 13 ద్విచక్ర వాహనాలతో పోలీసులకు చిక్కిన ముఠా

author img

By

Published : Mar 10, 2023, 2:21 PM IST

Accused of Stealing Bikes Arrested: పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాని.. బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Two wheeler thieves
ద్విచక్ర వాహనాల దొంగలు

Accused of Stealing Bikes Arrested: జల్సాలకు అలవాటుపడితే ఎంత డబ్బు అయినా సరే సరిపోదు అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. వాళ్లంతా జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకు డబ్బుల కోసం దొంగతనాన్నే ఎంచుకున్నారు. అలాంటి ఓ నలుగురికి పరిచయం ఏర్పడింది. ఇక ఇంకేం ఉంది.. అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా.. పలు దొంగతనాలను పాల్పడేవారు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేటకు చెందిన దంతాల ప్రవీణ్ కుమార్, మాచర్ల యేసు అలియాస్ వేణు, స్వర్ణ విజయ్, వీరబాబు ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు నలుగురూ చిలకలూరిపేటకు చెందిన వారు కాగా.. వీళ్లంతా చెడు వ్యసనాలకు అలవాటుపడి, వారి అవసరాలకు డబ్బులు చాలక పోవడంతో.. అక్రమ మార్గంలో అయినా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. దీని కోసం రాత్రి సమయంలో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయడం ప్రారంభించారు. అలా దొంగతనం చేసిన వాటిని.. అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉండేవారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉండేవారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో నలుగురూ కలిసి.. చిలకలూరి పేట, చుట్టుపక్కల మండలాలలో మోటారు సైకిళ్లను దొంగతనం చేసి.. వాటిని ఓ చోట పెట్టారు. వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులను అందరూ కలసి పంచుకోవాలని అనుకున్నారు. దొంగలించిన ద్విచక్ర వాహనాలను ఓ పాడుపడిన భవనంలో దాచి పెట్టారు. వీళ్లు కేవలం చిలకలూరి పేటలో మాత్రమే కాకుండా.. గుంటూరు, మార్టూరు, సత్తెనపల్లి, అద్దంకి, చీరాల, నరసారావు పేట తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డారు.

వాహనాల వివరాలు: గత సంవత్సరం అక్టోబరు నెలలో గుంటూరు టౌన్​లో ఒక మోటరు సైకిల్​ని, ఈ ఏడాది జనవరి నెలలో ఓ మోటార్ వాహనాన్ని, ఫిబ్రవరి నెలలో మూడు బైక్​లను, మార్చి నెలలో ఓ మూడు బైక్​లతో పాటు.. రెండు సైకిళ్లు దొంగలించారు. ఇవికాక నరసరావుపేట టౌన్​లో ఒక మోటరు సైకిల్, చీరాల ఏరియాలో మరొక మోటారు సైకిల్, గుంటూరు టౌన్​లో మరొక మోటారు సైకిల్​ని అలా చోరీ చేసిన 13 మోటారు సైకిళ్లను మార్టూరులో పాడుపడిన భవనంలో దాచి ఉంచారు.

నగరంలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో.. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వాటిపై గట్టి నిఘా పెట్టారు. దీంతో నలుగురు నిందితులనూ మార్టూరులో అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, రివార్డులు అందజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.